ఆ దేశంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఆర్థిక సంక్షోభం.. యుద్ధం ప్రకటిస్తున్న ప్రజలు

by Javid Pasha |   ( Updated:2022-03-31 01:41:51.0  )
ఆ దేశంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఆర్థిక సంక్షోభం.. యుద్ధం ప్రకటిస్తున్న ప్రజలు
X

దిశ, ఫీచర్స్: విదేశీ మారకద్రవ్య నిల్వలు కనీసంగా లేకుండా పోతే ఒక దేశం ఎంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందో ప్రస్తుతం శ్రీలంక కళ్లకు కట్టినట్లు చూసిస్తోంది. అంతేకాకుండా ప్రపంచ దేశాలకు ఎన్నో గుణపాఠాలు అందిస్తోంది. ప్రస్తుతం శ్రీలంకలో ప్రాణాధారమైన మందులు, శస్త్ర చికిత్సకు అవసరమైన సామగ్రి ఏమీ లేవు. వాటన్నింటితో పాటు అక్కడ విద్యుత్ సరఫరా కూడా లేదు. ప్రతి దేశం సాయంత్రం దాటితే విద్యుత్ దీపాల వెలుగులో మెరిపోతుంటే శ్రీలంక మాత్రం అంధకారంలో కొట్టిమిట్టాడుతోంది. సాయంత్రం అయిందే శ్రీలంక ప్రజల బ్రతుకుల్లో చిమ్మచీకట్లు కమ్ముకుంటున్నాయి. వీటన్నింటితో పాటు బోనస్‌గా కనీస నిత్యావసర వస్తువులు సైతం తీవ్ర కొరతలో ఉన్నాయి. ఒక పెట్రోల్ మాట పక్కన పెట్టాల్సిందే.. గంటలపాటు క్యూల్లో నిలుచున్నా చుక్క పెట్రోల్ కూడా దొరకని పరిస్థితి. ఇప్పటికే చేసుకున్న దిగుమతులకు చెల్లించేందుకు డబ్బు లేదు. దాంతో నిర్మాణ రంగానికి సిమెంట్ దొరకడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీలంకలోని 2 కోట్ల 20 లక్షలమంది ప్రజలకు కనీస నిత్యావసరాలు కరువయ్యాయి.


శ్రీలంక రాజధాని కొలంబో ఆ దేశ దుస్థితికి ప్రస్తుతం ప్రతీకగా నిలబడుతోంది. రోజంతా పొడవాటి క్యూలలో నిలబడి ఉక్కపోతకు తట్టుకోలేక రాజధాని వాసులు సొమ్మసిల్లి పోతున్నారు. ఇక సాయంత్రం తర్వాత విద్యుత్ కొరతతో క్యాండిల్స్ వెలుగులో గడపాల్సివస్తుంది. దాంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతున్నాయి. ఒక వైపు చమురు, కిరోసిన్ కోసం పగలంతా క్యూలో నిలబడటం, పెరిగిన ధరలతో కుటుంబానికి రోజువారీ అవసరమైన ఆహార పదార్థాలు కూడా సమకూర్చలేని దైన్యంతో జనం తమ ప్రభుత్వ నిర్వాకంపై మండిపడుతున్నారు. రాజధాని శివార్లలోని నిరుపేదలు కిరోసిన్ పొయ్యిలపైనే వంట చేయవలసి ఉంటుంది. దాంతో వారికి కావలసిన కిరోసిన్ కావాలంటే రోజుకు ఐదు, ఆరు గంటలు క్యూలో నిలబడటం గృహిణుల ప్రాణం మీదికొస్తుందంటే అతిశయోక్తి లేదు.

భర్త, పిల్లలు పనికి పోవడంతో వంటకు అవసరమైన కిరోసిన్ కోసం పగలు తిండి కూడా లేకుండా గంటలపాటు క్యూలో నిలబడి ఎండ బారిన పడాల్సి వస్తోంది. ఎండ తాపానికి కొందరు మహిళలు స్పృహ తప్పి ఆసుపత్రుల పాలవుతున్నారని కొలంబోలో ఒక మహిళ పేర్కొంది. పోర్టుల నుంచి ఇతర పట్టణ కేంద్రాలకు ఆహారం, నిర్మాణ సామగ్రిని తరలించే ట్రక్కులకు సైతం చమురు అందుబాటులో లేదు. దేశంలోని కొండ ప్రాంతాల నుంచి తేయాకును తీసుకురావడానికి సాధ్యపడటం లేదు. రాజధాని నగరంలో ప్రతినిత్యం రోజు కూలీలను ఒకచోటి నుంచి మరోచోటికి తీసుకెళ్లే బస్సులు మూలనపడ్డాయి.


కొన్ని ఆసుపత్రులు సాధారణ శస్త్రచికిత్సలను సైతం నిలిపివేశాయి. పేపర్లు, ఇంక్ లేక పాఠశాలల్లో పరీక్షలు కూడా నిలిపేశారు. గత 60 సంవత్సరాలుగా రాజధాని కొలంబోలో ఉంటున్నానని, ఇలాంటి దుస్థితిని ఎన్నడూ చూడలేదని ఓ మహిళ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేవు అని ఆమె పేర్కొంది. దేశంలో ప్రజలు ఆపసోపాలు పడుతున్నా రాజకీయ నేతలు మాత్రం ఇప్పటికీ విలాసవంతంగా బతుకుతున్నారని, ప్రజలు మాత్రం వీధుల్లో అడుక్కు తింటున్నామని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి రోజుకు పది గంటలపాటు విద్యుత్ కొరత అమలవుతోంది.

1970లలో ప్రపంచ చమురు సంక్షోభం ఎదుర్కొన్నప్పటి నుంచి రెండున్నర కోట్ల మందికిపైగా లంకవాసులు నిత్యావసరాల కొరతను ఎదుర్కొంటూనే వచ్చారు. చక్కెర వంటి నిత్యావసర సరుకులు రేషన్ రూపంలో అందిస్తున్నందున జనం సమస్యలు కొంతయినా తీరుతూ వచ్చాయి. కానీ 1948లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇంత దుస్థితి ఎన్నడూ చూడలేదని జనం ఘోష పెడుతున్నారు. దశాబ్దాల తరబడి సాగిన అంతర్యుద్ధం 2009లో ముగిసి దేశం కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ 2016లో వచ్చిన కరువుతో దేశంలోని రైతులు అల్లాడిపోయారు. ఇక 2019లో ఈస్టర్ ఆదివారం రోజున చర్చిలో ఇస్లామిస్టులు బాంబు దాడి చేసిన ఘటనలో 279 మంది ప్రజలు చనిపోయారు. దీంతో అంతవరకు దేశానికి విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెట్టిన పర్యాటక రంగం కుదేలైపోయింది.


ప్రభుత్వాల అసమర్థత, అవ్యవస్థ అసలు కారణం

కరోనా మహమ్మారితో పర్యాటక రంగం కుప్పకూలిపోయింది. ఇక శ్రీలంక ప్రజలు విదేశాల నుంచి పంపే డబ్బులు పూర్తిగా నిలిచిపోవడంతో విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో దిగుమతుల చెల్లింపునకు అవసరమైన డబ్బులు హరించుకుపోయాయి. పైగా దేశం తీసుకున్న 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణ సేవలకు చెల్లంపులు కూడా సాధ్యపడకుండా పోయింది. వీటన్నింటికంటే ప్రభుత్వం అసమర్థత, అవ్యవస్థ దేశం కుప్పగూలిపోవడానికి కారణమైందని కొలంబోలోని మేధో బృందాలు ఆరోపిస్తున్నాయి. సంవత్సరాలుగా లోటు బడ్జెట్లు, తప్పుడు సలహాలతో వన్ను కోతల కారణంగా ప్రభుత్వ రాబడి గణనీయంగా పడిపోయింది. ఇక విద్యుత్ సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు శ్రీలంకలోని సంపన్నులకే మేలు కలిగిస్తూ వచ్చాయి. సాధారణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని భారీ పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టులపై ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు. కొలంబోలో ఆకాశాన్నంటే ఎత్తులో వందల కోట్లు వెచ్చించి నిర్మించిన కమలం ఆకారంలోని ఆకాశ హర్మ్యం ఇప్పుడు నిద్రాణ స్థితిలో ఉంటోంది.


తప్పుడు పాలసీలు కొంప ముంచాయి

వీటన్నింటికీ తోడుగా ప్రభుత్వాల తప్పుడు విధానాలు సమస్యలను రెట్టింపు చేశాయి. గత సంవత్సరం శ్రీలంక, ప్రపంచంలోనే మొట్టమొదటి సేంద్రియ వ్యవసాయ దేశంగా మారుతోందని అధికారులు ప్రకటించడమే కాకుండా, రాత్రికి రాత్రే రసాయనిక ఎరువులను నిషేధించారు. దీంతో రైతులు తమ పొలాలను ఎండబెట్టారు. దాంతో అక్కడ ఆహార ధరలు చుక్కలంటాయి. నెలల తర్వాత ఈ విధానాన్ని ఉన్నట్టుండి ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన తర్వాత శ్రీలంక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి భారీ రుణాలకు ప్రయత్నిస్తోంది. ఈ సంవత్సరం చివరికి కానీ చర్చలు ముగిసే సూచన కనిపించకపోవడంతో ప్రజలు మరో 9 నెలలపాటు దుస్థితిని అనుభవించాల్సి ఉంటుందని సూచనలు వెలువడుతున్నాయి. కానీ ఈ సంక్షోభానికి మూలకారకులు ఇప్పటికీ ఆర్థిక నిర్వహణ బాధ్యతల్లో కొనసాగుతున్నందున శ్రీలంక కోలుకోవడం కష్టమేనని లంక మేధో బృందం చెబుతోంది.


అధ్యక్ష కార్యాలయంపై దాడి..

ప్రస్తుతం కొలంబోలోని ప్రధాన రహదారుల్లో వెలిగే వీధి లైట్లు అక్కడి సంపన్నుల వైభవాన్ని ప్రకాశింప చేస్తున్నాయి. కానీ, నగరంలోని చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకుపోయాయి. ప్రతిరోజూ గంటల పాటు విద్యుత్ కోతల వల్ల రెస్టారెంట్లు, వీధి మూలల్లో ఉండే స్టోర్లు కొవ్వొత్తులు వెలిగించి వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇతర వ్యాపార సంస్థలు సాయంత్రం తర్వాత గేట్లు మూసి వేస్తున్నాయి. ప్రజల్లో ఆగ్రహం, నిరాశ, నిస్పృహలు కట్టలు తెంచుకుంటున్నాయి. తమిళ టైగర్లను తుదముట్టించి అంతర్యుద్ధానికి ముగింపు పలికిన పాలక కుటుంబానికి చెందిన గొటబయ రాజపక్షా అసమర్థ పాలనను ప్రజలు ప్రస్తుతం దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో రాజపక్షా కుటుంబంపై ప్రజాభిమానం క్రమక్రమంగా కరిగిపోతోంది. ఈ నెల మొదట్లో అధ్యక్ష కార్యాలయంపై జనం దాడికి ప్రయత్నించారంటే అక్కడ ప్రభుత్పంపై అసమ్మతి ఎంతగా పేరుకుపోయిందో తెలుస్తుంది.


ప్రభుత్వంపై సోషల్ మీడియాలో యుద్ధం

ఇప్పుడు ప్రత్యక్ష నిరసనలు తగ్గుముఖం పట్టాయి. సోషల్ మీడియాలో లంక ప్రజలు తమ ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటిస్తున్నారు. రాత్రిపూట కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, శ్రీలంక కుప్పకూలిపోయిందని వామపక్ష ప్రతిపక్ష కూటమి నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న మహమ్మద్ అఫ్కర్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి తేల్చి చెబుతున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకం కూడా పోయిందని, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవని, చివరకు ఇంట్లో టీ కూడా చేసుకోలేకపోతున్నామని ఆ విద్యార్థి భాధను వెళ్లగక్కాడు. అతడి బాధ వ్యక్తిగతమైంది కాదు. అది మొత్తం శ్రీలంక ప్రజల సామూహికమైంది. ప్రభుత్వాలు ఎవరికోసం పనిచేయాలో, ప్రజాధనాన్ని దేనికి వెచ్చించాలో, వెచ్చించకుడదో ప్రపంచానికి అందిస్తున్న గుణపాఠమది.

Advertisement

Next Story