NIMS Hospital: నిమ్స్‌లో ఫైరవీ లేనిదే బెడ్లు దొరకవు..!

by S Gopi |   ( Updated:2022-07-28 12:34:28.0  )
Special Story On NIMS Hospital
X

దిశ, ఖైరతాబాద్: Special Story On NIMS Hospital| గతవారం రోజులుగా నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు దొరకక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగి కండీషన్ ఎంత సీరియస్ గా ఉన్నా ఫైరవీ లేనిదే బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు ఇలా ఎవరో ఒకరు సిఫారస్ చేస్తే గానీ రోగులను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా నిమ్స్ తీరు మారడం లేదని బాధిత రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పరీక్షల కోసం రోజుల తరబడి నిరీక్షణ

పరీక్షల నుంచి మొదలుకుని శస్త్ర చికిత్సలు పూర్తయి ఇంటికి వెళ్లడానికి పక్షం రోజుల నుంచి నెలల తరబడి రోగులు నిమ్స్ లో పడిగాపులు కాస్తున్నారు. ఓపీ తర్వాత డాక్టర్ కన్సల్టెంట్ పూర్తయ్యేవరకు ఒకరోజు పూర్తవుతుంది. డాక్టర్ కల్సల్టెంట్ తర్వాత పరీక్షల కోసం బిల్లు చెల్లించేందుకు క్యూలైన్ లో నిలబడ్డా పనికాదు. అయ్యో మీరు ఈ పరీక్షకు సంబంధించి కోడ్ రాయించకు రాలేదని తిరిగి పంపిస్తారు. అంతే ఆయాసపడుతూ కోడ్ కోసం మరో క్యూ.. డాక్టర్ పరీక్షలు రాసేటప్పుడే కోడ్ ఎందుకు వేయరో ఎవరికి అర్థం కాని పరిస్థితి నిమ్స్ లో నెలకొంది. తీరా కోడ్ రాసుకుని బిల్లు కట్టేందుకు వెళితే అక్కడా చాంతాడంతా క్యూలైన్ ఈ పద్మహ్యూహాన్ని ఛేదించుకుని పరీక్షల కోసం వెళితే అక్కడా అదేరోజు అపాయిమెంట్ దొరకదు. ఒక్కరోజు కావచ్చు.. రెండు రోజులు కావచ్చు. కొన్ని పరీక్షలకైతే వారం రోజులు కూడా పడుతోంది. తీరా పరీక్ష పూర్తయిన తర్వాత రిపోర్ట్ ల కోసం ఎదురు చూస్తే.. ఆ తర్వాత గానీ డాక్టర్ చూసి మందులు రాయడమో.. ఇతర చికిత్సలకు సిఫారస్ చేయడమో జరగదు. ఇది నిమ్స్ లో ఓపీ పేషెంట్ల పరిస్థితి.

ఎమర్జెన్సీ నుంచి డిపార్ట్ మెంట్లకు తరలించడంలో జాప్యం

నిమ్స్ యాజమాన్యం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల ఎమర్జెన్సీ వార్డులో రోగులు రోజుల తరబడి మగ్గిపోతున్నారు. కార్డియో, ఆర్థో లేదా ఏ ఇతర పరిస్థితుల్లో ఎమర్జెన్సీలో జాయిన్ అయిన పేషెంట్ ను సంబంధిత డిపార్ట్ మెంట్లకు పంపించడం లేదు. ఎమర్జెన్సీలో ప్రతి డిపార్టెమెంట్ కు చెందిన సీనియర్ డాక్టర్ అందుబాటులో ఉండక పోవడం, కొన్ని సందర్భాల్లో ఉన్నా పట్టించుకోక పోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో రోగులు పరీక్షలు పూర్తి చేసుకుని శస్త్ర చికిత్సకు సంబంధిత డిపార్ట్ మెంట్లకు వెళ్లడానికి వారాల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో ఎమర్జెన్సీ వార్డులో బెడ్ల కొరత ఏర్పడుతోంది. ఎమర్జెన్సీ వార్డులో రోజుల తరబడి రోగులు నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది.

ఫైరవీ లేనిదే పనికాదు..

నిమ్స్ లో ఫైరవీ లేనిదే పనికాని పరిస్థితి నెలకొంది. నువ్వు ఎప్పుడొచ్చావు అని కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అనే సినిమా డైలాగు ఇందుకు బాగా సరిపోతుంది. రోగం ఎంత పెద్దదన్నా కాని.. పరిస్థితి సీరియస్ గా ఉందా లేదా అవసరం లేదు... ఏ నాయకుడు ఫోన్ చేశాడు.. ఏ అధికారి సిఫారస్ చేశాడు... అన్నదే ఇక్కడ ప్రధానం. నిమ్స్ డైరెక్టర్ ఆఫీస్, మెడికల్ సూపరిండెంట్ ఆఫీస్, ఆర్ఎంవో ఆఫీస్ ఇలా ఎవరో ఒకరి ఆఫీస్ నుంచి ఫోన్ పోతే గానీ రోగులకు న్యాయం జరగని పరిస్థితి నెలకొంది. అన్ని డిపార్ట్ మెంట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. కింది స్థాయి సిబ్బంది నుంచి మొదలు కొని ఉన్నతాధికారుల వరకు ఇదే తీరు. ఫలితంగా నిమ్స్ పైరవీకారుల కేంద్రంగా తయారైంది.

ఇది కూడా చదవండి: వేములవాడ ఆసుపత్రి సిబ్బందిని ప్రశంసలతో ముంచెత్తిన కేటీఆర్

Advertisement

Next Story

Most Viewed