టీఆర్ఎస్ క్యాడర్‌లో నిస్తేజం... నాన్చుడు ఎక్కువైందంటా...

by S Gopi |   ( Updated:2022-07-27 12:46:53.0  )
టీఆర్ఎస్ క్యాడర్‌లో నిస్తేజం... నాన్చుడు ఎక్కువైందంటా...
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అధికార టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు అక్కడి క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తోంది. స్పష్టమైన వైఖరి అవలంభించకపోవడంతో లోకల్ లీడర్స్ ముందుకా వెనక్కా అన్న పజిల్ లో కొట్టుమిట్టాడుతున్నారు. ఫటాఫట్ నిర్ణయాలు తీసుకునే అధినాయకత్వం ఇక్కడి విషయంలో మాత్రం ఎందుకలా వ్యవహరిస్తోంది అన్నదే మిస్టరీగా మారింది. లీడర్... క్యాడర్ మధ్య పెరుగుతున్న ఈ గ్యాప్ ప్రభావం ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూర్చుతోందన్న ఆందోళనలో కొందరు ఉంటే, తాము ఎటు వైపు ఉండాలోనన్నది తెలియక గందరగోళంలో పడిపోతున్నారు.


జిగ్ జాగ్ లో మంథని క్యాడర్...

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంపై టీఆర్ఎస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు అంత్యంత విచిత్రంగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుపై అధిష్టానం ఎలాంటి అభిప్రాయంతో ఉందన్నది అంతుచిక్కకపోడంతో క్యాడర్ లో అయోమయం నెలకొంది. హై కమండ్ వ్యవహరిస్తున్న తీరు వల్ల నియోజకవర్గంలో పార్టీ బలహీనపడిపోతోందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. అధినాయకత్వం స్పష్టంగా వ్యవహరించినట్టయితే ఇలాంటి పరిస్థితి ఎదురుకాదన్న వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు పుట్ట మధుపై అధిష్టానం ఆగ్రహంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ వచ్చే అవకాశాలే లేవన్న ప్రచారం బలంగా వినిపించింది. అంతకుముందు పార్టీ ఇంచార్జీ బాధ్యతల నుండి తప్పిస్తున్నారని కొత్తవారిని నియమిస్తున్నారని కూడా చెప్పుకున్నవారూ లేకపోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపులో మంథని స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం అయిన కేటీఆర్ మంథనికి టీఆర్ఎస్ ప్రతినిధి పుట్ట మధేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే టికెట్ వస్తుందన్న స్థాయిలో కేటీఆర్ ప్రకటనలు చేశారు. దీంతో అప్పటివరకు స్తబ్దంగా ఉన్న మంథని టీఆర్ఎస్ లో మళ్లీ ఉత్సాహం నెలకొన్నట్టయింది. ఆ తరువాత జరిగిన ఒకటి రెండు అధికారిక సమావేశాలకు పుట్ట మధును ఆహ్వానించకపోవడంతో ఆయన్ని పక్కకు పెడుతున్నారంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. మంత్రి హరీష్ రావు టూర్ షెడ్యూల్ క్యాన్సిల్ అయిన విషయంలోనూ దాదాపు ఇదే చర్చ జరిగినప్పటికీ అనూహ్యంగా మూడోసారి మంత్రి మంథని టూర్ కు రావడంతో పుట్ట మధు అసమ్మతి వర్గం ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. తాజాగా మంథని ఎమ్మెల్యే బరిలో మరో నేత అంటూ కూడా ప్రచారం మొదలు కావడంతో క్యాడర్ ఆయన వైపు వెళ్లాలా లేక పుట్ట మధు పంచనే ఉండిపోవాలా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతోంది.


నామినేటెడ్ విషయంలో ఇలా...

అయితే నియోజకవర్గంలోని నామినేటెడ్ పదవుల పందేరం విషయంలో అధిష్టానం ఎందుకు అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోందన్నదే క్యాడర్ కు అంతుచిక్కకుండా తయారైంది. నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీలతోపాటు ఇతర నామినేటెడ్ పోస్టులకు జాబితాను తయారు చేసి పుట్ట మధు అధిష్టానానికి పంపించినా ఈ మేరకు జీఓ మాత్రం విడుదల కాలేదు. ఆ తరువాత ఇతర నియోజకవర్గాల నుండి పంపించినవారి నియామక ఉత్తర్వులు విడుదల అయినప్పటికీ మంథని విషయంలో మాత్రం అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం విడ్డూరం. పార్టీతో అనుబంధం పెట్టుకున్న వారికి కనీసం నామినేటెడ్ పదవులు కట్టబెట్టే విషయంలో అయినా అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


నిస్తేజంలో...

అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుకు మంథనిలో జరుగుతున్న ప్రచారంతో గులాబి పంచన ఉన్న ద్వితీయ శ్రేణి నాయకుల్లో నిస్తేజం నెలకొందన్నది మాత్రం వాస్తవం. ఇంచార్జీగా వ్యవహరిస్తున్న మధు విషయంలో జరుగుతున్న ప్రచారం విషయంలో అధిష్టానం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తుండడం వల్ల ఇప్పటికే సెకండ్ క్యాడర్ కొంత ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తమ నియోజకర్గానికి నాయకుడు ఉన్నా చుక్కాని లేని నావలా తయారైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రానున్న ఎన్నికల నాటికి మంథని టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతోందోనన్న ఆందోళన ఇక్కడి సీనియర్ నేతల్లో నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed