లక్ష్యం పెద్దది, ఆశయం గొప్పది... ఆచరణలో పెడితే బడికి పునర్జీవనం

by S Gopi |
లక్ష్యం పెద్దది, ఆశయం గొప్పది... ఆచరణలో పెడితే బడికి పునర్జీవనం
X

దిశ, ఖానాపూర్: దేశ భవిత పాఠశాల తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటది. నేటి విద్యార్థులే రేపటి భావి భారత డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులు, సైనికులుగా మారి భవిష్యత్ దేశానికి దిశా నిర్దేశం చేస్తారు. అంటే తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరుగుతుంది. ఇది గుర్తించే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా పాఠశాలల స్థితిగతులైతే మారనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 29952 పాఠశాలలకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.7,289 కోట్లను కేటాయించింది. ఈ బడ్జెట్ కేటాయింపులతో స్కూళ్ల ఆధునీకరణ, మౌళిక సదుపాయల కల్పన చేపట్టనుంది. తొలి దశలో భాగంగా 9 వేలకు పైగా స్కూళ్లలో 12 రకాల మౌళిక సదుపాయల కల్పనకు రూ. 3,497 కోట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గ్రామీణ ప్రాంతాలలో ఈ స్కీమ్‌ను మన ఊరు-మన బడి పేరుతో అమలు చేస్తుండగా, పట్టణ ప్రాంతాలలో మన బస్తి-మన బడి పేరుతో అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మూడు దశలలో మూడేళ్లపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల మౌళిక వసతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో మొదలుపెట్టింది. పాఠశాలలో త్రాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యం, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నీచర్ అందిస్తారు. పాఠశాలలను ఆధునీకరించడం, మరమ్మత్తులు చేయడం, కిచెన్ షెడ్ ఏర్పాటు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త తరగతి గదుల ఏర్పాటు, డిజిటల్ విద్య కోసం కంప్యూటర్, కేయాన్ ప్రొజెక్టర్ వంటి వాటిని సమకూరుస్తారు. ప్రభుత్వ నిధులే కాకుండా పూర్వ విద్యార్థులను తాము చదివిన పాఠశాల అభివృద్ధిలో భాగం చేస్తూ వారి నుండి విరాళాలు సేకరించి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా ఆధునీకరించి పేద విద్యార్థికి కూడా కార్పోరేట్ విద్యనందించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేసింది.

వరంగల్ జిల్లా వ్యాప్తంగా 645 పాఠశాలలకి గాను మొదటి దశలో 223 పాఠశాలల్ని ఎంపిక చేశారు. ఇందులో ఖానాపూర్ మండలం నుండి మొదటి విడతలో 11 పాఠశాలలు ఎంపికయ్యాయి. మొదటగా విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న పాఠశాలలకి ప్రాధాన్యతనిస్తూ విడతల వారీగా పాఠశాలల అభివృద్దికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లా, మండల, పాఠశాల స్థాయి సమావేశాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాల నిర్వహణ కోసం ఒకటి, విరాళాల సేకరణ కోసం మరొకటి బ్యాంకు అకౌంట్స్ తీయాల్సి ఉంటుంది. ఎస్.ఎం.సి చైర్మన్, హెడ్ మాస్టర్, గ్రామ సర్పంచి, ఇంజనీరు నలుగురు కలిసి పాఠశాల నిర్వహణ అకౌంట్ ని నిర్వహిస్తారు. వీరు నలుగురికి చెక్ పై సంతకం చేసే అధికారం ఉంటుంది. పాఠశాలకి కావలసిన మౌళిక సదుపాయాలని ఎస్.ఎం.సి సభ్యులు అంచనా వేసి అవసరమగు అభివృద్ధి పనుల కోసం తీర్మానం చేసి క్షేత్ర స్థాయిలో ఇంజనీర్ అనుమతితో ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో అన్ని రకాల పనులన్నీ ఒక ప్రాజెక్ట్ గా పరిగణించి కలెక్టర్ ద్వారా పరిపాలనా అనుమతులు పొందుతారు. పాఠశాలకి అవసరముగు సాంకేతిక అనుమతులు ఇంజనీరింగ్ ఏజెన్సీ ఇస్తుంది. ప్రాజెక్ట్ వ్యయాన్ని బట్టి రూ. 30 లక్షల లోపు డి.ఈ.ఈ., రూ. 30-50లక్షల లోపు ఈ.ఈ., రూ. 50లక్షల నుండి 2 కోట్ల వరకు ఎస్.ఈ, అంతకుమించిన ఆర్థిక పరిమితులని సి.ఈ అనుమతిస్తారు.

పాఠశాల నిర్వహణ కమిటీ పనులని చేపట్టి పాఠశాలని నిబంధనలకి అనుగుణంగా తీర్చిదిద్దుతారు. పాఠశాల నిర్వహణ కమిటీ ముందుకు రాని పక్షంలో జిల్లా కలెక్టర్ పనులను స్వయంగా కార్యక్రమం అమలుకి చర్యలు గైకొంటారు. ఈ కార్యక్రమ నిర్వహణ క్రమంలో పాఠశాల నిర్వహణ కమిటీతోపాటు ప్రధానోపాధ్యాయుడు, సర్పంచి, ఫీల్డ్ ఇంజనీర్ ముఖ్య పాత్ర నిర్వహిస్తారు. పాఠశాల నిర్వహణతోపాటు పాఠశాలకి విరాళాల సేకరణ కోసం ఇద్దరు పూర్వ విద్యార్థులు సభ్యులుగా, సర్పంచ్, ఎస్.ఎం.సి చైర్మన్, ప్రధానోపాధ్యయునితో పూర్వ విద్యార్థుల కమిటిని ఏర్పాటు చేస్తారు. వీరు పాఠశాల అభివృద్ధి కోసం విరాళాలు సేకరిస్తారు. ఎవరైనా దాత రూ. 2 లక్షలు ఆపైన విరాళం ఇచ్చినట్లయితే అతనిని ఎస్.ఎం.సి సభ్యునిగా చేర్చుకొని, పాఠశాల అభివృద్ధి నిర్ణయాల్లో అవకాశం కల్పిస్తారు. రూ. 10 లక్షలు ఆ పైన విరాళం ఇచ్చినట్లయితే ఎస్.ఎం.సి సభ్యత్వంతోపాటు పాఠశాలలోని ఒక తరగతి గదికి దాత సూచించిన పేరు పెట్టి గౌరవం కల్పిస్తారు.

విరాళాల అకౌంట్ కోసం పోటీ

సర్పంచి, ఎస్.ఎం.సి ఛైర్మన్, ప్రధానోపాధ్యాయుల నేతృత్వంలో పాఠశాల అకౌంట్ ని పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో తీస్తుండడంతో మన ఊరు మన బడి కార్యక్రమ విరాళాల నిర్వహణ అకౌంట్ కి క్రేజ్ ఏర్పడింది. విరాళాల అకౌంట్ పూర్వ విద్యార్థుల పేరు మీద తీసే నిబంధన ఉండడంతో పూర్వ విద్యార్థులు మధ్య పోటీ పెరిగింది. సర్పంచులతో సమానమైన పేరు గల గౌరవమైన స్థానంగా భావిస్తుండడం అలాగే గ్రామంలో ప్రత్యేక గుర్తింపు దక్కే అవకాశం ఉండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీని కోసం పూర్వ విద్యార్థుల్లో ఎవరు ఎక్కువ విరాళం ఇస్తారో వారికే అవకాశం కల్పిస్తే పాఠశాల అభివృద్దికి మరింత చేదోడుగా ఉంటుంది.

నిర్ధేశించిన లక్ష్యానికి సజావుగా సాగేనా..

పాఠశాల నిర్వహణ కమిటీ ద్వారానే అభివృద్ధి పనులు జరగనుండడంతో ఎస్.ఎం.సి ఆర్ధిక సామర్థ్యం, నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్ట్ అంచనా వ్యయంలో కొంతమొత్తం రివాల్వింగ్ ఫండ్ రూపంలో పాఠశాల నిర్వహణ అకౌంట్ లో జమ చేస్తారు. దీనిలో 1/3వ వంతు నిధులని పనుల పురోగతిని సంబంధిత ఇంజనీర్ కొలతలు నమోదు చేయడం ద్వారా విడుదల చేస్తారు. పాఠశాల నిర్వహణ కమిటీ తీర్మానం మేరకు నిధుల విడుదల జరిగినప్పటికీ ఏఈకి ఒకే సమయంలో అనేక పాఠశాలల ప్రాజెక్టులు అప్పజెప్పడం, పని భారంతోపాటు సమయం తక్కువగా ఉండడం నాణ్యతా ప్రమాణాలపై ప్రభావం చూపుతుంది. ఒక్కొక్క ఏఈ రెండు మండలాలు చూస్తుండడం 40కి పైగా ప్రాజెక్ట్ లపై అజమాయిషీ ఉండడంతో నిర్మాణ విలువలకి రాజీపడే పరిస్థితి, అదే సమయంలో ప్రధానోపాధ్యాయుడు క్వాలిటీ విషయంలో ఎస్.ఎం.సి కి వ్యతిరేకంగా కచ్చితత్వంగా వ్యవహరించే ధైర్యం చేయలేకపోవచ్చు. ఇక ఇసుక ఉచితంగానే కలెక్టర్ ద్వారా అందజేస్తున్న క్రమంలో ఎలాంటి దుర్వినియోగం, సిమెంట్ కూడా మార్జిన్ రేట్ కి ఇప్పిస్తున్నందున అవకతవకలు క్షేత్ర స్థాయిలో జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది.

దూలం రాజేందర్, నోడల్ అధికారి, ఖానాపూర్

మన ఊరు మన బడి కార్యక్రమం విద్యార్థులకి, ప్రభుత్వ విద్యాసంస్థలకి పునరుజ్జీవనం లాంటిది. తెలంగాణ విద్యారంగంలో ప్రభుత్వం చేస్తున్న బ్రుహత్తర కార్యక్రమం. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని నిర్మించుకుంటే ఎలాంటి క్వాలిటీని ఆశించి కష్టపడుతారో, అలానే సమాజ నిర్మాణం చేసే బడి అభివృద్ధి కోసం కలిసి శ్రమించి భావి తరాలకి మంచి భవిష్యత్తుని అందిద్దాం. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధుల సహకారం ఆశిస్తున్నాము. ప్రధానోపాధ్యాయుడి నుండి మొదలుకుని ఎస్.ఎం.సి, సర్పంచి, ఏఈ అందరూ సమన్వయంతో నిజాయితీగా పనిచేస్తేనే అభివృద్ధి ఫలాల్ని విద్యార్థులకి అందించగలం.

Advertisement

Next Story

Most Viewed