ప్రయాణం ఉచితమైంది.. మాకు బతుకు భారమైంది..

by Aamani |
ప్రయాణం ఉచితమైంది.. మాకు బతుకు భారమైంది..
X

దిశ, ఆలూరు : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. దీంతో మహిళలంతా ఎంచక్కా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, ఉద్యోగాలు, ఉపాధి లేక ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్న వేలాది మంది ఆటోవాలాల గిరాకీలు లేక వారి బిజినెస్ దెబ్బతింది. కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో కుటుంబాన్ని ఏదోలా నెట్టుకొస్తున్న బడుగు జీవుల బతుకులు ప్రశ్నార్థక మయ్యాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ప్యాసింజర్ షేర్ ఆటోలు నడుపుకునే వారు ఆర్థికంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కువ సంఖ్యలో ఆటోలనే ఆశ్రయించే మహిళలు ఇప్పుడు ఫ్రీ జర్నీ పుణ్యమా అని ఆటోలను పట్టించుకోవడం లేడు. ఎదురుగా ఆటో వచ్చి నిలబడినా మహిళలు ఎవరూ ఆటో ఎక్కడం లేదు. ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు తప్ప ఆటో ఎక్కడం లేదని ఆటోవాలాలు వాపోతున్నారు. దీంతో రోజువారీ ఆదాయం లేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఆటో గిరాకీ తగ్గింది..

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రాక మునుపు ఆటో కార్మికుల పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది. ప్రజలకు ప్రయాణ సేవలందించడంతో పాటు, వారు కూడా రోజువారీ సంపాదనతో ఆర్ధికంగా వారి కుటుంబ పరిస్థితిని మెరుగు పరుచుకున్నారు. తక్కువ దూరం వెళ్లాలనుకునే మహిళా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఆటోలనే ఉపయోగించేవారు. ముఖ్యంగా విద్యార్థినులు, ఉద్యోగినులు ఆటోలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంతో ఆటోలకు మహిళల ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. ఆటో స్టాండ్లలో గంటల తరబడి గిరాకీల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఆటో డ్రైవర్లు..

గతంలో ఇంధనం ఖర్చు, ఇతర ఖర్చులు పోనూ రోజుకు రూ.800 ల నుండి రూ. 1000 వరకు సంపాదించిన ఆటో డ్రైవర్లు, సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు పెళ్ళాం, పిల్లలకు ప్రేమతో ఏదో ఒకటి ఇష్టంగా తీసుకెళ్లే వారు. వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసి రోజంతా వీరు పడ్డ కష్టాన్ని మరిచిపోయేవారు. కానీ, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కష్టపడ్డా రూ. 300 - 400 లు కూడా మిగలడం లేదని వాపోతున్నారు. డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో పాటు, బ్యాంక్ ఈఎంఐలు, ఇళ్ల అద్దె, పిల్లల చదువుల ఖర్చులు, కుటుంబ పోషణకు అయ్యే నెలవారీ, రోజువారీ ఖర్చులు తడిసి మోపెడు ఉన్నాయంటున్నారు. ఒక్కసారిగా శత్రువులా చుట్టుముట్టిన సమస్యలతో ఆటో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

ఫ్రీ జర్నీ ప్రభావం..

ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన చలిగంటి మోహన్ అనే వ్యక్తి గత పదేళ్లుగా ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఆర్టీసీ లో మహిళకు ఫ్రీ జర్నీ కారణంగా ఉపాధి కోల్పోయి, బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్ళాడు. దురదృష్టం ఆయనను అక్కడికి వెళ్లినా వెంటాడింది. ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఇప్పుడు వారి కుటుంబం రోడ్డున పడింది. ఈ ఒక్క సంఘటనే కాదు.. ఇంకా ఆటోవాలాల ఎన్నో కన్నీటి గాథలున్నాయి. వెలుగు లోకి వచ్చినవి కొన్నయితే.. వెలుగులోకి రానివి ఇంకెన్నెన్నో..

ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపని ప్రభుత్వం..

ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ఎవరూ వ్యతిరేకించని హర్షించదగ్గ ప్రభుత్వ నిర్ణయమే.. కానీ, ఈ నిర్ణయం ఏయే వర్గాలను కష్టాల్లోకి నెట్టేస్తుందో ఆలోచించకపోవడం, ఆయా వర్గాలకు తగిన విధంగా ఆర్థిక ప్రత్యామ్నాయ మార్గాలను చూపకపోవడం మాత్రం ప్రభుత్వ తప్పిదమే. దీన్ని ఎవరూ కాదనలేని అంశం.

ఆటో డ్రైవర్లు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి వినిపిస్తున్నా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమని ఆటో కార్మిక కుటుంబాలు అంటున్నాయి. ప్రభుత్వం తమ జీవనాధారాన్ని దెబ్బతీసిందని, మా బతుకుల గురించి పట్టించుకోవట్లేదని ఆవేదన చెందుతున్నారు. తమకు నెలకు రూ.20 వేలు సంపాదించుకునే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాన్ని చూపాలని, లేదంటే ప్రభుత్వమే మా కుటుంబాలకు నెలకు రూ. 15 వేలు ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వానికి ఆటోవాలాల డిమాండ్లు..

-ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఆర్థిక పథకాలు ప్రవేశపెట్టాలి.

-మహిళల ఉచిత ప్రయాణానికి పరిమితులు విధించి, నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించాలి.

-ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి.

-ఆటో గ్యాస్, డీజిల్ ధరలపై సబ్సిడీ ఇవ్వాలి.

ప్రభుత్వమే మమ్ములను ఆదుకోవాలి..: ఎస్. కే. ఆరీఫ్., ఆటో డ్రైవర్

ఇంతకుముందు రోజుకు మూడు ట్రిపుల్లు తిరిగి నా కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు రోజుకు ఒక్క ట్రిప్ కూడా దొరకడం లేదు. ఇంటి అద్దె, వాహన రుణం తీర్చే అవకాశం లేకుండా పోయింది. ఆడోళ్ళంతా బస్సుల్లో ఫ్రీ పోతుంటే మేం ఈగలు తోలు కుంటున్నాం. మేం ఏం తినాలె.. ఎట్ల బతకాలే.

కుటుంబం ఆవేదన .. ప్రభుత్వం స్పందించాలనే డిమాండ్ మృతురాలి భార్య

ఉచిత బస్సు ప్రయాణం వల్ల మా పిల్లలు ఆకలితో ఉండిపోయారు. ఆర్థికంగా నిలబడలేక మా భర్త గల్ఫ్ వెళ్లాడు. గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు ఆయన లేరు. మేం ఎలా బతకాలి? అంటూ మోహన్ భార్య కన్నీరుమున్నీరైంది.

Advertisement
Next Story

Most Viewed