Delhi HC Judge: ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో భారీగా డబ్బు.. బదిలీ వేటు

by Shamantha N |
Delhi HC Judge: ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో భారీగా డబ్బు.. బదిలీ వేటు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి (Delhi HC Judge) జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ బంగ్లాలో మార్చి 14న అగ్నిప్రమాదం జరిగింది. కాగా.. మంటలు ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడ భారీగా నోట్ల కట్టలు కన్పించాయి. అయితే, ఆ సమయంలో జస్టిస్ వర్మ ఇంట్లో లేకపోవడం గమనార్హం. ఆయన కుటుంబసభ్యులే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు ఫోన్‌ చేసి పిలిపించారు. వారు అక్కడ అగ్నికీలలను ఆర్పేశాక.. అక్కడ భారీగా నోట్ల కట్టలు కన్పించాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ డబ్బుని స్వాధీనం చేసుకొన్నారు. అది మొత్తం లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు. కాగా.. ఉన్నతాధికారుల ద్వారా ఈ విషయం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాకు చేరింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీజేఐ కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మను మరో హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ వర్మను అలహాబాద్ కు బదిలీ చేయాలని డిసైడ్ అయ్యారు. గతంలో ఆయన అక్కడే పనిచేసి 2021లో ఢిల్లీకి వచ్చారు.

రాజీనామా చేయడమే దారి..

అయితే, జస్టిస్ వర్మ ఇంట్లో డబ్బు దొరికిన విషయాన్ని సీజేఐ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఆయన బదిలీపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే, న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు అవసరమని కొలీజియంలోని కొందరు సభ్యులు భావించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఘటనలు ప్రజలకు న్యాయం అందించే సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందని సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది. దువల్ల, జస్టిస్ వర్మను రాజీనామా చేయమని కోరడం గురించి కూడా చర్చ జరిగింది. ఒకవేళ జస్టిస్ వర్మ రాజీనామా చేయడానికి నిరాకరిస్తే.. సీజేఐ అంతర్గ చారణ చేపట్టచ్చని కొలీజియంలోని కొందరు భావించారని తెలుస్తోంది.

హైకోర్టు న్యాయమూర్తులను ఎలా తొలగించవచ్చు?

న్యాయమూర్తులపై అవినీతి, తప్పుడు ఆరోపణలు, న్యాయపరమైన అక్రమాలకు సంబంధించిన ఆరోపణలను పరిష్కరించడానికి 1999లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశించింది. వీటి ప్రకారం ఫిర్యాదు అందిన తర్వాత సంబంధిత జడ్జి నుంచి సీజేఐ సమాధానం కోరుతారు. దాని పట్ల ఆయన అసంతృప్తి చెందితే లేదా ఈ విషయంపై దర్యాప్తు అవసరమని భావిస్తే అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టుకు చెందిన ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదికలో జడ్జిపై ఆరోపణలు నిజమని తేలితే సీజేఐ ఆయన్ని రాజీనామా చేయమని కోరతారు. ఒకవేళ అందుకు నిరాకరిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం పార్లమెంటు ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి తొలగింపునకు చర్యలు ప్రారంభించాలని సీజేఐ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు.

Advertisement
Next Story

Most Viewed