- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.. గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు సర్కార్ చేయూత..

దిశ,ఆలూర్: ఎండమావులు దాహం తీర్చలేవు.. ఎడారి దేశంలో పనికి పోతే అప్పులు తీరవు.. దీపానికి అట్రాక్ట్ అయ్యే పురుగుల్లా.. గల్ఫ్ దేశాలకు ఎగిరిపోయి.. అక్కడే పిట్టల్లా రాలిపోతున్నారు.అప్పులు తీర్చలేక.. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలు పడే ఆవేదన వినే వారే కరువయ్యారు. స్థానికంగా ఉపాధి కల్పించని ప్రభుత్వాలు కనీసం పొరుగు దేశం నుంచి వారి శవాలను కూడా రప్పించలేకపోతున్నాయి. మోడు వారిని జీవితాల్లో ఏ రేడు వెలుగులు నింపుతాడోనని కళ్లలో వత్తులేసుకుంటున్నారు బాధితులు.ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేసింది. గల్ఫ్‌లో కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 216 ద్వారా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. గురుకులాల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఏజెంట్ల మోసాలతో సతమతం...
50 ఏళ్లుగా ఉమ్మడి జిల్లా నుంచి ఎడారి దేశాలకు వలస వెళ్తున్నారు. ఏటా 80 వేల మంది కొత్త వారు వెళ్లడం, పాత వారు రావడం జరుగుతుంటాయి. ప్రస్తుతం 2.60 లక్షల మంది దుబాయి, అబుదాబి, మస్కట్, షార్టా, ఖతార్,బైయిన్, ఒమెన్, కువైట్, సౌదీ, ఇరాక్ దేశాల్లో ఉన్నారు.అక్కడికి వెళ్లాలంటే ఏజెంట్లకు రూ.లక్షలు ముట్టజెప్పాలి.కంపెనీ వీసా అయితే పర్వాలేదు. కానీ నకిలీ ఎజెంట్లతో మోసపోతే చేతికి చిల్లిగవ్వ కూడా రాదు. అక్కడ చనిపోతే మృతదేహం ఇంటికి వచ్చే పరిస్థితి ఉండదు. అప్పు చేసి వెళ్లిన వారు అవి తీర్చేందుకు నానా అవస్థలు పడతారు. దీనికి తోడు వయసు మీద పడి అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. సాధారణ మరణమో, లేదంటే ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలిస్తున్నారు..
ఉమ్మడి జిల్లాలో మొదటి విడత ..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2024 అక్టోబర్ వరకు 36 మంది కార్మికులు చనిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన నిధులు నిజామాబాద్ జిల్లాకు 1.70 కోట్లు కామారెడ్డి జిల్లాకు 20 లక్షలు నిధులు మంజూరు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం గుర్తించింది వీరిని...
గోసంగి ఇస్తారి (రాంచంద్రాపల్లి, సురుకుట్ల ప్రవీణ్‌కుమార్ (దూస్‌గాం,డిచ్‌పల్లి),నిజాంపర్ రాజేశ్వర్(చిక్లి), వేముల ప్రవీణ్ (రాజారాం నగర్‌కాలనీ, భీమ్‌గల్),విజయ్‌కుమార్ ( గాన్నారం), మల్లయ్య (బాల్కొండ), సుదా విఠల్ (డొంకేశ్వర్), రాఘవేంద్ర (బడాభీమ్‌గల్), కవ్వ శంకర్ (బాల్కొండ), మచ్చర్ల పెద్దభోజన్న (జోర్‌పూర్), ఏ. హరీశ్‌గౌడ్(కలిగోట్), బట్టు రాము (కృష్ణనగర్, మాక్లూర్), కానూర్ సంజీవ్(ఆర్మూర్), సుందగరి రమేశ్ (నిజామాబాద్) , దాసరి రాకేశ్(భీమ్‌గల్), చెన్నూరి బాల్‌రాజ్(సిర్‌పూర్, మోపాల్), పెర్కిట నరేందర్(ధర్వల్లి), కొర్వ డానియల్ (మచ్చర్ల),సాయన్న (నూతపల్లి) కుర్లాపరమేశ్ (కాలూర్), మహిపాల్ (కోనాపూర్), సందీప్(ఆలూర్), పలెపు లింగయ్య (హాసాకొత్తూర్), రాజేశ్‌గౌడ్ (కుర్నాపల్లి), ఉప్పురవి (బ్రాహ్మణ్‌పల్లి), షేక్‌అజామ్ (మాక్లూర్), మోహ్మద్ అసాద్ (నీలా), శ్రీనివాస్(మోస్రా), సున్నం రమేశ్(ఇందల్‌వాయి), మూట కిషన్(గాదేపల్లి) కామారెడ్డి జిల్లాలో... సంకుజు మార్క్(మాచారెడ్డి), గర్లె ప్రభాకర్(బోనాల్,లింగం పేట), చాకలి పోచయ్య (గాంధారి) లను అందరిని ప్రభుత్వం గుర్తించింది..
రెండో విడతలో రూ.ఒక కోటి 60 లక్షలు..
గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘాలు వివరాల ప్రభుత్వానికి నివేదించాయి. ఫలితంగా నిజామాబాద్ జిల్లాకు 28 మంది, కామారెడ్డి జిల్లాకు 4 మంది ని మొత్తం ఒక కోటి 60 లక్షలు, 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా కోసం సర్కారుకు నివేదించారు. త్వరలో లబ్ధిదారులకు ప్రయోజనం అందనుంది.
కార్మిక సంక్షేమానికి తొలి అడుగు..
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల సంక్షేమం కోసం ఈ విధమైన ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం గమనార్హం. ఈ నిర్ణయం లక్షల మంది గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడనుంది.
ఎవరికి వర్తిస్తుంది..
ఈ ఎక్స్‌గ్రేషియా బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి 7 గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణ వలస కార్మికులకు వర్తిస్తుంది. 2023 డిసెంబర్ 7 లేదా ఆ తర్వాత చనిపోయిన గల్ఫ్ కార్మికులకు ఇది అమలులోకి వస్తుంది. మరణానికి కారణం ఏదైనా ఈ పరిహారం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది, అంటే సహజ మరణం, ప్రమాదం, అనారోగ్యం, లేదా ఏదైనా ప్రమాదకర పరిస్థితుల్లో మరణించిన వారికి ఇది వర్తిస్తుంది.
పరిహారం కోసం దరఖాస్తు విధానం....
ఈ ఎక్స్‌గ్రేషియా కోసం గల్ఫ్ ప్రాంతాల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు అంటే జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రులు తమ స్థానిక జిల్లా కలెక్టర్‌కి దరఖాస్తు చేసుకోవాలి. మరణం జరిగిన తేదీ లేదా మృతదేహం స్వీకరించిన తేదీ నుంచి 6 నెలల లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసేటప్పుడు సమర్పించాల్సిన సర్టిఫికెట్లు...
*మరణ ధృవీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్)
* రద్దు చేసిన పాస్‌పోర్ట్
* గల్ఫ్ లేదా ఇరాక్ దేశాల్లో పని చేసిన రుజువు (వర్క్ వీసా, ఉద్యోగ ఒప్పందం వంటి పత్రాలు)
* అర్హులైన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలు
ఆమోద ప్రక్రియ...
ధృవీకరించిన తర్వాత, జిల్లా కలెక్టర్ అర్హతగల కుటుంబ సభ్యునికి చెల్లింపు కోసం ప్రొసీడింగ్స్ రూపంలో ఎక్స్‌గ్రేషియా యొక్క అధికారిక మంజూరును జారీ చేస్తారు. మంజూరైన మొత్తం 5.00 లక్షలు అర్హత కలిగిన కుటుంబ సభ్యుల(ల) బ్యాంక్ ఖాతాకు నేరుగా బదిలీ చేయబడుతుంది.
చెల్లింపు వ్యవస్థ...
ఎక్స్‌గ్రేషియా మొత్తం అర్హత ఉన్న కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాకు నేరుగా బదిలీ చేయబడుతుంది. దరఖాస్తు ప్రక్రియ సమయంలో చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతా వివరాలను తప్పనిసరిగా అందించాలి.
గల్ఫ్ కార్మికుల మృతులకు 5 లక్షలు ప్రకటించడం హర్షణీయం : ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి, అకాల మరణాన్ని పొందిన కార్మికుల మృతులకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా మొదలుపెట్టిందని, ఈ పథకం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు తోడుపడుతుందని, గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకం పెరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి గల్ఫ్ కార్మికులు కుటుంబాల ద్వారా ప్రత్యేక అభినందనలు..