Stock Market: వరుసగా మూడో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

by Harish |   ( Updated:2022-04-07 11:51:08.0  )
Stock Market: వరుసగా మూడో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు వరుస నష్టాలు ఎదురవుతున్నాయి. గత వారంలో గణనీయంగా పుంజుకున్న సూచీలు తిరిగి నష్టాల బాటపడ్డాయి. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలతో పాటు శుక్రవారం వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలపై మదుపర్లు దృష్టి సారించారు. వీటికి తోడు గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల ట్రేడింగ్, దేశీయంగా దిగ్గజ హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ షేర్లలో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో స్టాక్ మార్కెట్లు బలహీనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లపై ప్రకటనకు ముందు పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 575.46 పాయింట్లు పతనమై 59,034 వద్ద, నిఫ్టీ 168.10 పాయింట్లు తగ్గి 17,639 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, రియల్టీ రంగాలు అతి స్వల్పంగా రాణించాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, మెటల్, ఐటీ రంగాలు అధికంగా 1 శాతానికి పైగా నిరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, డా రెడ్డీస్ షేర్లు లాభాలను దక్కించుకోగా, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, టీసీఎస్, రిలయన్స్, ఎయిర్‌టెల్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు అధికంగా నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.04 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed