వరుసగా మూడోరోజు నష్టాల్లో సూచీలు!

by S Gopi |
వరుసగా మూడోరోజు నష్టాల్లో సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను ఎదుర్కొన్నాయి. ఉదయం ప్రారంభమైనప్పటి నుంచే నీరసించిన సూచీలు రోజంతా అదే ధోరణిలో కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా చమురు ఉత్పత్తులపై ప్రభుత్వం ఎగుమతి సుంకాలను విధించడంతో మార్కెట్లలో సెంటిమెంట్ బలహీనపడింది. ముఖ్యంగా ఆయిల్ రంగం కంపెనీల షేర్లు దారుణంగా దెబ్బతిన్నాయి. అలాగే, సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఏకంగా 7 శాతం పతనమవడం గమనార్హం. అన్ని రకాలుగా నీరసించడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లో బలహీనపడ్డాయి. ఉదయం నష్టాల నుంచి మిడ్-సెషన్ సమయంలో సూచీలు కొంత కోలుకునే ప్రయంతం చేసినప్పటికీ చివరికి నష్టాలను ఎదుర్కొన్నాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 111.01 పాయింట్లు దెబ్బతిని 52,907 వద్ద, నిఫ్టీ 28.20 పాయింట్లు క్షీణించి 15,752 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆయిల్ అండ్ గ్యాస్ రంగం అత్యధికంగా 4 శాతానికి పైగా నీరసించింది. ఇదే సమయంలో ఎఫ్ఎంసీజీ రంగం దాదాపు 3 శాతం పుంజుకుంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లె ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకోగా, రిలయన్స్ షేర్ ధర అత్యధికంగా 7.14 శాతం, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 1-3 శాతం మధ్య అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 78.90 వద్ద ఉంది.

Advertisement

Next Story