మనసై.. ప్రేమంతై ... 'సత్యం సుందరం'

by M.Rajitha |   ( Updated:2024-10-29 11:19:54.0  )
మనసై.. ప్రేమంతై ... సత్యం సుందరం
X

దిశ, వెబ్ డెస్క్ : మనసై.. ప్రేమంతై ... 'సత్యం సుందరం'. ఈ సినిమా కోసం ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది.

ఎవరో

ఇతడెవరో

ఏ వరసో

ఇతను !

మనసై.. ప్రేమంతై ...కలిసాడే ఇతను!

శ్వాస లాంటి... విశ్వాసముంది మరిచా

మనవి ...మనము... అను మాటలే మరిచా...

వాడిన వేసవికే

నీ కరుణ చినుకులు చాలు ఎమో

కలనై కరుగుతున్నాను

నిజమైన నీ ఎదుట....

ఎవరో

ఇతడెవరో

ఏ వరసో

ఇతను !

పాటలోని ఈ లిరిక్స్ చాలండి. సినిమా లోని లోతైన భావాన్ని తెలుసుకోవడానికి ఈ పాట వింటే చాలు సినిమా మొత్తం అర్థం అయిపోతుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే అరవింద స్వామి ఎంత బాగా నటించాడో కార్తీ కూడా అంతే బాగా నటించాడు. సినిమా స్క్రీన్ ప్లే గాని డైలాగ్ డెలివరీ గాని ప్రతి ఒక్కటి కూడా చాలా హృద్యంగా ఉన్నాయి. సిస్టర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా చూపించారు.

మనసును కెలికేసే ఎమోషన్

ఇందులో ఒక విషయం నాకు చాలా హార్ట్ టచ్చింగ్ అనిపించింది. సొంత ఊరికి వెళ్ళినప్పుడు మనవాళ్లు ఉండి కూడా ఉండటానికి ఒక హోటల్లో లాడ్జ్ తీసుకున్నప్పుడు కలిగే బాధ వర్ణాతీతం. ఇది సొంత ఊరులో ఉన్న వాళ్ళకి తెలియదు. ఉద్యోగరీత్యా లేదా మరేదో కారణాలవల్ల సొంత ఊరిని వదిలి వెళ్ళిపోయిన వారికి మాత్రం మనసులో ఎక్కడో కెలికేస్తుంది. అది చాలా చిన్న ఎమోషన్. కానీ దాన్ని కూడా చాలా బాగా చూపించాడు డైరెక్టర్.

ప్రేమను పంచే ఇలాంటి మనిషి దొరుకుతాడా?

ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో కార్తీ లాంటి ఒక క్యారెక్టర్ని తప్పక వెతుక్కుంటారు. కార్తీ క్యారెక్టర్ నిజ జీవితంలో ఉంటే ఉక్కిరిబిక్కిరి చేశాడు ఇలాంటి క్యారెక్టర్ని రోజు భరించలేము అని చాలామంది అన్నారు. అంత నిస్వార్ధంగా కల్మషం లేకుండా అంత ప్రేమను పంచే మనిషి ఉన్నప్పుడు ఎందుకు భరించలేమండి. అసలు అలాంటి మనిషి దొరుకుతాడా? అన్నది నా ప్రశ్న?

దూరమైన ఊరు దగ్గరయినప్పుడు...

మనసులో ఒకటి బయటకు ఒకటి పెట్టుకొని ప్లాస్టిక్ పువ్వులు పూయించే ఈ సమాజంలో తన అసలు రూపాన్ని కోల్పోయిన అరవిందస్వామి తనని తాను మళ్ళీ చూసుకున్నప్పుడు కలిగే ఉద్వేగమే ఈ సినిమా. కాలంతో వచ్చే మార్పులు, శాపంగా మిగిలిన గతం, స్వచ్ఛమైన బాల్యంలో ఉన్న ప్రేమలను అభిమానాలని తుడిపేస్తుంది. స్వభావాన్ని మార్చేస్తుంది. మనిషిని మార్చేస్తుంది. నిజంగా బయట ఊళ్ళల్లో ఉండి సొంత ఊరు వెళ్ళినప్పుడు మనకి ఎవరు మన మీద ప్రేమ చూపిస్తున్నారో ఎవరు అభిమానంగా ఉన్నారో అన్నది ఈ సినిమా చూశాక మనకు నిజంగా గుర్తొస్తారు.

ఇలాంటి సినిమాలు చూడకపోతే...

ఈ సినిమాకి పబ్లిసిటీ ఎక్కువగా ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఈ సినిమా నెట్ ఫ్లెక్స్ లో ఉంది. సినిమా పేరు మాత్రం meiyazhagan అని సెర్చ్ చేయాలి. ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా. గుడ్ సినిమా. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా కోసం ఎందరో రాశారు కానీ ఈ సినిమా చూశాక సినిమా కోసం నాలుగు మాటలు రాయకుండా ఉండలేక రాస్తున్నాను అంతే...

ఎస్పెసియల్లీ ఆ పాట అయితే మటుకు నాకు నోట్లో ఇంకా నానుతూనే ఉంది.

- జ్యోతి మువ్వల

[email protected]

Advertisement

Next Story

Most Viewed