అస్తవ్యస్తం కానున్న శానిటేషన్.. ఆరు సర్కిళ్లలో ఏఎంసీ లకు బాధ్యతలు

by Mahesh |
అస్తవ్యస్తం కానున్న శానిటేషన్.. ఆరు సర్కిళ్లలో ఏఎంసీ లకు బాధ్యతలు
X

దిశ, సిటీ బ్యూరో: మహా నగరవాసులకు జీహెచ్ఎంసీ అందించే అతి ముఖ్యమైన, అత్యవసరమైన సేవల్లో శానిటేషన్ ఒకటి. భారీ యంత్రాలు, వాహనాలు, వేలాది మంది కార్మికులున్నా, శానిటేషన్ పనులు అంతంతమాత్రమే. మెడికల్ చదివిన డాక్టర్లే ఈ శానిటేషన్ బాధ్యతలను ఎలాంటి లోపాల్లేకుండా నిర్వహించేందుకు నిత్యం సతమతమవుతుంటారు. అలాంటిది అంతంతమాత్రంగా చదువుకున్న, క్షేత్ర స్థాయి పనులపై ఎలాంటి అవగాహన, అనుభవం లేని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (ఏఎంసీ)లకు శానిటేషన్ బాధ్యతలు, బర్త్, డెత్ రిజిష్టార్ బాధ్యతలు అప్పగిస్తూ కొద్ది రోజుల క్రితమే కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

నగరంలోని 30 సర్కిళ్లలో నిన్నమొన్నటి వరకు విధులు నిర్వర్తించిన 22 మంది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లలో ఆరుగురు మెడికల్ ఆఫీసర్‌ల పై అవినీతి, అక్రమాల ఆరోపణలుండటం, వారి డిప్యూటేషన్ గడువు ముగియడంతో ఆరుగురు మెడికల్ ఆఫీసర్లను మాతృశాఖకు సరెండర్ చేసి, వారి స్థానంలో వారి బాధ్యతలను కమిషనర్ ఏఎంసీలకు అప్పగించారు. కానీ మెడికల్ ఆఫీసర్‌లు శానిటేషన్, బర్త్, డెత్ సర్టిఫికెట్ల వ్యవహారాలు చూసుకునేటపుడు ఈ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లలో ఎక్కువ మంది కేవలం ఆఫీసు పనులకే పరిమితమయ్యేవారు. ఇప్పుడు వీరికే శానిటేషన్ విధులు అప్పగించడంతో వీరంతా తెల్లవారుఝాము మూడు గంటల నుంచి క్షేత్ర స్థాయి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

సర్కిల్ పరిధిలోని ఎస్ఎఫ్ఏ పర్యవేక్షణలో ఉన్న స్వీపింగ్ యూనిట్ల పనితీరుతో పాటు చెత్తను ట్రాన్స్ ఫర్ స్టేషన్ కు, అక్కడి నుంచి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించే వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ఏమైనా లోపాలు తలెత్తితే వెంటనే చీఫ్ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్‌తో సంప్రదింపులు జరిపి, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి, చెత్త తరలింపు ప్రక్రియ ఆగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ రకమైన విధులకు వీరు కొత్త వారు కావడంతో ఎలా నిర్వహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కానీ క్షేత్ర స్థాయిలో శానిటేషన్, చెత్త తరలింపు వంటి ప్రక్రియలపై ఎలాంటి అవగాహన లేకపోవడంతో మున్ముందు నగరంలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంది.

దీనికి తోడు బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన ఈ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు కొంత వరకు ఆశాజనకంగా విధులు నిర్వర్తించే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం కంప్యూటరైజ్డ్ అయిన ఈ సర్టిఫికెట్లు మొత్తం డిజిటల్ సంతకాలతో జారీ అవుతున్నందున, వీరి ప్రక్రియ వీరు కేవలం దరఖాస్తులకు ఆమోదమిస్తే చాలు, వాటంతట అవే ఆన్ లైన్ లో జారీ అయ్యే అవకాశాలున్నాయి. కానీ సిబ్బంది పెట్టే దరఖాస్తుల ఎంత వరకు సరైనవో చూసుకోవాల్సిందే. లేకుంటే రిస్క్ లో పడినట్టే.

Advertisement

Next Story

Most Viewed