కబ్జాకోరల్లో సాకి చెరువు.. అధికారుల అండతో బెదిరింపులు

by samatah |   ( Updated:2022-03-17 12:13:08.0  )
కబ్జాకోరల్లో సాకి చెరువు.. అధికారుల అండతో బెదిరింపులు
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి : నగర ప్రజలకు అహ్లాదాన్ని పంచే 'సాకి' చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నది.పటాన్​చెరు నడిబొడ్డున ఉన్న ఈ చెరువు అక్రమార్కుల వేటుకు తన రూపుకోల్పోతున్నది. కొంత కాలం క్రితం చూసిన వారు ఇప్పడు వచ్చి చూస్తే గుండెలు బాదుకునేంతగా చెరువు ఆక్రమణకు గురైంది. కళ్ల ముందే రోజుల వ్యవధిలోనే చెరువు చుట్టూ నిర్మాణాలు వెలసిపోతున్నాయి. చెరువు ఎఫ్​టీఎల్​పరిదిలోంచే సీసీ రోడ్లు వేస్తున్నారు. దర్జాగా నిర్మాణాలు చేపడున్నారు. అధికారులు హెచ్చరిస్తుండడం, అక్రమార్కులు తమకేం పట్టనట్లుగా నిర్మాణాలు చేస్తూ పోవడం పరిపాటిగా మారింది. ఇరిగేషన్​, రెవెన్యూ, జీహెచ్​ఎంసీ అధికారులు కొద్ది రోజుల క్రితం జాయింట్ సర్వే చేస్తే విస్తూపోయే అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 97 ఎకరాల విస్త్రీర్ణంలోని చెరువు ఎకరాల పరిధిలో కబ్జాకు గురయిందని, 18 నిర్మాణాలు అక్రమంగాచేపట్టారని తక్షణ చర్యలు తీసుకోవాలని జీహెచ్​ఎంసీ ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తే అక్కడి నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఇదే అదనుగా భావిస్తున్న అక్రమార్కులు తమ కబ్జాల పర్వాన్ని యధేచ్చగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదంతా చూస్తున్న స్థానిక ప్రజలు అటు ప్రభుత్వాన్ని, ఏం చేయలేని స్థితిలో ఉన్న అధికార వ్యవస్థ మీద దుమ్మెత్తిపోస్తున్నారు.




సాకి చెరువు పటాన్​చెరుకు ప్రత్యేక ఆకర్షణ

సాకి చెరువు అనగానే పటాన్​చెరులో ప్రత్యేకంగా గుర్తుకు వచ్చేది సాకి చెరువు. పట్టణ నడిబొడ్డున, ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో ఈ చెరువు విస్తరించి ఉంది. సాయంత్రం అయితే చాలా నగర వాసులు అలా చెరువు గట్టునకు వెళ్లి సేదతీరుతుంటారు. బతుకమ్మ ఉత్సవాల సమయంలో ఈ చెరువు టూరిస్ట్ స్పాట్‌ గా మారిపోతుంది. ఇది 97 ఎకరాల పరిధిలో విస్తరించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆక్రమణలు, కబ్జాలతో చెరువు పరిధి తగ్గిపోతూ వస్తున్నది. మొదట కొంచం అక్రమించుకుని ఆ తరువాత రాత్రికి రాత్రే మట్టితో పూడ్చుతున్నారు. రోజుల వ్యవదిలోనే పునాదులు వేసి, బిల్డింగ్‌లు నిర్మిస్తున్నారు. చెరువు ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్ పరిధిలోనే ఏకంగా సీసీ రోడ్డు వేశారంటే కబ్జా దారుల దర్జా అర్థం చేసుకోవచ్చు. లారీలతో మట్టి నింపడం, నిర్మాణాలు చేపట్టడడం చూస్తుండగానే జరిగిపోతూ ఉంటాయి. 97 ఎకరాల చెరువు కబ్జా అవుతూ వస్తున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేదతీరడానికి ఉన్న ఏకైక చెరువు పోతే పటాన్ చెరును ఊహించుకోలేమని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్వేలో 18 అక్రమ నిర్మాణాలు గుర్తింపు

సాకి చెరువు పూర్తిగా కబ్జాకు గురవుతున్నదని పలు మార్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్​, రెవెన్యూ అధికారులకు వేరువేరుగా ఎన్నో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే గత నవంబర్ నెలలో ఇరిగేషన్​అధికారులు మొదట పరిశీలించి ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులకు నివేదికలు పంపారు. దీంతో రెవెన్యూ, ఇరిగేషన్​, స్థానిక జీహెచ్​ఎంసీ అధికారులు, సిబ్బందితో కలిసి జాయింట్​ సర్వే చేశారు. ఈ సర్వేలో మొత్తం 18 అక్రమ నిర్మాణాలు ఎఫ్​టీఎల్​ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా పెద్ద మొత్తంగా ఎఫ్​టీఎల్​ పరిధిలోని భూమి ఆక్రమణకు గురైంది. సీసీ రోడ్లు మినహాయించి అక్రమ నిర్మాణాలే 18కి పైగా ఉన్నాయని నివేదికలు రూపొందించారు. ఈ నివేదికలను మూడు శాఖల సమన్వయంతో జీహెచ్​ఎంసీ ఉన్నతాధికారులకు పంపించారు. అలా ఎప్పుడో నవంబర్‌లో పంపిన నివేదికకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఎవరూ చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోయి కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు.

కేసులు పెడితే తిరబడుతున్నారు..

చెరువులోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టడం అమీన్​పూర్, పటాన్​చెరు ప్రాంతాల్లో కామాన్‌గా మారింది. తమల్ని ఎవరేం చేయరనే అండతోనే ఈ కబ్జాలకు పాల్పడుతున్నారు.రాజకీయ అండదండలతోనే అక్రమార్కులు ఈ కబ్జాలకు పాల్పడుతున్నట్లు పలు సందర్భాల్లో బయటపడింది కూడా. గత కొద్ది రోజుల క్రితం సాకి చెరువులో అక్రమ నిర్మాణాల విషయంలో రెవెన్యూ అధికారులు క్రిమినల్​ కేసులు నమోదు చేశారు. తమపైనే కేసులు పెడతారా..? అంటూ రాజకీయ అండతో కొందరు అధికారులపైకే బెదిరింపులకు దిగడం గమనార్హం. ఈ వ్యవహారం అప్పుడు చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అధికారులు చూసిచూడనట్లు ఉంటుండగా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నిర్మాణాలు చేపడతారు, అడ్డుకుంటే కోర్టుకు వెళతారు. కోర్టు ఆదేశాల పేరుతో తమ అక్రమాలు కొనసాగిస్తున్నారని అధికారులు అందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటాం : తహశీల్దార్​ మహిపాల్​రెడ్డి





సాకి చెరువు ఆక్రమణకు గురవుతున్నదని గుర్తించాం. ఈ క్రమంలోనే సర్వే చేస్తే 18 నిర్మాణాలు అక్రమంగా చేపట్టినట్లు తేలింది. వీటి విషయంలో నివేదికలు రూపొందించిజీహెచ్​ఎంసీకి సమర్పించాం. అటు నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటాం. కఠినంగా వ్యవహస్తాం. అక్రమణ దారులు, కబ్జాలు చేసే వారి విషయంలో కఠినంగా ఉంటున్నాం. ఇప్పటికే పలు సందర్భాల్లో సాకి చెరువు ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్ పరిధిలో ఆక్రమణకు పాల్పడితే కేసులు నమోదు చేశారు. కేసులు పెడుతున్నప్పటికీ కబ్జా కోరులు తమ పద్ధతులు మార్చుకోవడం లేదు. సాకి చెరువు సంరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story