ఏంటి.. నేల చనిపోతుందా అని ఆశ్చర్యపోతున్నారా?.. అయితే ఇది చదవండి

by S Gopi |
ఏంటి.. నేల చనిపోతుందా అని ఆశ్చర్యపోతున్నారా?.. అయితే ఇది చదవండి
X

దిశ, ఫీచర్స్: మన శరీరాన్ని మనం గాయపరుచుకోం కానీ, జీవకోటికి ప్రాణంపోసే ప్రకృతిని మాత్రం చిత్రవధ చేస్తుంటాం. చుక్క విషాన్ని తీసుకునేందుకు కూడా ఒప్పుకోని మనం నేలతల్లి గర్భంలో 'రసాయన' బీజాలు నాటుతాం. మినరల్ వాటర్‌లో చిన్న అణువు కనబడితేనే తాగేందుకు నిరాకరిస్తాం అలాంటిది ఔషధతుల్యమైన నదీజలాల్లో యథేచ్ఛగా కలుషితాలు కలుపుతాం. పెరట్లోని మామిడికొమ్మలు ఇచ్చేందుకే లబోదిబో అంటాం.. కానీ పురోగతి పేరుతో అరణ్యాలను, ఆకాశాన్ని నామరూపాల్లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తాం. ఏదేమైనా వందలో పదిమంది పర్యావరణాన్ని సంరక్షించే యోధులుంటారు. చెట్లు నాటుదామని, నదులను రక్షించుకుందామని, ప్లాస్టిక్ వాడొద్దని మనందరికీ కొత్త తోవ చూపెడుతారు. అలాంటి మార్గనిర్దేశనం చేస్తున్న వారిలో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ఒకరు. మొన్నటి వరకు నదుల పునరుజ్జీవనం కోసం పోరాడినా ఆయన.. ప్రస్తుతం జీవం కోల్పోతున్న మట్టిలో ఊపిరి ఊదేందుకు 'సేవ్ సాయిల్' పేరుతో ప్రపంచయాత్రకు బయలుదేరాడు. ఈ యాత్ర విశేషాలేమిటి? మన మట్టికి ఏమైంది? ఏం చేస్తే పునరుజ్జీవం పోసుకుంటుంది? ఆ విశేషాలపై స్పెషల్ స్టోరీ!

సృష్టిలో పుట్టిన ప్రతీ జీవి ప్రాణం కోల్పోతుంది. అలాగే నేల కూడా తన జీవం కోల్పోయింది. ఏంటి నేల చనిపోతుందా? అని ఆశ్చర్యపోతున్నారా? నిస్సందేహంగా మట్టి సజీవంగా లేదు. గ్రహం మీద జీవిస్తున్న మానవుల కంటే ఎక్కువ జీవులు పిడికెడు మట్టి(8 నుంచి10 బిలియన్లు)లో నివసిస్తాయి. ఈ నేల నుంచే పండ్లు, కూరగాయలు సాగుచేసుకుంటాం కానీ.. కాలుష్యం, పారిశ్రామికీకరణ, రసాయనాలు, హానికరమైన పురుగుమందులతో పునరుత్పాదక సహజ వనరు నేలపై దశాబ్దాలుగా దాడి చేస్తూనే ఉన్నాం. ప్రతీ 5 సెకన్లకు దాదాపు ఫుట్‌బాల్ మైదానానికి సమానమైన మట్టి జీవం కోల్పోయేలా చేస్తున్నాం. ఇది మన మనుగడకే ప్రమాదమని ఇప్పుడైనా గుర్తించకపోతే రాబోయే కొన్నేళ్లలో గ్రహాంతం తప్పదు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సద్గురు ప్రారంభించిన ప్రపంచ ఉద్యమమే 'సేవ్ సాయిల్'.

సేవ్ సాయిల్ ఉద్యమం

24 దేశాల మీదుగా 100 రోజుల పాటు 30,000 కి.మీ మేర సాగనున్న 'సేవ్ సాయిల్' ఉద్యమ ప్రయాణంలో దేశాధినేతలతోపాటు ముఖ్యమైన నాయకులను కలిసి మట్టి ప్రాముఖ్యతను వివరించనున్నారు సద్గురు. నేలను కాపాడుకునేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణ, అందుకు కావాల్సిన విధాన సంస్కరణలను వివరిస్తారు. శాస్త్రవేత్తలు, నిపుణులు సహా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజల సహకారంతో ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. గతంలో సద్గురు చేపట్టిన 'కావేరి కాలింగ్ ప్రాజెక్ట్'లో భాగంగా దాదాపు 125,000 మంది రైతులు 62 మిలియన్ల చెట్లను నాటగా.. ఇది మట్టిని పునరుద్ధరించేందుకు, క్షీణిస్తున్న కావేరి నదీ జలాలను తిరిగి జీవం పోసుకునేందుకు సాయపడుతోంది. దీంతో లండన్‌లో ప్రారంభించిన తన యాత్రను కావేరి పరివాహక ప్రాంతంలోనే ముగించనున్నారు. ఈ ఉద్యమానికి ప్రిమటాలాజిస్ట్ జేన్ గూడాల్, ఆధ్మాత్మికవేత్త దలైలామా, బిజినెస్ టైకూన్ మార్క్ బెనియోఫ్ వంటి ప్రపంచ ప్రముఖులతో పాటు యునైటెడ్ నేషన్స్, కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం, యునైటెడ్ నేషన్స్ ఫుడ్ & అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వంటి సంస్థల మద్దతు పొందింది. అంతేకాదు ఈ ఉద్యమం ద్వారా కనీసం 3.5 బిలియన్ల ప్రజల్లో లేదా ప్రపంచ ఓటర్లలో 60% మందిలో చైత్యన్యాన్ని తీసుకురావాలి.


నేలను సుసంపన్నం చేయడమే మార్గం: సద్గురు జగ్గీ వాసుదేవ్

గత 20 ఏళ్లలో 3,00,000 మంది రైతులు చనిపోయారు. మనం ఇప్పుడు చర్య తీసుకోవడం చాలా ముఖ్యం. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భూసారం క్షీణిస్తోంది. 24 సంవత్సరాలుగా దీని గురించి మాట్లాడుతున్నాను. కానీ ప్రతి దేశంలో సానుకూల విధానం ఉన్నప్పుడే దీనికి పరిష్కారం సాధ్యమవుతుంది. పెరుగుతున్న ఎడారీకరణ తగ్గిస్తూ, చనిపోతున్న నేలను బతికించేందుకు సాగు నేలలో సేంద్రియ పదార్థాలను పెంచే దిశగా దేశాలు జాతీయ విధానాలను ఏర్పాటు చేయడంపై దృష్టి కేంద్రీకరించేందుకు కృషి చేస్తున్నాను. ఈ క్రమంలోనే సేవ్ సాయిల్ యాత్ర చేపట్టాను. మనకు ఎంత సంపద, విద్య, డబ్బు ఉన్నప్పటికీ.. నేల, నీటిని పునరుద్ధరించకపోతే మన పిల్లలు జీవించలేరు. కాన్షియస్ ప్లానెట్ మాత్రమే మన ముందున్న మార్గం. ఇది ఒక్కరితో, ఒకే దేశంతో సాధ్యమయ్యే పని కాదు ఇందుకు పౌరులందరి సమిష్టి భాగస్వామ్యం అవసరం. ఇది ప్రపంచంలోని ప్రతి దేశంలో అవసరమైన విధానాలను అనుసరించడం ద్వారా మాత్రమే నిర్ధారించబడుతుంది. నేలలో సేంద్రీయ కంటెంట్‌ను కనిష్టంగా 3-6%కి పెంచేందుకు మనమంతా కృషి చేయాలి.

కఠోర నిజాలు :

* మన తాతముత్తాతలు ఒక నారింజతో పొందిన విటమిన్ ఎ మొత్తాన్ని మనం పొందాలంటే దాదాపు 8 నారింజలను తినాల్సి ఉంటుందని ఓ అధ్యయనం నిర్ధారించింది. మన నేల సారం కోల్పోవడమే ఇందుకు కారణం.

* గత వందేళ్లలో క్యాబేజీ, పాలకూర, టమోటాలు, బచ్చలికూరల్లోని కాల్షియం, మెగ్నీషియం, ఇనుము స్థాయిలు సగటున 80 నుంచి 90% పడిపోయాయి. ప్రస్తుతం పండిస్తున్న పండ్లు కూరగాయలు ఇప్పటికే 90% తక్కువ పోషకాలను కలిగి ఉన్నాయి.

* 2050 నాటికి 90 శాతానికి పైగా నేల క్షీణించవచ్చని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ (UNCCD) వెల్లడించింది. ఇదే జరిగితే ఆహారం, నీటి కొరతతో పాటు ప్రపంచవ్యాప్తంగా విపత్తు సంక్షోభాలకు దారి తీస్తుంది.

* 2 బిలియన్ల మంది ప్రజలు పోషకాహార లోపాలతో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

* 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 9 బిలియన్లు ఉంటుందని అంచనా. ఆ సమయంలో ఇప్పటి కంటే 1.5 రెట్లు ఎక్కువ మట్టి అవసరం. కానీ భూసారం రోజురోజుకూ తగ్గిపోవడంతో ప్రపంచ ఆహారంలో 30శాతం తక్కువగా పండుతుందని సమాచారం. అంటే పదిమందిలో ముగ్గురు ఆకలితో చనిపోయే అవకాశముంది.

* మునుపటి రోజుల్లో పంట భ్రమణ పద్ధతిని ఉపయోగించాం. ఇది నేల తిరిగి పోషకాలను పొందేందుకు, గత నష్టం నుంచి కోలుకోవడానికి దోహదపడింది. ఇందుకోసం రైతులు రెండు వేర్వేరు పంటలను ఎంచుకునేవారు. తద్వారా నేల ఒకే సమయంలో క్షీణించకపోగా అదనంగా దాని పోషకాలను తిరిగి స్వీకరించేందుకు విశ్రాంతి కాలం పొందేది. అయితే ప్రస్తుతం రైతులు ఏక పంట సాగుకు మొగ్గు చూపడం, విపరీత రసాయనాలు వాడటంతో నేలసారం కోల్పోతుంది.

* ఆవాసాలను కోల్పోవడం వల్ల ప్రతీ ఏటా దాదాపు 27000 రకాల జీవులు అంతరించిపోతుండటంతో జీవవైవిధ్యాన్ని కోల్పోతున్నాం. దీని వల్ల నేల ఆవాసాలకు అంతరాయం ఏర్పడటంతో పాటు నేల పునరుత్పత్తి ఆగిపోతుంది.

వ్యాపారులు, సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వాలు నేల ఆరోగ్యానికి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు.. ఈ నిరంతర ప్రయత్నం ఫలిస్తుంది. ఇది గ్రీన్ హెడ్స్ నుంచి గ్రీన్ హ్యాండ్స్‌కు చేసే ప్రయాణం. కాబట్టి మట్టిని మనలో ప్రతి ఒక్కరూ కాపాడాలి. అది జరిగేలా చేద్దాం!

నేలతల్లి బిడ్డగా నువ్వేం చేయాలంటే..?

'మట్టి'క్షీణత వల్ల కలిగే నష్టం గురించి అవగాహన కల్పించేందుకు రోజుకు 10 నిమిషాల సమయం కేటాయించాలి. ఇందుకోసం సోషల్ మీడియా వేదికగా వీడియో లేదా సందేశాన్ని షేర్ చేయాలి. ఇందుకు సంబంధించిన వాస్తవాలు పోస్ట్ చేయాలి.

Next Story

Most Viewed