గడీలపాలనను కూల్చి బహుజన రాజ్యం తెస్తాం : ఆర్ఎస్పీ

by Nagaya |
గడీలపాలనను కూల్చి బహుజన రాజ్యం తెస్తాం : ఆర్ఎస్పీ
X

దిశ, సుల్తానాబాద్: దొరల గడీలపాలన కూల్చి బహుజన రాజ్యం తెస్తామని, కేసీఆర్‌ను గద్దెదించే రోజులు దగ్గరపడ్డాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ బీఎస్పీ ఇంచార్జ్ దాసరి ఉష ఆధ్వర్యంలో విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనాన్ని సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దొరల గడీల పాలన కూల్చాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకు ప్రతి బహుజన బిడ్డ నడుముకట్టాలని పిలుపునిచ్చారు. విశ్వకర్మ బిడ్డల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ దొరల భోగాలతో రాజ్యమేలుతుందని, బహుజన రాజ్యాధికారమే దొరల అహంకారం అనగడానికి మార్గమని అన్నారు.

ఇటీవల విశ్వకర్మల విషయంలో పెద్ద కుంభకోణం బయటపడిందని, రూ.720 కోట్ల నుండి రూ.1539 కోట్ల విలువచేసే విశ్వకర్మలకు దక్కాల్సిన మన ఊరు మనబడి టెండర్లు రూ.180 కోట్ల టర్నోవర్ ఉంటేనే టెండర్లు ఇస్తామని కేసీర్ మోసం చేశారన్నారు. బహుజనులను మోసం చేసి కార్పొరేట్ కంపెనీ మెగాకు ఇచ్చారని దుయ్యబట్టారు. విశ్వకర్మలైన చారీలను కేటీఆర్ కించపరచడం దొర అహంకారానికి నిదర్శనమని, విశ్వకర్మలకు క్షమాపణగా అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలన్నారు. అన్ని పార్టీల్లో బహుజన లీడర్లు అగ్రవర్ణాల ఆధిపత్యంలో మగ్గుతున్నారని బహుజన సమాజ్ పార్టీ వారందరికీ ఆత్మగౌరవంతో ఉండేలా తమ పార్టీలోకి ఆహ్వానిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. జనాభా ప్రతిపాదికన విశ్వకర్మలకు దక్కాల్సిన వాటా దక్కడం లేదని, రాజకీయంగా వారిని అనగదోక్కుతున్నారని బీఎస్పీ వారందరికీ అండగా ఉండి రాజ్యాధికారం ఇస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 70 శాతం ఎమ్మెల్యే సీట్లు బీసీలకేనని, దొరల పాలనకు కౌంట్డౌన్ స్టార్ట్ అయిందని ఆర్ఎస్పీ అన్నారు. బీసీ వాదంతో గద్దెనెక్కిన ప్రధానమంత్రి బీసీ కులగణన జరగకుండా చూస్తున్నారని, మనువాద ఆర్ఎస్ఎస్ వల్లనే బీసీ కులగణన జరగడంలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బహుజనులను రాజకీయంగా వాడుకుంటూ అనగా తొక్కుతున్నారని, దానికి చరమగీతం పాడుదామని, రానున్న రోజుల్లో పెద్దపల్లి గడ్డమీద బీఎస్పీ నీలిజెండా ఎగరడం ఖాయమని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎనగందుల వెంకన్న, మహతి రమేష్, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, రాష్ట్ర ఈసీ మెంబర్లు విశ్వం, హనుమయ్య బహుజన గాయకులు పాటమ్మ రాంబాబు, నాయకులు రంజిత్, తాండ్ర అంజయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed