కాంగ్రెస్​లో పార్టీ విధానం ప్రకారమే టికెట్లు.. తేల్చేసిన రేవంత్​ రెడ్డి

by Nagaya |
కాంగ్రెస్​లో పార్టీ విధానం ప్రకారమే టికెట్లు.. తేల్చేసిన రేవంత్​ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీలో టికెట్ల కేటాయింపు ఎన్నికల సమయంలో ఒక నిర్ధిష్టమైన ప్రక్రియ ద్వారా జరుగుతుందని, పార్టీ విధాన ప్రక్రియ ప్రకారమే టికెట్ల కేటాయింపు ఉంటుందని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జనరల్​ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్​ తో రేవంత్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్​ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని, జులై 7 నాటికి పీసీసీ అధ్యక్షుని బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి అవుతుందని, ఈ కాలంలో తాను చేపట్టిన కార్యక్రమాలను కేసీ వేణుగోపాల్‌కి వివరించానని వెల్లడించారు.

ప్రశాంతి కిషోర్, బీజేపీ ప్లాన్‌లో భాగంగానే సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు. పశ్చిమబెంగాల్ తరహాలో ప్రశాంత్ కిషోర్ రాష్ట్రాన్ని తయారు చేయాలని చూస్తున్నాడని, పశ్చిమ బెంగాల్‌లో విపక్షాలన్నీ తుడుచుకో పెట్టుకోవడానికి ప్రశాంత్ కిషోరే కారణమన్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని ప్రశాంత్ కిషోర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలో చేరికలపై వ్యూహాత్మకంగా స్థానిక అంశాలను దృష్టిలో పెట్టుకుంటున్నామని, చేరికల వివరాలు బయటకు వస్తే అధికారాల్లో ఉన్న ప్రభుత్వాలు ఒత్తిడికి గురి చేస్తాయన్నారు. పెద్ద ఎత్తున జరిగే చేరికలపై అధిష్టానం నుంచి స్పష్టత తీసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్​.. బీజేపీ కోసమే పని చేస్తున్నాడని, గతంలో ఫెడరల్​ ఫ్రంట్​, ఇప్పుడు బీఆర్​ఎస్​ అంటూ మోడీకి ఉపయోగం కోసమే చేస్తున్నాడని, మోడీకి అనుకూలంగా ప్రతిపక్షాలను చీల్చేందుకు కేసీఆర్​ కృషి చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రపతి ఎన్నికల అంశంలో మమతా బెనర్జీ విపక్షాల సమావేశం నిర్వహించినప్పుడు టీఆర్​ఎస్​ హాజరు కాలేదని, ఆరోజు వరకు బీజేపీ అభ్యర్థి ఓడిపోయే పరిస్థితి ఉందని, నవీన్​ పట్నాయక్​, ఇతర పార్టీ నేతలు మద్దతు ప్రకటించిన తర్వాత బీజేపీ అభ్యర్థి గెలుస్తారని స్పష్టత వచ్చాకే విపక్షాల అభ్యర్థికి టీఆర్​ఎస్​ మద్దతు ప్రకటించిందన్నారు. దీనిలోనే మోడీకి అనుకూల వ్యూహం ఉందని రేవంత్​ రెడ్డి ఆరోపించారు.

అంతర్గత విషయాలన్నీ చర్చించాం

రాష్ట్ర పార్టీలో నెలకొన్న అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్​ తో చర్చించామని సీఎల్పీ నేతభట్టి విక్రమార్క వెల్లడించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించామని, ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుతం పరిస్థితి సర్దుమణిగిందన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయని, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా టీఆర్ఎస్ పార్టీతో ఆ పార్టీ దోస్తీ బయటపడిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని ఆశించామని, కానీ ఒక్కదానిపైనా మాట్లాడలేదని, టీఆర్ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదన్నారు. ఇక పార్టీలో చేరివారితో పాటు ముందు నుంచి పార్టీలో ఉండి, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని, టికెట్లు అనేవి ఎన్నికలను బట్టి కేటాయిస్తారని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Advertisement

Next Story