మిడ్ డే మీల్స్ పున:ప్రారంభించండి..కేంద్రాన్ని కోరిన సోనియా

by Mahesh |
మిడ్ డే మీల్స్ పున:ప్రారంభించండి..కేంద్రాన్ని కోరిన సోనియా
X

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పున: ప్రారంభించాలని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ కేంద్రాన్ని కోరారు. బుధవారం పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్‌లో భాగంగా జీరో అవర్‌లో ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో మిడ్ డే మీల్స్ స్కీం ఆగిపోయింది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడంతో స్కూళ్లు తిరిగి ప్రారంభమైనందున విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించేందుకు తిరిగి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు.

ముఖ్యంగా మూడేళ్ల లోపు చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు వేడి, వండిన ఆహారాన్ని అందుబాటులో ఉంచాలని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నేటితరం చిన్నారులే రేపటి దేశ భవిష్యత్ అని, వారు పోషకాహార లేమి బారిన పడకుండా కేంద్రం సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) 2019-21 ప్రకారం 2015-16 తో పోల్చితే ఐదేళ్లలోపు పోషకాహార లోపం, తక్కువ బరువు ఉన్న పిల్లల శాతం పెరిగిందని శ్రీమతి సోనియా గాంధీ తెలిపారు.

Advertisement

Next Story