నో ప్రూఫ్స్, నో రూల్స్.. ఆ రిసార్ట్ లో రూ.2 వేలకే కావాల్సినంత ఎంజాయ్‌మెంట్

by Nagaya |   ( Updated:2022-06-20 17:41:59.0  )
నో ప్రూఫ్స్, నో రూల్స్.. ఆ రిసార్ట్ లో రూ.2 వేలకే కావాల్సినంత ఎంజాయ్‌మెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ​పబ్.. ఎవరినైనా అనుమతిస్తుంది. తాగొచ్చు.. ఊగొచ్చు. ఆ తర్వాత మీ ఇష్టం. ఏజ్‌తో సంబంధం లేదు. అయితే ఈ కల్చర్ నగరానికే పరిమితం అనుకుంటే పొరపాటే. హైదరాబాద్‌కు 100 కి.మీ. దూరంలోనూ అదే నడుస్తున్నది. కాస్ట్లీ కల్చర్ పేరిట తాగి ఊగమంటున్నారు. ఎంజాయ్ అంటూ ఆహ్వానిస్తున్నారు. ఏజ్‌తో సంబంధం లేదు. జెండర్‌తో అసలు పని లేదు. ఎవరైనా రావచ్చు. రాత్రంతా గడపొచ్చు. మీకు అడ్డు చెప్పేవారే లేరు. అడ్డొచ్చే వారే ఉండరు. ఫుల్ ప్రైవసీ. మీరు జంటగా వచ్చినా, సింగిల్‌గా వచ్చినా ఎవరేం ప్రశ్నించరు. మీ మధ్యనున్న సంబంధమేమిటో కూడా అడగరు. సాయంత్రం 4 గంటలకు వచ్చిన తెల్లారి 11 గంటల వరకు మీ ఇష్టం. మనిషికి రూ.2 వేలు చెల్లిస్తే చాలు. నైట్ డిన్నర్, ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఫ్రీ..

అదేనండీ.. రీసార్ట్ ఎంట్రీ. ఇప్పుడిదే సరికొత్త ఎంజాయ్మెంట్ ట్రెండ్. ఫారెస్ట్ రీసార్ట్, అడ్వెంఛర్ రీసార్ట్, జంగిల్ లాడ్జ్, ఫామ్ హౌజ్ రీసార్ట్, జల్సా, నెస్ట్, రెంటల్ ఫామ్స్, మస్తీ, ఫ్యామిలీ.. ఇలా ఆకట్టుకునే పేర్లతో ఎన్నెన్నో రీసార్టులు పుట్టుకొచ్చాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఏండ్ల తరబడి స్వేచ్ఛగా నడుస్తున్నాయి. విశృంఖలం అంటే ఏమిటో పబ్ ల్లోనే కాదు. రీసార్టుల్లోనూ దర్శనమిస్తున్నది. వీకెండ్‌లోనే ఈ దందా అనుకోకండి. ప్రతి రోజూ ఇల్లీగల్ దందా కొనసాగుతున్నది. ప్రకృతి పరవశం పేరిట ఆకట్టుకునే ప్యాకేజీలను కళ్ల ముందు ఉంచుతున్నారు. ఫోన్ చేయగానే ప్యాకేజీ వివరాలన్నీ వాట్సాప్‌కు వచ్చేస్తాయి. మీకు నచ్చితే.. వెంటనే రూ.1000 చెల్లించి రూమ్ బుక్ చేసుకోవాలి. మీరు ఏ రోజు వస్తారో ముందుగానే చెబితే అన్ని ఏర్పాట్లు చేస్తారు. అక్కడికి వెళ్లగానే గేటు దగ్గరే చెల్లించిన అడ్వాన్స్ పేమెంట్ రిసీట్ చూపిస్తే ఈజీగా ఎంట్రీ. ఇక్కడ మీరెవరితో వచ్చారన్నదేం అడగరు. లాడ్జ్ లోనైతే ఆధార్ కార్డు తప్పనిసరి. ఎంట్రీ బుక్ లో సంతకాలు కూడా చేయించుకుంటారు. కానీ ఇక్కడ ఎలాంటి ఐడీ కార్డులు అడగరు. మీరెవరో కూడా వారికి అవసరం లేదు. ఇలా ఒకటీ రెండు రీసార్టులు కాదు.. రంగారెడ్డి, వికారాబాద్​, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 100కు పైగా దర్శనమిస్తున్నాయి. శృతి మించిన విశృంఖలత్వానికి తోడ్పాటునందిస్తున్న రీసార్టుల బిజినెస్ కూడా రూ.కోట్లల్లోనే ఉన్నది.

పబ్‌కు​మించిన ఎంజాయ్

పబ్‌ల్లోనే మత్తులో జోగే యువత కనిపిస్తుందనుకోవద్దు. ఇక్కడి రీసార్టుల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో విచ్చలవిడిగా, ఆడమగా అన్న తేడాల్లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చేటప్పుడే మద్యం తెచ్చుకోవచ్చు. లేదంటే రీసార్టులోనూ మద్యం సప్లయ్ ఉంటుంది. కాస్త మాటలు కలిపి మద్యం బ్రాండ్ చెబితే సమకూర్చేస్తున్నారు. అది కూడా అధిక ధరలకే. ఇక చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ ఐటెమ్స్ అప్పటికప్పుడు సిద్ధం చేసి ఆర్డర్ల మీద అందిస్తున్నారు. మందులోకి నంజుకోవడానికి ఏం చేయమంటే అది వెంటనే చేసేస్తున్నారు. ఇంకేం కావాలి? మందు, తినడానికి నాన్ వెజ్.. ఆ తర్వాత మీరు ఎవరితో వచ్చారో, వారితో ఎంజాయ్ చేయడానికి ఆకట్టుకునే పాటల పల్లకి ఎంకరేజ్ చేస్తుంది. పబ్‌లోనైతే ఇరుకైన స్పేస్. ఇక్కడేమో ప్రకృతి మొత్తం మీదే. ఒక్కో రీసార్టు విస్తీర్ణం 20 నుంచి 100 ఎకరాల వరకు ఉంటుంది. ఎంజాయ్ కోసం ఎంత విశాల హృదయమో ఈ రీసార్టులకు అర్ధం చేసుకోవచ్చు. లైవ్ మ్యూజిక్‌తో మస్త మజా చేస్తున్నారు. చిన్న క్యాంపింగ్ టెంట్‌లోనే గడిపేస్తున్నారు. అవసరమైతే రూమ్స్ కూడా ఉంటాయి. వాటికైతే ఓ రూ.500 అదనం. తెల్లవార్లూ మీ ఇష్టం. నో రిస్ట్రక్షన్స్. ఏ చెకింగ్ బాధ లేదు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు వచ్చి పట్టుకుంటారేమోనన్న భయం కూడా లేదు. అన్నీ రీసార్టు చూసుకుంటుంది. క్యాంపింగ్ టెంట్స్, సైక్లింగ్, లేక్ సైడ్ ట్రెక్కింగ్, లైవ్ మ్యూజిక్, క్యాంపింగ్ ఫైర్ వంటివి ఉంటాయని బ్రోచర్ పంపిస్తారు. కానీ అంతకు మించిన ఎంజాయ్ ఉంటుందని వెళ్తే గాని తెలియదు.

ప్రకృతి పరవశం

ప్రధానంగా వికారాబాద్ అటవీ ప్రాంతానికి సమీపంలో అనేక రీసార్టుల దందా కొనసాగుతున్నది. అటవీ భూమికి పక్కనే వీటిని ఏర్పాటు చేశారు. గుట్టలు, లోయలు, కొండలు, కోనలే.. ఆ ప్రకృతే వీరి పెట్టుబడి. చల్లటి వాతావరణం, అహ్లాదకరమైన పక్షుల శబ్దాలు, కనువిందు చేసే దృశ్యాలు ఎన్నో ఆకట్టుకుంటాయి. వీటినే రీసార్టు యజమానులు కస్టమర్లకు వలగా వేస్తున్నారు. దానికి తోడు ఎలాంటి అజమాయిషీ, ఆంక్షల్లేని ఓ రోజు గడిపాలని ఎదురుచూస్తున్న యువతకు సరైన వేదికలుగా కనిపిస్తున్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయానికి అత్యంత సమీపంలోనే ఈ రీసార్టులు ఉన్నాయి. అలాగే శంకర్ పల్లి, మొయినాబాద్​, షాద్ నగర్, చేవెళ్ల, వికారాబాద్​ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. గూగుల్ సెర్చ్ లో పెద్ద లిస్టు కనిపిస్తున్నది. హైదరాబాద్​తో పాటు శివారు ప్రాంతాలను కూడా మత్తులో ముంచేస్తున్నారు. ఇక్కడా మేజర్, మైనర్ అన్న బేధాలేం లేవు. ఎవరి ఇష్టం వారిదే!

నో పర్మిషన్స్

క్యాంపింగ్ టెంట్స్ అంటూ సాగే రీసార్టుల దందాకు ఎలాంటి అనుమతులు లేవు. కానీ పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారుల సహకారంతోనే సాగుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులెవరైనా వస్తారా? అన్న ప్రశ్నకు మా సార్‌కు అందరూ తెలుసు. ఆయన చూసుకుంటాడు.. అంటూ నిర్వాహకులు భరోసా ఇస్తున్నారు. ఓ రీసార్టు గురించి ప్రశ్నిస్తే మా సార్ పోలీసు ఆఫీసర్ అంటూ దమ్కీ ఇచ్చారు. ఏ రీసార్టుకీ అనుమతులు లేవు. అసలు ఏ శాఖ అనుమతులు ఇవ్వాలో కూడా తెలియదు. పబ్‌ల కంటే అధ్వానమైన వ్యవస్థ ఏర్పడింది. ఊరికి దూరంగా గుట్టల ప్రాంతంలో ఉండడంతో గ్రామస్థులకు కూడా అక్కడేం జరుగుతున్నదో తెలియదు. కొందరు నాయకులు మాత్రం వసూళ్ల దందాకు అలవాటు పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వాళ్ల అవసరాల కోసం యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అటు గ్రామ పంచాయతీ పాలక మండళ్లు కూడా పట్టించుకోవడం లేదు. పచ్చటి పొలాల్లో నిర్మాణాలు చేస్తున్నా అడిగే నాధుడే లేడు. ప్రతి రోజూ వందలాది మంది కస్టమర్లు వస్తున్నారు. అక్కడ పోగయ్యే వ్యర్థాలతో ప్రకృతి విధ్వంసం జరుగుతున్నది. ప్రతి రోజూ అనుమతుల్లేకుండానే రూ.లక్షల విలువైన మద్యం అమ్మేస్తున్నారు.

లీడర్లతో రిలేషన్

పచ్చటి పైర్లను కొనేశారు. 20 నుంచి 100 ఎకరాలు ఒకే దగ్గర కొన్నారు. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మధ్యలో రీసార్టు పేరిట ప్యాకేజీల దందాను నడిపిస్తున్నారు. అయితే ఈ యాజమాన్యాలకు లీడర్లతో రిలేషన్స్ ఉన్నాయి. అందుకే పోలీసు, ఎక్సైజ్ శాఖ, పంచాయత్ రాజ్ శాఖ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని సమాచారం.

గంటకో రేటు.. నగర నడిబొడ్డున 'సరసమైన' స్టార్ హోటల్స్

ఫుల్‌గా తాగి రోడ్డుపైన ర‌చ్చ ర‌చ్చ.. అమ్మాయి తిట్ల‌కు షాకైన పోలీసులు! (వీడియో)

Advertisement

Next Story