బెల్లంపల్లిలో రెచ్చిపోతున్న రియల్ గ్యాంగులు..!

by Mahesh |
బెల్లంపల్లిలో రెచ్చిపోతున్న రియల్ గ్యాంగులు..!
X

దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో మునుపెన్నడూ లేని విధంగా రియల్ ఎస్టేట్ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే వారి కబ్జా లోకి వెళ్తాయి. అంతే వేగంగా అక్రమ కట్టడాలు జరుగుతాయి. భూకబ్జాలు నిత్యకృత్యంగా మారాయంటే అతిశయోక్తి కాదు. జీవనాధారం లేని కొందరు యువకులను చేరదీసి బడా రాజకీయ నాయకులు తమ అక్రమ సంపాదన కోసం గ్యాంగ్ లీడర్లుగా అవతారం ఎత్తారు. నిరుద్యోగులు, తమ అనుచరగణంతో భూదందాలు దర్జాగా సాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో పట్టణంలో మంచిర్యాల వంటి కార్పొరేటు ప్రాంతాన్ని తలదన్నే రీతిలో రియల్ గ్యాంగ్‌లు స్వైరవిహారం చేస్తున్నాయి. భూదందాలలో అన్ని రాజకీయ పక్షాలు తమకు తోచిన విధంగా భూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. రియల్ దందానే ప్రధాన వృత్తిగా చేసుకున్నాయనీ తెలుస్తోంది. ఇక వారి భూకబ్జాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. మరోవైపు రియల్ ముఠాలు పోటీపడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నాయి. బెల్లంపల్లిలో రియల్ గ్యాంగ్‌ల నుండి ప్రభుత్వ భూములకు రక్షణ లేని పరిస్థితి నెలకొంద అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భూకబ్జాలకు కేరాఫ్ కన్నాల..

బెల్లంపల్లి ప్రధాన హైవే మార్గంలో ఉన్న కన్నాల శివారు ప్రాంతం భూకబ్జాలకు కేరాఫ్‌గా మారింది. వందల ఎకరాలు ప్రభుత్వ భూములు ఇప్పటికే చేతులు మారిపోయాయి. అత్యంత విలువైన ఈ భూములను రియల్ గ్యాంగులు తమ కబ్జాలో పెట్టుకొని విక్రయిస్తున్నారు. అనతికాలంలోనే కోట్లకు పడిగెత్తుతున్నారు. తాజాగా సర్వే నెంబర్ 60 లో ఉన్న 40 ఎకరాలు సైతం కబ్జా కోరల్లో చిక్కుకుంది. కబ్జా భూముల్లో ఇళ్ల నిర్మాణాలు, వెంచర్లు ఏర్పాటు చేసి లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. రాత్రికి రాత్రే ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రధాన జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో ప్రభుత్వ భూముల విలువ అమాంతం రెట్టింపయింది. రియల్ గ్యాంగ్ ముఠాలు బినామీ పేర్లతో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు జరుపుతున్నాయి.భూ అక్రమ దందాలో తమకు ఎదురు లేదని తెగ రెచ్చిపోతున్నారు.

అక్రమంగా వెలసిన కాలనీ టాకరియానగర్ ..?

బెల్లంపల్లిలో భూకబ్జాలకు మరో పేరుగా టాకరియా‌నగర్ నిలిచింది. ఏరియా ఆసుపత్రి ఎదురుగా ఉన్న సింగరేణి ఖాళీ స్థలంలో వందలాది గృహ అక్రమ కట్టడాలను నెలకొల్పారు. ఓ రియల్ గ్యాంగ్ లీడర్ అక్రమంగా లేఅవుట్లు వేసి విక్రయించి కోట్లు గడించారు. ఇక అక్కడ భూకబ్జాకు స్థలం లేకుండా పోయింది. ఉన్న భూమినంతా కైవసం చేసుకున్నారు. ఫ్లాట్‌లు పెట్టి లక్షల రూపాయలకు అమ్మివేశారు.

తప్పుడు ప్రోసిడింగ్ తో కబ్జాలు..?

బెల్లంపల్లి పట్టణంలో బాలాజీ థియేటర్ వెనకాల ఖాళీ స్థలం పై భూ అక్రమార్కులు కన్ను వేశారు. లక్షలాది రూపాయల విలువైన ఈ భూముల్లో అక్రమ కట్టడాలను చేపట్టారు. ఆగమేఘాల మీద రాత్రనక పగలనక అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. రాజకీయ పలుకుబడి కలిగిన ఓ గ్యాంగ్ ప్రధాన రహదారి పక్కనే బేకరీ వెనుక ఉన్న అత్యంత విలువైన 40 గుంటల పీపీ ప్రభుత్వ భూమిని చేర పట్టింది. ఇట్టి స్థలం మాగంటి రామచంద్ర రావు కుటుంబం నుంచి కొనుగోలు చేసినట్లు రెవెన్యూ అధికారులను నమ్మించారనీ విశ్వసనీయ సమాచారం. ఆ పత్రాలను చూపించి తప్పుడు ప్రోసిడింగ్ పత్రాలను సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అట్టి పత్రాలు చూపించి రెండు చోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. అయితే అధికారులు జారీ చేసిన ప్రొసిడెంట్ పత్రాలలో నిర్దిష్టమైన స్థలం, సర్వే నెంబర్ లేకపోవడం గమనార్హం. ఐదు రోజుల క్రితం నుండి అట్టి స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. లక్షలాది రూపాయల విలువైన ఈ భూములను అప్పనంగా కబ్జా చేసిన ఆక్రమణదారులు ఆ స్థలం విక్రయానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. బెల్లంపల్లి పట్టణంలో ఇంత భారీ ఎత్తున భూ ఆక్రమణలు జరుగుతుంటే అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడక పోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల సపోర్టు లేకుండా దర్జాగా భూ అక్రమాలు ఎలా సాగుతాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

Advertisement

Next Story