నీటిలో తేలియాడుతున్న ఇండ్లు...

by S Gopi |   ( Updated:2022-07-13 05:22:04.0  )
నీటిలో తేలియాడుతున్న ఇండ్లు...
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కింది భాగాన కనిపిస్తున్న ఫొటో నిర్మల్ సమీపంలోని జీఎన్ఆర్ కాలనీ. గతేడాది భారీ వర్షాలతో ఈ కాలనీ నీట మునిగింది. ఇండ్లలోకి వరదనీరు చేరి.. నిత్యవసరాలు, సామాగ్రి కొట్టుకుపోయాయి. ఇండ్లలోకి పాములు, తేళ్లు, కప్పలు వచ్చాయి. బురదనీటితో ఇండ్లు పూర్తిగా పాడయ్యాయి. తాజాగా ఈసారి భారీ వర్షాలు కురవడంతో.. మళ్లీ కాలనీ రోడ్లు వరద నీటితో నిండిపోవటంతో వీరందరినీ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలోకి తరలించారు. ఈ పరిస్థితి రావటానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల డబ్బుల దాహమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. లోతట్టు ప్రాంతంలో వెంచర్ ఏర్పాటు చేయగా.. చిన్న పాటి వర్షాలకే ఈ కాలనీలోకి నీరు చేరుతోంది. భారీ వర్షాలు పడితే ఇక అంతే.. పక్కనే స్వర్ణ-చిట్యాల వాగు ఉండగా.. స్వర్ణ గేట్లు ఎత్తితే ఇండ్లలోకి వరదనీరు చేరుతోంది. అప్పట్లో ఈ వెంచర్ అనుమతి లేదని మున్సిపల్ అధికారులు అడ్డుకోగా.. తర్వాత అధికారం అండతో వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించేశారు. ఇప్పటికే చాలా వరకు ఇండ్ల నిర్మాణం చేయగా.. మరికొందరు చేసుకుంటున్నారు.. ఇందులో ముగ్గురు అధికార పార్టీ కౌన్సిలర్లు ఉండటం గమనార్హం.


ఇది మచ్చుకు ఉదాహరణ మాత్రమే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాల్లోనూ విచ్చల విడిగా వెంచర్లు వెలిశాయి. డీటీసీపీ అనుమతి లేకుండానే ఏర్పాటు చేయగా.. లోతట్టు ప్రాంతాలు, చెరువుల ఎఫ్టీఎల్, శిఖం భూముల్లో వెంచర్లు వేయటంతో చిన్నపాలిటీ వర్షాలకే వరదనీరు వచ్చి చేరుతోంది. సొంతింటి కల నెరవేర్చుకోవాలనే వారు.. కష్టార్జితం తెచ్చి ప్లాటు కొనుక్కుంటున్నారు. చిన్న పాటి వర్షాలకే వరదనీరు వచ్చి చేరటంతో.. ఇబ్బందుల పాలవుతున్నారు. అప్పులు చేసి.. ఇల్లు కట్టుకుంటే వానాకాలం వస్తే దినదిన గండంగా మారుతోంది. ఇప్పటికే జీఎన్ఆర్ కాలనీ గతేడాది వర్షాలతో నీటిలో మునిగిపోయింది. చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. తాజాగా వర్షాలతో కాలనీలో రోడ్లు వరదనీటితో నిండిపోయాయి. ఈ అనుభవం చూశాక కూడా.. రియల్ అక్రమ దందా, ధన దాహం ఆగటం లేదు. గత అనుభవాలతో పాఠాలు నేర్చుకోవటం లేదు.

నిర్మల్, భైంసా, మంచిర్యాల, ఆదిలాబాద్, లక్సెట్టిపేట లాంటి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు, చెరువు శిఖం, ఎఫ్టీఎల్ పరిధిలో వెంచర్లు వేస్తున్నారు. పక్కనే ఉన్న చెరువు మట్టి నింపి.. ప్లాట్లుగా చేసేస్తున్నారు. వీటిలో చిన్నపాటి వర్షాలతో నీరు చేరుతుండగా.. ప్లాట్లు కొని ఇండ్లు కట్టుకున్న వారికి ఇబ్బందులు తప్పటం లేదు. కాల్వల నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తున్నారు. చెరువులు, కుంటలను కబ్జా చేస్తున్నారు. దీంతో నీరంతా పట్టణాల్లోకి వచ్చి చేరుతోంది. ఇందుకు తాజాగా నిర్మల్ పట్టణంలో వరద నీరు చేరటమే నిదర్శనంగా చెప్పవచ్చు. అధికారం అండగా ఉంటే చాలు. ఎలాంటి అనుమతులు లేకుండానే.. అడ్డగోలుగా వెంచర్లు వేస్తున్నారు. విపక్ష నాయకులు వేసిన వెంచర్లను మాత్రం రాత్రికి రాత్రి తొలగిస్తుండటం గమనార్హం.

ప్రముఖ పట్టణాల్లో పరిస్థితి దారుణం..

-మంచిర్యాల పట్టణం ముల్కల్ల సమీపంలో ర్యాలీ వాగు పక్కన రెండు ఎకరాల్లో వెంచరు ఏర్పాటు చేశారు. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. భూమిని చదును చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు ర్యాలీ వాగుకు వరద రావటంతో.. ఈ వెంచరులోకి కోతకు గురవుతోంది.

- మంచిర్యాల పట్టణంలో గోదావరి పరిసరాల్లో పదుల సంఖ్యలో వెంచర్లు ఏర్పాటు చేశారు. గోదావరి వరద వచ్చినప్పుడు నీరు చేరుతోంది. ఇప్పటికే చాలా చోట్ల ఈ ప్లాట్లు కోతకు గురయ్యాయి. నస్పూర్ మున్సిపాలిటీలో సీతారాంపల్లి గోదావరికి వెళ్లే దారిలో వెంచర్లు వేయగా.. మున్సిపాలిటీ నీరు వచ్చి చేరటంతో చెరువులను తలపిస్తున్నాయి.

- నిర్మల్ పట్టణంలో అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వెంచర్లు చేస్తున్నారు. చెరువు శిఖం, ఎఫ్టీఎల్, లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణం చేస్తుండగా.. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేయగా.. ప్రస్తుతం చాలా చోట్ల నీటిలో తేలియాడుతున్నాయి.

- ఇప్పటికే జీఎన్ఆర్ కాలనీ కళ్లముందు కనిపిస్తుండగా.. గాజుల్పేట్, ఎల్లపల్లి, సోఫీనగర్, ప్రియదర్శిని నగర్, గాయత్రినగర్, విశ్వనాథ్పేట్, ఆదర్శనగర్, కొండాపూర్, వెంకటాపూర్, మంజులాపూర్ పరిసర ప్రాంతాల్లో చాలా వెంచర్లు నీటిలో మునిగిపోయాయి. ఇందులో ప్లాట్లు కొన్నవారికి ఇండ్లు కట్టుకున్నాక.. కష్టాలు తప్పేలా లేవు.

- ఆదిలాబాద్ పట్టణంలో పాత వెంచర్లు.. రణధీర్ నగర్, గాంధీనగర్, ఖానాపూర్ కాలనీలో నీటిలో ఉన్నాయి. దస్నాపూర్ వాగు సమీపంలో ఇండ్లు నీటిలో ఉన్నాయి. రాంనగర్ వాగు నాలాను మూసి వేయటంతో.. రాంనగర్ కాలనీకి సమీపంలో వెలిసిన కొత్త వెంచర్లు, న్యూహౌజింగ్ బోర్డులో కొత్త వెంచర్లలోకి బ్యాక్ వాటర్ లోపలికి వస్తోంది. ఇందులో ప్లాట్లు కొని ఇండ్లు కట్టుకునే వారికి నిత్యనరకమే.

Advertisement

Next Story