- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మళ్లీ రంగంలోకి ఏఐసీసీ.. భట్టి రిపోర్ట్, రేవంత్ సైలెంట్!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితుల్లో మళ్లీ ఏఐసీసీ రంగంలోకి దిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేస్తానంటూ చెప్పడంపై ఢిల్లీ పెద్దలు ఎంటరయ్యారు.అటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఇటీవల అసంతృప్తిగా ఉండటం, టీపీసీసీ చీఫ్ చేసే వ్యాఖ్యలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తుండటం, యశ్వంత్ సిన్హా అంశంపై సీనియర్లంతా ఒకవైపు నిలువడం వంటి అంశాలపై హడావిడిగా దిద్దుబాటు మొదలుపెట్టింది. ఇదే క్రమంలో పార్టీలో చేరికలు అంటూనే ఇద్దరు కీలకమైన నేతలను అత్యవసరంగా ఢిల్లీకి పిలిచారు. ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో వేర్వేరుగా ఏఐసీసీ ముఖ్యలు భేటీ అయ్యారు. పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ముందు ఓసారి, అగ్రనేత రాహుల్ తో మరోసారి సమావేశమయ్యారు. ఇక సోమవారం సంచలనం ప్రకటిస్తానని చెప్పిన జగ్గారెడ్డి ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. మీడియా ముందుకొచ్చి తన వ్యాఖ్యలను నెగిటివ్ గా తీసుకోవద్దంటూ పేర్కొన్నారు. కచ్చితంగా పార్టీలో ఉంటానని, తనది కాంగ్రెస్ లైన్ అంటూ చెప్పుకొచ్చారు.
'జగ్గా'కు బ్రేక్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేశారు. తాను కీలక నిర్ణయం తీసుకుంటానని, సంచలనం చెప్తానంటూ ప్రకటించిన నేపథ్యంలో పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు కూడా. ఇప్పుడు రాజీనామాతో పాటుగా రేవంత్ రెడ్డికి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావిస్తారనే ప్రచారం జరిగింది. ఈ ప్రకటన తరువాత నుంచే రాష్ట్ర సీనియర్లతో పాటుగా ఏఐసీసీ కీలక నేతలు సైతం జగ్గారెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. చివరకు ఏఐసీసీ నుంచి బుజ్జగింపులు, సున్నితమైన హెచ్చరికలు రావడంతో జగ్గారెడ్డి మాట మార్చినట్లు పార్టీవర్గాలు చెప్తున్నాయి. కానీ, సీనియర్లు ఇదే అవకాశంగా తీసుకున్నారు. ఏఐసీసీకి వరుస ఫిర్యాదులు వెళ్లాయి. బహిరంగ విమర్శలకు దిగకుండా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
ఢిల్లీకి రండి
ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఢిల్లీకి పిలిచారు. ఇదే సమయంలో బడంగ్ పేట మేయర్, ఇద్దరు కార్పొరేటర్లు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో వారిని తీసుకుని వెళ్లారు. అయితే, వారంతా రాహుల్ సమక్షంలో కాకుండా.. రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఆ తర్వాత వారిని రాహుల్ కు పరిచయం చేశారు. ఈ చేరికల కోసమే ఢిల్లీకి వెళ్లినట్లుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నా.. అంతర్గతంగా మాత్రం ఏఐసీసీ నుంచి పిలుపు వస్తేనే ఢిల్లీ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఇంకో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అందుకే పీసీసీ, సీఎల్పీ ఢిల్లీలో ఉన్నారంటూ పార్టీ వర్గాలు వెనకేసుకొస్తున్నాయి.
ఇద్దరి మధ్య గ్యాప్
ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ కు, సీఎల్పీ నేత భట్టి మధ్య గ్యాప్ పెరిగింది. ఖమ్మంలో ఒక వర్గాన్ని రేవంత్ వెనకేసుకొస్తున్నారనే ప్రచారం ఉంది. అంతేకాకుండా ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన వారిని పార్టీలోకి తీసుకోగా.. ఈ సమాచారం భట్టికి తెలియకపోవడం మరో విశేషం. ఇదే క్రమంలో భట్టి కూడా అక్కడి నుంచి కొంతమందిని పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ విషయం రేవంత్ కు చెప్పలేదు. అంతేకాకుండా పలు నియోజకవర్గాల్లో ఇటీవల చేరికలు జరుగుతుండగా.. సంబంధిత సెగ్మెంట్ కు చెందిన నాయకులకు, పార్టీలోని కీలక నేతలకు తెలియకుండానే రేవంత్ రెడ్డి వాటిని పూర్తి చేస్తున్నారు. పలు సెగ్మెంట్లలో కొత్త వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూ పాత వారికి ప్రాధాన్యత లేకుండా డిస్ట్రబ్ చేస్తున్నారంటూ నేతలు మండిపడుతున్నారు. దీన్ని సీఎల్పీ నేతకు సైతం వివరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొత్తగా వచ్చేవారికి టికెట్ ఇవ్వమంటూ ప్రకటించారు. అటు రేవంత్ రెడ్డి మాత్రం పలువురికి టికెట్ హామీ ఇస్తున్నారంటూ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పంచాయతీ ఢిల్లీకి చేరింది. పార్టీకి కీలకమైన ఇద్దరిని అత్యవసరంగా ఢిల్లీకి పిలిచారు.
ఎవరికి వారే రిపోర్ట్
యశ్వంత్ సిన్హా అంశం పార్టీలో చిచ్చు పెట్టింది. అయితే, జాతీయ నాయకత్వంతో సంప్రదించే ఈ నిర్ణయం తీసుకున్నానని రేవంత్ చెప్పారు. కానీ, సీఎల్పీకి యశ్వంత్ ను ఆహ్వానించాల్సి ఉందంటూ జగ్గారెడ్డి వాదించారు. ఇదే సమయంలో వీహెచ్.. యశ్వంత్ సిన్హా ప్రొగ్రాంకు వెళ్లడం మరింత వివాదమైంది. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీటిపై జగ్గారెడ్డి సైతం అదేస్థాయిలో రిప్లై ఇచ్చారు. సీఎల్పీని అడిగామని, రేవంత్ కు సంబంధం లేదంటూ సూచించారు. సీఎల్పీ భట్టి మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరికి హస్తిన నుంచి ఆహ్వానం రావడంతో.. ఎవరికి వారే నివేదికలతో వెళ్లారు. ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ ముందు రాష్ట్ర పరిస్థితులపై నివేదికలను ఇచ్చారు.
కాగా, ప్రస్తుతం ఢిల్లీలో ఇద్దరూ కలిసి తిరుగుతున్నా.. అంతర్గతంగా మాత్రం ఒకరిపై ఒకరు రగిలిపోతున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా భట్టితో పాటుగా పలువురు సీనియర్లు కూడా గాంధీభవన్ మెట్లు ఎక్కడం లేదు. టీఆర్ఎస్, బీజేపీ నుంచి వస్తున్న విమర్శలకు రేవంత్ టీం మినహా.. ఎవరూ కౌంటర్ కూడా ఇవ్వడం లేదు. మోడీని నిలదీయాలని ఓ సందర్బంలో రేవంత్ ప్రకటించినా పార్టీ నేతల నుంచి స్పందన రాలేదు. దీంతో పార్టీలోని అంతర్గత విభేదాలు మళ్లీ వెల్లడయ్యాయి. ఇప్పుడు ఇద్దరు నేతలు ఏఐసీసీ ముఖ్యుల ముందు ఉండటంతో.. ఎలాంటి పరిణామాలు జరుగుతాయని ఎదురుచూస్తున్నారు. పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీలో ఉత్కంఠను రేపుతోంది.