మోడీ విధానాలన్నీ ఇద్దరు మిత్రుల కోసమే: ప్రియాంకా గాంధీ

by Disha Desk |
మోడీ విధానాలన్నీ ఇద్దరు మిత్రుల కోసమే: ప్రియాంకా గాంధీ
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన విధానాలు కేవలం మోడీ ఇద్దరు పారిశ్రామిక స్నేహితులకు సహాయకరంగా ఉన్నాయని ఆరోపించారు. ఉత్తరాఖండ్ ఖటిమాలో 'ఉత్తరాఖండీ స్వాభిమాన్' ర్యాలీలో శనివారం ప్రియాంకా ప్రసంగించారు. కేంద్రం బడ్జెట్‌లో పేదలకు, రైతులకు, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. కేవలం తన పారిశ్రామిక స్నేహితులకు ఉపయోగపడే విధానాలను తీసుకువచ్చారని అన్నారు. 'డీమానిటైజేషన్ తర్వాత జీఎస్టీ తీసుకొచ్చారు. ఆ తర్వాత కరోనా వచ్చింది. చిన్న వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వీరంతా మతం గురించి మీ ముందు మాట్లాడుతున్నారు. ఇది ఎటువంటి మతం? నాయకుడి మతం ప్రజల అభివృద్ధి గా ఉండాలి. ఒకవేళ వారు మీ కోసం పనిచేస్తే, కరోనాకు వైద్య సదుపాయం ఉండేది. అర్హులకు ఉద్యోగాలు వచ్చేవి. ఈ ప్రాంతంలో టాలెంట్, వనరులు ఉన్నప్పటికీ, ఉద్యోగాలు మాత్రం లేవు' అని అన్నారు. రాజకీయ నాయకుడికి అతిపెద్ద కర్తవ్యం ప్రజలకు సేవ చేయడమేనని నొక్కి చెప్పారు. కానీ బీజేపీ నేతలు తమ స్వంత అభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నప్పటికీ, వలసలు ఎక్కువగానే ఉన్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తో అలసిపోయిన ప్రజల మద్దతుతో కాంగ్రెస్ తప్పక అధికారంలోకి వస్తుందని నొక్కి చెప్పారు. తాము అధికారంలోకి వస్తే 4లక్షల ఉద్యోగాలతో పాటు, తక్కువ ధరకే వంట గ్యాస్ సదుపాయం కల్పిస్తామని అన్నారు. దీంతో పాటు పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed