రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం.. ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

by Manoj |
రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం.. ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌
X

దిశ,ఏపీ బ్యూరో: రాష్ట్రంలో అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మనుసును కలచివేశాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు తమవంతుగా ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఆ సాయాన్ని తానే స్వయంగా వెళ్లి బాధితులకు అందజేస్తానని వెల్లడించారు.

తొలుత గోదావరి జిల్లాల్లో 80 కుటుంబాలకు, ఆ తర్వాత కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న 150 మంది రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. రైతులు రక్తం ధారపోస్తేనే రాష్ట్రం అన్నపూర్ణగా పేరుగాంచిందన్నారు. అలాంటి అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఆత్మహత్యలేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారికంగా 16 లక్షల మంది కౌలు రైతులున్నారని తెలిపారు. కానీ దాదాపు 45 లక్షలుండే అవకాశముందన్నారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గోదావరి జిల్లాల్లో 80 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఆర్థిక సాయం చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేసిందని ఆరోపించారు.

Advertisement

Next Story