ఆదివాసీలు, అడవి ఘోషను వినిపించిన సినిమా 'పడ'

by GSrikanth |   ( Updated:2022-04-03 07:07:27.0  )
ఆదివాసీలు, అడవి ఘోషను వినిపించిన సినిమా పడ
X

దిశ, వెబ్‌డెస్క్: పాతికేళ్ల ఏళ్ల క్రితం కేరళలో జరిగిన ఒక ఉత్కంఠభరిత యధార్థ ఘటనే 'పడ' (PADA - చిన్న సేన లేదా దళం) సినిమాకు మూలం. ఇది కేవలం డాక్యుమెంటరీ కాదు. మసాలా సినిమా అంతకంటే కాదు. అంతకుమించిన జీవితం. ఈ దేశ మూలవాసులైన ఆదివాసుల పట్ల యావత్ పాలకవర్గం చేస్తున్న దౌష్ట్యం, దౌర్జన్యం, అన్యాయాలకు వ్యతిరేకంగా పెట్టిన పొలికేక ఇది. ఆదివాసుల హక్కులను కాపాడాలని ఘోషపెడుతూ, వీధిపోరాటాలు చేస్తూ వచ్చినప్పటికీ, కేరళ అసెంబ్లీ సాక్షిగా అన్ని మార్గాలూ మూసుకుపోయిన క్షణంలో కుపితులైన, కడుపు మండిన నలుగురు ఆదివాసీ యువకులు (ఒక యువతి సాయం కూడా ఉంది) రాజ్యంపై తమదైన పోరు మార్గం ఎంచుకున్న వాస్తవ గాథకు సినిమా రూపమే 'పడ'. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో అజయన్ మన్నుర్, విలయోడి శివన్‌కుట్టి, కలార్ బాబు, కన్హంగడ్ రమేశన్ అనే నలుగురు స్థానిక ఆదివాసీ యువకులు బొమ్మతుపాకీతో, నకిలీ బాంబులతో 1996లో జిల్లా కలెక్టర్‌ను తన ఆఫీసులోనే కిడ్నాప్ చేసి నాటి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని 10 గంటల పాటు ఉరకలెత్తించిన వాస్తవ ఘటనే 'పడ' సినిమాకు మూలం. సినిమా కథను తీర్చిదిద్దిన వైనం, పాత్రధారుల అద్భుత నటనా ప్రదర్శన ఎంత గొప్పగా ఉన్నాయంటే రాజకీయ ప్రచారానికి ఈ సినిమా నూటికి నూరు శాతం దూరంగా నిలిచింది.

ఈ యువ బృందం డిమాండ్ ఒక్కటే. కేరళ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఆదివాసీ భూములు బదిలీపై ఆంక్షల) చట్టం 1975కి కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను ఉపసంహరించుకోవాలన్నదే ఆ డిమాండ్. 1960 తర్వాత ఆదివాసులనుంచి సెటిలర్స్ సంగ్రహించిన భూములన్నింటినీ తిరిగి ఆదివాసులకే అప్పగించాలని 1975లో తీసుకొచ్చిన చట్టానికి అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలన్నీ తూట్లు పొడిచాయి. 1996లో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టానికి చేసిన సవరణ అదివాసీల హక్కుల నిర్మూలనపై సంధించిన చివరి అస్త్రమై నిలిచింది. దీంతో కడుపు మండిన నలుగురు ఆదివాసీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని చర్చల బల్ల వద్దకు తీసుకురావడానికి సాహసోపేతమైన చర్యకు పాల్పడ్డారు. అదే నాటి పాలక్కాడ్ జిల్లా కలెక్టర్‌ని తన కార్యాలయంలోనే బందించడం.

'పాడ' కథ క్లుప్తంగా

''నలుగురు యువకులతో కూడిన సాయుధ బృందం పాలక్కాడ్ కలెక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డిని తన ఛాంబర్‌లో అక్టోబర్ 4, 1996. ఉదయం 10.30 గంటల సమయంలో బందీలుగా పట్టుకున్నారని తెలియడంతో కేరళ దిగ్భ్రాంతికి గురైంది. ఆ బృందం చేతిలో తుపాకీ, బాంబు, డైనమైట్ ఉన్నట్లు సమాచారం. కల్లరబాబు, అజయన్ మన్నూర్, కన్హంగాడ్ రమేశన్, విలయోడి శివన్‌కుట్టి అనే యువకులు కలెక్టర్‌ను బందీగా పట్టుకున్న వారు. నయనార్ మంత్రివర్గం ఆమోదించిన ఆదివాసీల భూ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని ʹఅయ్యంకలిప్పాడʹ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మధ్యవర్తిని నియమించాలని, అప్పట్లో ఏకైక ప్రైవేట్ న్యూస్ ఛానెల్ ఏషియానెట్ సిబ్బంది వస్తేనే చర్చకు సిద్ధం అవుతామని అయ్యంకాళి పోరాట దళం పెట్టిన రెండు షరతులను అంగీకరించారు. మధ్యవర్తిగా ప్రముఖ క్రిమినల్ లాయర్ వీరచంద్ర మీనన్ ఉన్నారు.

ఈ విషయానికి ప్రాముఖ్యతనిచ్చి పరిశీలిస్తామని, పోలీసు కేసు ఉండదని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అయ్యంకాళిప్పాడ సభ్యులు రాత్రి 9 గంటలకు కలెక్టర్‌ను విడుదల చేశారు. కలెక్టర్ గది నుంచి బయటకు వచ్చిన బృందం తయారు చేసి, మీడియా ముందు కల్లారబాబు చదివి వినిపించిన ప్రకటన. ʹమా అవసరాలు చాలా చిన్నవి. మీరు మీ రాజ్యాంగానికి, న్యాయ వ్యవస్థకు న్యాయం చేకూర్చాలి. గిరిజనుల భూ పరిరక్షణ చట్టానికి మానవ హక్కుల అవగాహనకు వ్యతిరేకంగా చేసిన సవరణను రద్దు చేయాలి. అణగారిన ప్రజల ఐక్యతను నాశనం చేయడానికి, మీ మురికి వ్యవస్థను రక్షించడానికి మీరు చేసిన ఈ చర్యను వ్యతిరేకించడానికి మేము మా సర్వ శక్తులనూ ఉపయోగిస్తాము. కలెక్టర్‌ను బందీగా ఉంచేందుకు బొమ్మ తుపాకీ, గ్రెనేడ్, పీవీసీ పైపును ఉపయోగించినట్లు అయ్యంకాళి కార్యకర్తలు వెల్లడించడంతో కలెక్టరేట్‌లో ఉన్న మీడియాతో పాటు అక్కడున్న వారిలో నవ్వులు వెల్లివిరిసాయి. గిరిజనుల భూ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లడమే అయ్యంకాళి సేన లేదా దళం పోరాట లక్ష్యం.''

భగత్ సింగ్ నుంచి అయ్యంకలిప్పాడ దాకా...

సాధారణంగా పౌర సమాజం ఆమోదించే పరిమితుల్లో సాగే పోరాటాలు ఎన్నో వీగిపోయిన స్థితిలోనే హింసాత్మక చర్యలు ప్రజ్వరిల్లడం గత వంద సంవత్సరాలుగా ఎన్నో సందర్భాలుగా దేశం చూసింది. బ్రిటిష్ వాడి చెవుల్లో తుప్పు ఊడగొట్టడానికి, వలస పాలనకు వ్యతిరేకంగా భారత ప్రజల నిరసన వినిపించడానికి ఆనాడు భగత్ సింగ్, తన సహచరులు నాటి భారత పార్లమెంటులో బాంబు పేల్చిన ఘటనను జాతి ఇంకా మర్చిపోలేదు. భగత్ సింగ్ తదితరుల చర్యతో పోల్చలేకున్నా, ఒక రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు వ్యతిరేకంగా పదేపదే పాలక వ్యవస్థ చేస్తూవస్తున్న చర్యలకు కుపితులై నలుగురు స్ధానిక యువకుల బృందం వాస్తవంగా చేసిన డేరింగ్ చర్యే 'పడ' సినిమాకు మూలం.

భారతదేశంలో ఆదివాసీ కమ్యూనిటీలను అడివి నుంచి వెళ్లగొట్టడమే మన దేశంలో భూమికి సంబంధించిన ప్రాథమిక సమస్య అని చెప్పాలి. స్వాతంత్ర్యానంతరం ఈ దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ స్థానిక, ఆదివాసీ ప్రజలకు తమదైన జీవితాన్ని, భూమినీ వారికి కాకుండా చేసి ఆశ్రిత పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటం కోసమే చట్టాలు రూపొందిస్తూ వచ్చాయి. దశాబ్దాలుగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగుతున్న ఈ ప్రజా వ్యతిరేక క్రమం పట్ల కేరళ రాష్ట్రంలో 1990ల మధ్యలో ఒక యువ బృందం వైవిధ్యపూరితంగా అసమ్మతిని ప్రకటించిన ఘటన 'పడ' సినిమా రూపంలో మన ముందు మళ్లీ ప్రశ్నార్థకమై నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే మూడు దశాబ్దాలకే మనం మర్చిపోయిన మన చరిత్రను మళ్లీ గుర్తు చేసిన సినిమా 'పడ'.

వాస్తవం నుంచి అణుమాత్రం పక్కకుపోని డైరెక్షన్

పదేళ్ల క్రితమే పనిస్థంలో కుప్పకూలిపోయిన గుర్తు తెలీని కార్మికుడి గుర్తింపు కోసం శోధించిన ఐ.డి అనే వైవిధ్యభరితమైన ప్రారంభ చిత్రాన్ని తీసి ఉత్తేజపరిచిన కమల్ కె.ఎమ్. ఈ 'పడ' సినిమా డైరెక్టర్. 1996లో ఆదివాసీలను తమ నివాసాలనుంచి వెళ్లగొట్టడానికి వీలుకల్పిస్తూ కేరళ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు నిరసనగా నలుగురు కేరళ మిత్రులతో కూడిన చిన్న సైన్యం నాటి పాలక్కాడ్ జిల్లా కలెక్టర్‌ని తన కార్యాలయంలోనే బంధించింది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను బయటి ప్రపంచానికి తెలిపిన ఉత్కంఠ భరిత కథనానికి కమల్ కెఎమ్ సినిమా రూపంలోకి మలిచారు. కేరళ అసెంబ్లీలోని 140 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క గౌరియమ్మ (మాజీ సీపీఎం నాయకురాలు) తప్ప తక్కిన 139 మంది ఎమ్మెల్యేలూ ఆదివాసీ (నిర్మూలన) చట్టానికి ఏకగ్రీవంగా ఆమోదముద్ర తెలిపారు.

ఆదివాసీలను తమ నివాస ప్రాంతాలను వెళ్లగొట్టి శరణార్థులుగా మార్చే శక్తివంతమైన ఈ చట్టంపై నిరసనలు, వీధి పోరాటాలు పనిచేయని క్షణంలో నలుగురు స్థానిక యువకులు ఆనాటి పాలక వ్యవస్థకు షాక్ ట్రీట్ మెంట్ ఇస్తూ కొత్త పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. దానికి వారు ఎంచుకున్న ఆయుధాలు ఒక బొమ్మతుపాకీ, కొన్ని నకిలీ బాంబులు. దాదాపుగా ఇప్పుడు జనం మర్చిపోయిన ఆ ఉదంతాన్ని రాకేష్ పాత్రధారిపై నేరుగా కెమెరా పెట్టి ఇంటర్వ్యూ చేయడంతో 'పడ' సినిమా కథ మొదలవుతుంది. డాక్యుమెంటరీ డ్రామాను పోలిన ట్రీట్‌మెంటుతో ఆనాడు జరిగిన ప్రతి చిన్న విశేషాన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన వివరాలతో ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా జరిగింది జరిగినట్లుగా తీయడంలో దర్శకుడి ప్రతిభ సాటిలేనిదని చెప్పాలి.

సాధారణంగా తిరుగుబాటుదారులు, విప్లవకారులు అంటే మన ఆర్ నారాయణ మూర్తి మూస సినిమాలలో లాగా ఓండ్రపెడుతూ, గావుకేకలు వేస్తూ, సింహనాదాలు చేస్తూ, విలన్లను నరికిపడేస్తూ, కాల్చిపడేస్తూ, ఏకే 47లను అడ్డదిడ్డంగా ఊపుతూ తాండవం చేస్తూ, చూస్తుంటేనే పిల్లలు భయంతో దడుచుకునేలా చేసే రౌద్రప్రదర్శనతో భీతిగొల్పుతూ ఉండే తరహా సినిమాల్లో కనిపించే విప్లవ లేదా నక్సలైటు హీరో పాత్రలకే మనం అలవాటు పడిపోయాం... లేదా వాటి జోలికే పోకుండా దూరమైపోయారు సగటు ప్రేక్షకులు. కాని 'పడ' సినిమా నక్సలైట్ నేపథ్యంలో తీసిందే అయినా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలు మనుషులను మాత్రమే తలపించడం, మామూలు మనుషులకు దగ్గరగా కనిపించడంతో సినిమా కథనం ఆద్యంతం మనల్ని సినిమావైపు లాక్కెళుతుంది.

అడవిఘోష వినిపించిన పాట

'పడ' సినిమా ప్రారంభంలోనే అద్భుతమైన డ్రోన్ షాట్‌తో పచ్చటి అడవిని విశాలంగా చూపిస్తూ పాట మొదలవుతుంది.

ఓ భూమీ, ఓ నేలా, ఓ దేశమా

మా అడవి ఘోష విన్నావా?

ఓ భూమీ, ఓ నేలా, ఓ దేశమా

మా అడవి ఆక్రందన విన్నావా?

అయ్యో... అయ్యో... అయ్యయ్యో... అంటూ

మా అడవి ఇక్కడ విలపిస్తుంటే

వాళ్లు అక్కడ పకాపకా నవ్వుతున్నది విన్నావా

మా పొట్టలు ఆకలితో మండిపోతున్నాయ్

ఇక్కడ సీతాకోక చిలుకలు లేవ్. తేనెటీగలు లేవ్

నేలా, చెట్లూ ఎండిపోయాయ్

మేం కాసింత బెరడు కోసం వేడుకుంటూంటే

వాగులు ఎండిపోయాయ్.

వేడి, కంపు మాత్రమే ఇక్కడ ఉండిపోయాయ్

మేం నివసించిన అడవే

శాశ్వతంగా మాకు దూరమైంది

ఓ భూమీ, ఓ నేలా, ఓ దేశమా

మా అడవి ఘోష విన్నావా?

ఓ భూమీ, ఓ నేలా, ఓ దేశమా

మా అడవి ఆక్రందన విన్నావా?

మా అడవి ఇక్కడ విలపిస్తుంటే

వాళ్లు అక్కడ పకాపకా నవ్వుతున్నది విన్నావా....

అడవి, ఆదివాసుల మధ్య రక్త బంధం తెగిపోయి దూరం పెరుగుతున్న, పెంచుతున్న క్రమాన్ని-- అడవి ఏడుస్తూంటే పాలకులు నవ్వుతున్నారంటూ ఒక చిన్నారి గొంతు ద్వారా వినిపించిన పాట వీక్షకుల గుండెల్ని పిండేస్తుంది. ఆ పాట పూర్తికాక ముందే ఈ గొప్ప ల్యాండ్ స్కేప్‌లో కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉండటం కనిపిస్తుంది. ఆ అడవిని తమ సొంత మైదానంగా చేసుకుని ఒక చెల్లి, ఆమె సోదరుడు దాగుడుమూతలు ఆడుకుంటుంటారు. కానీ ఆ మర్నాడు తెల్లవారకముందే వారి కుటుంబం తమ ఇంటిని, తాముంటున్న నేలను వదిలిపెట్టి ఒక పెద్దపట్టణంలోని ఇరుకు శివారుకు బస మార్చవలసి వస్తుంది. ఈ పిల్లల తండ్రి బాలు (వినాయకన్) త్వరలో కలెక్టర్‌ని బంధించేందుకు ప్రయత్నిస్తున్న అయ్యంకళిపాడ అనే యువ విప్లవ గ్రూప్‌లోని నలుగురు సభ్యుల్లో ఒకరు అని తెలుసుకుంటాం.

నలుగురు యువకుల చర్య పర్యవసానాల గురించిన సినిమానే అయినా, ఇతర పాత్రలు కూడా కలెక్టరేట్ అనే శక్తివంతమైన అధికార వ్యవస్థను తమ సమస్యలను తీర్చే చివరి ఆశాకిరణంగా శక్తిహీనులైన ప్రజలు ఎలా చూస్తుంటారో తెలుపుతాయి. తమ అదృష్టాన్ని కనుగొనలేని వారు లాటరీ టిక్కెట్లు అమ్ముతూ ఇతరులకు లక్ష్మీదేవి నేరుగా ఇంట్లోకి వస్తుందంటూ ఊరించే పాత్రలనూ మనం చూస్తాం. కలెక్టర్‌ని కిడ్నాప్ చేయాలని వచ్చిన అతడిని పట్టుకుని లాటరీ టికెట్ తీసుకో అంటూ ఒక ముసలామె అడుగుతుంది. నాకు వద్దు నేను కొనను అంటూంటే కాసేపు బతిమాలిన ఆమె ఇక వీడు వినడు అని నిశ్చయించుకుని టీ తాగుతావా... టీ ఇమ్మని చెప్పావా అంటూ పరామర్శిస్తుంది. వాళ్లు వచ్చిన పనేంటి.,. ఈమె అడిగిన మాటలేంటి తల్చుకుంటే నవ్వాగదు.. అస్తిపంజరానికి రక్తమాంసాలు అద్దిన చందాన ఇంత సీరియస్ ఇంటెన్స్ సినిమాలోనూ ఇలాంటి సజీవ సంభాషణలు మలయాళీలకే సాధ్యం అనిపించేలా సినిమా స్క్రీన్ ప్లే రూపొందించారు.

నిరాశ్రయులుగా మారిన తమను ఆదుకోవాలంటూ కలెక్టరేట్‌కు వచ్చిన ముసలి దంపతులను కూడా అక్కడే చూస్తాం. ఆదివాసీలను తమ నేలనుంచి వెళ్లగొట్టే బిల్లు, దానికి వ్యతిరేకంగా తిరగబడిన వారిపైనే 'పడ' సినిమా కేంద్రీకరించినప్పటికీ, బలహీనులను నిర్లక్ష్యం చేయడంలో మన వ్యవస్థ ఎలా కండిషన్‌కి గురైందో గుర్తుచేయడాన్ని సినిమా మర్చిపోలేదు.

దర్శకుడు తల్చుకుని ఉంటే కళ్లార్పకుండా చేసే ఒక థ్రిల్లర్ సినిమాలాగా మసాలాలు దట్టించి నాటకీయతను కుప్పించి 'పడ' సినిమాను తీసి ఉండవచ్చు. కానీ కలెక్టరేట్ వంటి బలమైన అధికార కేంద్రంపై దాడి చేసే వ్యక్తుల ఆర్థిక స్థితిగతులు ఏమిటన్న అంశాన్ని కూడా వదలకుండా, రైటింగ్ విభాగాన్ని ఆకాశంలో విహరించకుండా భూమ్మీదే నిలిపాడు దర్శకుడు. కలెక్టర్‌ని బంధించటంలో సఫలమైతే సమస్య పరిష్కారమయ్యేవరకు తన నిరసనను కొనసాగించడానికి డ్రై ఫ్రూట్స్ ఉపయోగపడతాయని బాలు అనే పాత్రధారి సూచిస్తే, జోజూ జార్జ్ పాత్ర, డ్రైఫ్రూట్స్ కొనడం మన శక్తికి మించిన పని అని చెప్పి వాస్తవంలోకి దింపుతాడు. ఇది వారు వేసుకున్న ప్లాన్‌లో వాస్తవంగా ఎన్ని కష్టాలుంటాయో మనకు బోధపర్చడమే కాదు.. ఈ నలుగురు యువకులూ నిజంగా ప్రమాదకరమైనవారేనా అనికూడా మనకు సందేహం కలిగిస్తుంది. అయితే ఇదే వ్యవస్థ వీరిపై దాడికి దిగినప్పుడు దాని శక్తి ఎంత గొప్పదో సినిమా చూపుతుంది. అయితే చివరలో తాము చట్టబద్ధంగా, ప్రజాస్వామికంగా తప్పించుకునే మార్గాన్నికూడా ఈ వ్యవస్థే వారికి అందిస్తుందని గ్రహిస్తాం.

స్క్రీన్‌ప్లేతో ఆడుకున్న దర్శకుడు

తొలి చిత్రం ఐ.డీ. తోనే తనలోని ప్రతిభ గొప్పదనాన్ని, కొత్తదనాన్నీ చూపించిన దర్శకుడు కమల్ కెఎమ్ తనవద్దకు వచ్చిన 'పడ' సినిమా కంటెంటును రెండు గంటలపాటు రీక్రియేట్ చేయడంలో, ప్రదర్శనకు అనువుగా మల్చడంలో, ఎడిటింగ్‌లో అంతకుమించి ప్రధాన పాత్రధారులనుంచి ప్రశంసనీయమైన నటనను రాబట్టడంలో పూర్తి నియంత్రణ సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1987లో ఏడుగురు ఐఏఎస్ ఆఫీసర్లను పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు గుర్తేడు అడవుల్లో కిడ్నాప్ చేసినప్పుడు ఆ వార్త జాతీయ వార్తగానే కాదు ప్రపంచవార్తగా మారి సంచలనం కలిగించింది. 'పడ' సినిమాలో కూడా నలుగురు మనుషుల బృందం తెగించి చేసిన సాహసోపేత చర్య రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించిన వైనాన్ని సినిమా రూపంగా మల్చడంలో దర్శకుడు ఒక్క సందర్భంలో కూడా ఏమారలేదని మనకు బోధపడుతుంది. ఒక సాహసోపేతమైన చర్యలో పాల్గొన్న కొంతమంది వ్యక్తుల బృందం నటనా ప్రతిభను స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన 'మ్యూనిచ్' (Munich) సినిమాలో కూడా మనం చూస్తాం.

అయితే 'పడ' సినిమాలో మన బాహుబలి వండర్స్, రాధేశ్యామ్ చిత్రంలోని టైటానిక్‌ని పోలిన షిప్పులు, ఆర్ఆర్ఆర్ లోని హీరోల మానవాతీత శక్తుల ప్రదర్శనలు, గూస్ బంప్స్ అని ఇటీవల తరచుగా వాడుతున్న ఎమోషన్ల పరాకాష్ట దృశ్యాలు వంటి మెరుపులు ఏవీ లేవు. కానీ కలెక్టర్‌ని బంధించడం అనే ఒక హోస్టేజ్ డ్రామాలో నేలను విడిచి సాముచేయని వాస్తవికత యధాతథంగా మన కళ్లముందు ప్రతి దృశ్యంలోనూ కనబడుతూనే ఉంటుంది. వ్యవస్థపై వ్యక్తుల లేక కొందరు వ్యక్తులతో కూడిన గ్రూప్ ఆగ్రహ ప్రదర్శనను శిఖరస్థాయిలో చిత్రీకరించిన సినిమాలు ప్రపంచ సినిమా రంగంలో ఎన్నో ఉన్నాయి. కానీ రాంబో స్థాయి అరుపులు, పెడబొబ్బలు, తొడగొట్టడాలు లేకుండా ఒక సీరియస్ సినిమాను శబ్ద ఘోష లేకుండా ఎంత సైలెంటుగా తీయవచ్చో ఈ 'పడ' సినిమా ద్వారా దర్శకుడు చేసి చూపించారు.

సాత్విక నటనతో సగం విజయం

అయ్యంకళి పడ అనే రెవల్యూషనరీ బృందంలోని నలుగురు సభ్యులు, మన దేశంలోని కోట్లాది మంది ఆదివాసుల జీవితాల్లో దశాబ్దాలుగా ఏర్పడుతూ వస్తున్న వ్యధలకు పరిష్కారం కనుగొనడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నామంటూ వీక్షకులను నమ్మించడానికి చివరివరకు ప్రయత్నిస్తారు. ప్రజానీకంలో ఒక్క శాతం మంది ప్రయోజనాలను కూడా అడ్డుకుంటున్న మన చట్టాలు అదే సమయంలో దోపిడి దారులకు ఎంత చక్కగా, సమర్థంగా ఉపయోగపడుతున్నాయో అర్థం చేయించడంలో వీరు పూర్తిగా విజయవంతమవుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాత్రలో ప్రకాష్ రాజ్ ఎంత ఒదిగిపోయి నటించాడో, దానికి మించి ప్రధాన పాత్రదారి కుంచకో బోబన్ వ్యవస్థపై తన తీవ్ర ఆగ్రహాన్ని గూడా పరమ సాత్వికంగా చూపించడంలో తన పాత్రకు జీవం పోశాడనే చెప్పాలి. తన పాత్రపై అసాధారణ అవగాహన, కృత నిశ్చయం ఉంటే తప్ప ఇలాంటి పాత్ర పోషణ అందరికీ సాధ్యం కాదు. చొక్కాలోపల బొమ్మ గన్ దాచుకుని పోలీసులకు దొరికిపోయిన సందర్భంలో కూడా తన నిజమైన ఉద్దేశాలను దాచి ఉంచి తప్పించుకోవడానికి పోలీస్ స్టేషన్లో బోబన్ ఎంత తెలివిగా కథ అల్లాడంటే సినిమాకు హైలెట్ అయిన దృశ్యాల్లో అదీ ఒక్కటిగా మిగిలిపోయింది.

ఒక వైపు వ్యవస్థపై ఆగ్రహంతో కలెక్టర్‌నే బందీగా పట్టుకున్న యువ బృందం, మరోవైపు వారి డిమాండ్లను సానుభూతితోనే ఆలకించిన కలెక్టర్, కిడ్నాపర్లను శాంతపర్చడంలో బయటనుంచి తీవ్రంగా శ్రమించిన చీఫ్ సెక్రటరీ ప్రకాష్ రాజ్ అతడి బృందం, కలెక్టర్ కార్యాలయం వెలుపల ఏం చేయాలో తెలీక నిలబడిపోయిన పోలీసు అధికారులు, మరోవైపు కిడ్నాపర్లపై దాడికి సిద్దమైన ప్రత్యేక బలగాలు ఇలా క్షణక్షణానికి మారిపోతున్న పరిస్థితులను చిత్రీకరించడంలో వాస్తవికతకే ప్రాధాన్యమిచ్చిన దర్శకుడు ఈ చిత్రం వెనుక ఉన్న రాజకీయ, సాంకేతిక సెన్స్‌ని అద్బుతంగా సమన్వయించాడు. 1996 అక్టోబర్ 4 ఉదయం ఏం జరిగిందన్న ఘటన నుంచి కిడ్నాప్ ఉదంతం ముగిసిన రాత్రి 9 గంటల దాకా ప్రతి వివరాన్ని పొల్లుపోకుండా సేకరించిన దర్శకుడు సినిమాటిక్ లిబర్టీస్‌ని మూల కథ జోలికి పోని విధంగా ఉపయోగించుకున్నారు. కానీ ఈ చిత్ర కథకు అదనంగా తాను జోడించిన సాంకేతిక విలువల విషయానికి వస్తే విష్ణు విజయ్ సంగీతం, షాన్ మహమ్మద్ ఎడిటింగ్, సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ అద్భుతాలనే సృష్టించాయని చెప్పాలి.

పెడబొబ్బలు లేకుండా సినిమా తీయలేమా?

అయ్యంకళిపాడ గ్రూప్ మధ్య, క్రైసిస్ మేనేజ్మెంట్ నిపుణుల మధ్య, కలెక్టర్ అతడి కుటుంబ సభ్యుల నిస్సహాయత్వం మధ్య ఎక్కడా టెంపో చెదరకుండా స్క్రీన్‌ప్లే అల్లుకున్న దర్శకుడు కమల్‌కి, సినిమాకు తుది రూపం తేవడంలో ఎడిటర్ షాన్ మహమ్మద్ విశేషంగా తోడ్పడ్డాడు. ముఖ్యంగా సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల అరాచకాలను చూస్తూ వీక్షకుల రక్తం మరగాల్సిన సందర్భాల్లో కూడా దర్శకుడు చాలా బాలెన్స్‌డ్‌గా వ్యవహరించాడు. ఆదివాసీల పట్ల మన పాలక వ్యవస్థ చేస్తున్న దౌష్ట్యం, దౌర్జన్యాలను గురించి ఆలోచింప జేయడంలో 'పడ' సినిమా తన పరిమితులను దాటలేదు. అందుకే ఈ సినిమా కోసం వాడుకున్న సాంకేతిక స్పేస్ తిరుగులేనిదని చెప్పాలి. ముఖ్యంగా విప్లవ చిత్రం అంటే, తిరుగుబాటు అంటే గావుకేకలు, పెడ బొబ్బలు, అతి నటన అనే ముద్ర బలంగా పడి, ప్రేక్షకులు పారిపోతున్న నేపథ్యంలో ఒక సజీవ ఘటనను మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ సమాజానికి గుర్తు చేయడంలో 'పడ' సినిమా నిర్వహించిన సాంకేతిక పాత్ర అసాధారణమనే చెప్పాలి. కలెక్టర్ కిడ్నాప్ ఘటన జరిగిన పది గంటల వ్యవధిలో కేరళ సమాజాన్ని, పాలక యంత్రాంగాన్ని ఎలా అట్టుడికించిందో, సమస్త పాలనా యంత్రాంగం ఎలా పరుగుతీసిందో ప్రతిభావంతంగా చూపిన 'పాడ' సినిమా లాంటి కళారూపాలను తెలుగు చిత్ర రంగం భవిష్యత్తులో అయినా వాస్తవిక రీతిలో తీయగలుగుతుందని ఆశించవచ్చా?

మన ముందున్న సమస్య సామాజిక న్యాయం, సమానత్వం మరియు స్వేచ్ఛ. మీరు దానిని పొందవలసి ఉంటుంది. దానికోసం పోరాడతాం. లేదంటే కొత్త తరం వారే ఆ బాధ్యతను తీసుకుంటారుʹ అని ఆ నలుగురు యువబృందంలో ఒకరైన కలార్ బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలా కొత్త తరం కూడా పరిష్కారం కోసం తమ తమ మార్గాలు ఎంచుకునే పరిస్థితులు రాకుండా పాలకవర్గాలు జాగ్రత్తపడతాయా? కానీ సమస్త వనరులనూ, పబ్లిక్ రంగ పరిశ్రమలనూ, వాటితోపాటు అడవులను కూడా అంబానీలకూ, అదానీలకు తదితర క్రోనీ క్యాపిటలిస్టులకు అప్పనంగా అందిస్తున్న పాలక వర్గం గుణపాఠాలు నేర్చుకోకపోవడమే మనకు మిగిలిన విషాదం.

కథ, దర్శకత్వం: కమల్ కె.ఎమ్.

నటీనటులు: కుంచకొ బోబన్, వినయకన్, జోజు జార్జ్, దినేష్ పోతన్, ప్రకాష్ రాజ్ తదితరులు

సంగీతం: విష్ణు విజయ్, ఎడిటింగ్ షాన్ మహమ్మద్, సినిమాటోగ్రఫీ సమీర్ తాహిర్.

ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.

Advertisement

Next Story

Most Viewed