గాడి త‌ప్పిన ఐటీడీఏ.. ప‌రిపాల‌న‌ను గాలికొదిలేసిన పాల‌క‌వ‌ర్గం

by samatah |
గాడి త‌ప్పిన ఐటీడీఏ.. ప‌రిపాల‌న‌ను గాలికొదిలేసిన పాల‌క‌వ‌ర్గం
X

దిశ, ఏటూరునాగారం : ఏటూరునాగారం ఐటీడీఏ ప‌రిపాల‌న గాడి త‌ప్పింది. ప‌రిపాల‌న‌ను పాల‌క‌వ‌ర్గం గాలికొదిలేసింది. నిబంధ‌న‌ల ప్రకారం.. మూడు నెల‌ల‌కొసారి స‌మావేశం నిర్వహించి ప్రగ‌తిపై స‌మీక్ష చేయాల్సిన పాల‌క‌వ‌ర్గం క‌రోనా సాకుతో గ‌త ఏడాదంతా అట‌కెక్కించింది. అయితే ప్రస్తుతం క‌రోనావేవ్ ఏమాత్రం లేకున్నా.. స‌మావేశం నిర్వహించి స‌మీక్ష చేయ‌క‌పోవ‌డం వారి నిర్లక్ష్య నినాదానికి నిద‌ర్శన‌మ‌నే చెప్పాలి. అనేక అభివృద్ధి అంశాల్లో అవినీతి, అక్రమాలు జ‌రుగుతున్నట్లు ఏజెన్సీ జ‌నం నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శలు వ్యక్తమ‌వుతున్నా.. పాల‌క వ‌ర్గం చెవికెక్కపోవ‌డం విశేషం. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఇంజనీరింగ్ పనులు కుప్పలు తెప్పలుగా పెండింగులో ఉన్నాయి. వాటికి మంజూరు లేక మంజూరైన వాటికి బిల్లులు రాక ఎక్కడి పనులు అక్కడే మూలుగుతూ ఉన్నాయి. రెండేళ్లుగా ఆడిటింగ్ లేకపోవడంతో ఐటీడీఏ అధికారులకి ఆడిందే ఆట పాడిందే పాట అన్నచందంగా మారింది. అవినీతి వెలుగు చూసే అవకాశం లేకుండా పోయింది.

రెండేళ్లుగా స‌మావేశం లేదు..

ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో 13 ఏజెన్సీ మండలాలు ఉన్నాయి. అందులో 274 గ్రామ పంచాయితీలు, 559 రెవెన్యూ గిరిజన గ్రామాలు ఉండగా 3.15 లక్షల మంది గిరిజన జనాభా ఉంది. కొత్తగా ములుగు జిల్లా ఏర్పాటు అయిన తర్వాత ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం, వాజేడు ఈ జిల్లాలో కలిసినప్పటికి ఈ రెండు మండలాల్లోని గిరిజనులకి భద్రాచలం ఐటీడీఏ నుండి ఫలాలు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఐటీడీఏ పరిధిలోని పథ‌కాలు, పరిపాలన, నూతన పనులకు బడ్జెట్ అంశాలపై ప్రతి మూడు నెలలకి ఓసారి పాలక మండలి సమావేశం నిర్వహించాల్సి ఉంది. 2017 జూన్ 8 న 59 వ పాలక మండలి సమావేశం నిర్వహించారు. 2019 డిసెంబర్ 20 వ తేదీన 60 వ పాలక మండలి సమావేశం నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలక మండలి సమావేశం ఊసే ఎత్తడం లేదు. 2020 నుండి కరోనా మహంమ్మారి రావడంతో ఇదే కారణంతో కాలయాపన చేస్తున్నారు. సమగ్రంగా ఏ ప‌థ‌కంపై కూడా చర్చలు జరగకపోవడంతో గిరిజన సంక్షేమ శాఖ నుండి పెద్ద మొత్తంలో నిధులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఐటీడీఏ కి రెగ్యులర్ పీవో లేకపోవడంతో కలెక్టర్ కృష్ణ ఆదిత్యకి ఇంచార్జి పీవో బాధ్యతలు అప్పగించారు.

నిధులకు గిరిజనుల ఎదురు చూపు..

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఇంజనీరింగ్ పనులు ఎక్కడికక్కడే పెండింగులో మూలుగుతున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వద్దకు సమస్యలు తీసుకెళ్లినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. దీంతో పనుల్ని చేసెందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదు. స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్ శాఖలో జేఈఈ స్థాయి ఉద్యోగులు కూడా సరిపడేంత లేక జరిగే పనుల పర్యవేక్షణ కరువైంది. ఇంజనీరింగ్ శాఖ పరిధిలోని పనులు నత్తనడకన సాగుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు.

మూలన పడిన సేవలు..

మత్స్య శాఖ పరిధిలో చేప పిల్లల పెంపకం వంటివి మూలకి పడడంతో చేప పిల్లల ఉత్పత్తి కోసం నిర్మించిన తొట్లు ఖాళీగా శిథిలావస్థకు చేరి దర్శనమిస్తున్నాయి. ఉద్యానవన కేంద్రాలు, నర్సరీలలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ఏటూరునాగారం హెచ్ఎన్టీసీలు కేవలం పిచ్చి మొక్కలతో అద్వాన్నంగా అదే విధంగా అసాంఘిక కార్యకలాపాలకి మందు బాబుల స్థావరాలుగా మారాయి. మైనర్ ఇరిగేషన్ శాఖ జనగామ‌కి తరలించడంతో గిరిజన రైతులకు నీటి వసతులు కల్పించే అవకాశం లేకుండా పోయింది. పశు సంవర్థక‌ శాఖ ద్వారా గొర్రెలు, మేకలు గిరిజనులకి సబ్సిడీపై అందించేది. ఆ శాఖ అధికారులు ఎవ్వరు లేకపోవడంతో పూర్తిగా ఆ శాఖ మరుగున పడిపోయింది. పట్టు పరిశ్రమ విభాగంలో అధికారులు లేకపోవడంతో ఆ విభాగం సైతం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఆ శాఖలో ఉన్న అధికారులు వేరే ప్రాంతానికి బదిలీ కావడంతో పట్టుపరిశ్రమలోని పురుగుల పెంపకం, మల్బరీ తోటల పెంపకం చిన్నాభిన్నమై పోయింది.

కనుమరుగైన ఆడిట్..

గిరిజన సంక్షేమ శాఖలో అమలవుతున్న పథ‌కాల ద్వారా ఖర్చవుతున్న లెక్కల్ని పరీశీలించేందుకు ఆడిట్ జనరల్ హైదరాబాద్ వచ్చి ఆడిట్ జరపాల్సి ఉంది. కానీ, ఆడిట్ అధికారులు ఎవ్వరు రాకపోవడంతో ఐటీడీఏ అధికారులు రికార్డులని తయారు చేసి ప్రయివేటు చార్టర్ అకౌంటెంట్ ద్వారా లెక్కలు చేయించుకుని హైదరాబాద్ వారికి అప్పగిస్తున్నారు. దీంతో ఐటీడీఏ లో జరిగే అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది అని గిరిజనులు వాపోతున్నారు.

Advertisement

Next Story