అతడితో మొదటి భార్యకు ఎఫైర్.. ఇంకా కొనసాగుతుందని హత్య చేసిన భర్త!

by Vinod kumar |   ( Updated:2022-03-09 15:32:52.0  )
అతడితో మొదటి భార్యకు ఎఫైర్.. ఇంకా కొనసాగుతుందని హత్య చేసిన భర్త!
X

దిశ, వికారాబాద్: ప్రేమ వ్యవహారంతో ఏర్పడ్డ పాతకక్షల కారణంగా జరిగిన ఓ వ్యక్తి హత్య వికారాబాద్ జిల్లా కేంద్రంలో చర్చనీయాంశం అయ్యింది. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రం సమీపంలో నారాయణపూర్ గ్రామం మైసమ్మ గుడి దగ్గర జరిగిన ఈ హత్యతో నవాబ్ పెట్ మండలం మ‌మ్మదాన్‌ ప‌ల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరం నెలకొంది. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన మృతుడి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటిపై దాడి చేయడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేసి తగలబెట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే మ‌మ్మదాన్‌ ప‌ల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, పెంటమ్మలకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరికి 10 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అదే గ్రామానికి చెందిన జుంజురు బాలయ్య, బాలమ్మల కుమారుడు శివ కుమార్ కు నాలుగేళ్ల కిందట వెంకటయ్య, వెంకటమ్మల పెద్ద కూతురు పూర్ణమ్మ కిచ్చి వివాహం చేశారు. కొన్ని కారణాలవల్ల గత రెండేళ్ల క్రితం భార్య పూర్ణమ్మ చెల్లెలు భాగ్యమ్మ ను కూడా శివ కుమార్ రెండో పెళ్లి చేసుకున్నాడు.


ఇదిలా ఉంటే అదే గ్రామానికి చెందిన మృతుడు జనార్దన్ తో నరేష్ మొదటి భార్య పూర్ణమ్మకు పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారం ఉందని, అది ఇంకా కొనసాగుతుందని అనుమానంతో జనార్దన్, శివ కుమార్ ల మధ్య అనేకసార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. ఇట్టి విషయమై పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయినా జనార్దన్ వ్యవహారంలో మార్పు రాకపోవడంతో శివ కుమార్ పథకం ప్రకారం.. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రం సమీపంలో నారాయణపూర్ గ్రామం మైసమ్మ గుడి దగ్గర తనకు సన్నిహితంగా ఉండే మరో ఇద్దరితో కలిసి, ఉద్యోగ విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న జనార్దన్ పై దాడి చేసి హత్యా యత్నం చేశాడు.

అనంతరం జనార్దన్ ను కాపాడడంలో భాగంగా హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మన్నెగూడ సమీపానికి చేరగానే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జనార్దన్ కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సహాయంతో నిందితుడు శివ కుమార్ ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఇంటి సమీపంలో ఉన్న రెండు ట్రాక్టర్లు, ఒక జెసిబి, హార్వెస్టర్, ఇతర వాహనాలకు నిప్పంటించి ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా నిందితుడి కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే ఇంటికి నిప్పంటించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా పోలీస్ బృందం వారిని అడ్డుకుని, గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. దీంతో బుధవారం ఉదయం గ్రామంలో పరిస్థితి అదుపులోకి వచ్చాయి.


అనంతరం గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి.. బాధితుల ఇంటికి వెళ్లి హత్యకు గల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అయన గ్రామస్థులతో మాట్లాడడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలి కానీ ఇలా చట్టాన్ని చేతులకి తీసుకొని వాహనాలను ధ్వంసం చేయడం నేరం అని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారిపై కూడా కేసులు నమోదు అవుతాయని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. జనార్దన్ హత్యపై వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. నేరస్తుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, కేసు విచారణ కూడా చేపట్టడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

జనార్ధన్ మృతదేహాన్ని శవపరీక్ష అనంతరం అంత్యక్రియలు తరలించడం జరిగింది. అంత్యక్రియల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య పూర్తి చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం‌ఏ.రషీద్, పరిగి డి‌ఎస్‌పి శ్రీనివాస్, మోమిన్ పేట్ సి‌ఐ వెంకటేశం, వికారాబాద్ టౌన్ సిఐ రాజశేకర్, నవాబ్ పేట్ ఎస్‌ఐ భారత్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Advertisement

Next Story