హ్యుమానిటీ ఫుడ్‌స్టాల్.. తోచినంత చెల్లించవచ్చు!

by Mahesh |
హ్యుమానిటీ ఫుడ్‌స్టాల్.. తోచినంత చెల్లించవచ్చు!
X

దిశ, ఫీచర్స్: తమిళనాడు, తెంకోడిపాక్కంకు చెందిన 25 ఏళ్ల యువకుడు శేఖర్ పూవరసన్ స్నేహితుల సహకారంతో ఓ రోడ్‌సైడ్ ఫుడ్‌స్టాల్ ప్రారంభించాడు. 'హ్యుమానిటీ' పేరున ఏర్పాటు చేసిన ఈ స్టాల్‌లో భోజనంచేసే కస్టమర్స్‌కు తోచినంత చెల్లించే అవకాశం కల్పించి ఎంతో మంది ఆకలి తీరుస్తున్నాడు.

పాండమిక్ టైమ్‌లో ఒక్కపూట భోజనానికి అల్లాడిన అభాగ్యులను చూసి చలించిన శేఖర్ మూడు నెలల కిందట 'హ్యుమానిటీ(మనిధాన్యం)' ఫుడ్‌స్టాల్ ప్రారంభించాడు. ఈ మేరకు విద్యార్థులు, కూలీలకు కడుపునిండా భోజనం పెడుతున్నాడు. ఈ ఫుడ్ స్టాల్‌‌కు వచ్చిన కస్టమర్స్ తమకు తోచినంత చెల్లించవచ్చు. ఒకవేళ తమ దగ్గర డబ్బు లేకపోతే ఉచితంగానే తినవచ్చు. స్టాల్ వద్ద ఉన్న క్యాష్‌బాక్స్ దగ్గర 'మానవత్వానికి సేవ చేద్దాం. మీరు చేయగలిగినంత చెల్లించండి' అనే బోర్డు కనిపిస్తుంది. అంతేకాదు రెస్టారెంట్లు, కళ్యాణ మండపంలో భోజనం మిగిలిపోతే తనను సంప్రదించాలని కోరుతూ ఓ పోస్టర్ కూడా ఏర్పాటు చేశాడు.

ECE విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన శేఖర్ మహమ్మారి కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పుడే నిరుపేదలకు ఆహారం అందించడం ద్వారా పూర్తి సమయం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. కాగా తమిళ చిత్రం 'కూటతిల్ ఒరుతన్(2017)' నుంచి ప్రేరణ పొందే ఈ హోటల్ కాన్సెప్ట్ అమలు చేశానని శేఖర్ చెప్పాడు.

హోటల్ పెట్టేందుకు రుణం లభించకపోవడంతో సేవింగ్స్ నుంచే రూ.48,000లు పెట్టుబడిగా పెట్టాను. మా స్టాల్‌లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. తెల్లవారుజామున 4 గంటలకే హోటల్ తెరుచుకుంటుంది. మొదట్లో, ఎవరూ మద్దతివ్వలేదు కానీ ప్రస్తుతం కొంతమంది కూరగాయలు, బియ్యం ఇస్తూ సాయపడుతున్నారు. రోజుకు రూ. 1000 సంపాదించడం కంటే ఆకలితో ఉన్న 10 మంది కడుపు నింపడానికి మించిన ఆనందం ఇంకేం ఉంటుంది' అని శేఖర్ పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed