తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం: మహమ్మద్ అలీ

by Web Desk |
తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం: మహమ్మద్ అలీ
X

దిశ, కంటోన్మెంట్: కంటోన్మెంట్ నియోజకవర్గం, మారేడ్ పల్లి లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో టీఎస్ఎం ఐడీసీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తం దానం చేసిన దాతలు, వైద్యులు, సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు. సీఎం కేసీఆర్ పై ఏర్రోళ్ల శ్రీనివాస్ రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి అలీ ఆవిష్కరించారు.




అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ యువ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసిన ఏర్రోళ్ల శ్రీనివాస్ ఉద్యమంలో కీలక భూమిక పోషించినట్లు తెలిపారు. పోరాడి సాధించిన తెలంగాణను అన్ని విధాలుగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారని, రెండో రోజు రక్తదాన శిబిరాలు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరాల ద్వారా సేకరించిన రక్తం ఎంతో మంది తలసేమియా బాధితులను, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, టీఎస్ఎం ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ కురుమ హేమలత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story