మొబైల్ వీడి 'జీవితాన్ని పొందండి' ఫస్ట్ సెల్యూలర్ సృష్టికర్త..

by Manoj |
మొబైల్ వీడి జీవితాన్ని పొందండి ఫస్ట్ సెల్యూలర్ సృష్టికర్త..
X

దిశ, ఫీచర్స్ : 'సెల్‌ఫోన్'.. ఇది లేకుంటే ప్రపంచమే లేదన్నట్లుగా భావించేవాళ్లకు లెక్కేలేదు. మనుషులు మధ్య కమ్యూనికేషన్ కోసం తెరపైకి వచ్చిన మొబైల్ ‌ఫోన్.. నిజానికి కమ్యూనికేషన్ తగ్గిపోయేందుకు కారణమైంది. కాగా ఈ డివైజ్ వల్ల ఏర్పడుతున్న నష్టాన్ని గురించి స్వయంగా మొబైల్ సృష్టికర్తనే ఆవేదన చెందాడు. అంతేకాదు స్క్రోలింగ్‌లో ఎక్కువ సమయం గడుపుతున్న వారికి కొన్ని సలహాలు, సూచనలు సిఫార్సు చేశాడు.

ప్రపంచంలోని మొట్టమొదటి మొబైల్ ఫోన్‌ను కనుగొన్న అమెరికన్ ఇంజనీర్ 'మార్టిన్ కూపర్'. ఆయన రోజుకు ఐదు గంటలకు పైగా సమయాన్ని ఫోన్‌‌లోనే వెచ్చిస్తున్న యాజర్లకు 'జీవితాన్ని పొందండి(గెట్ ఏ లైఫ్)' అంటూ సలహా ఇచ్చాడు. సెల్‌ఫోన్ సర్వస్వం అవుతున్న ప్రస్తుత కాలంలో ప్రాధాన్యతలను పునరాలోచించమని చెబుతున్నాడు. ప్రజలు తమ మొబైల్స్‌లో తక్కువ సమయం గడపాలని, గాడ్జెట్స్ పక్కన పెట్టి అసలైన జీవితాన్ని ఆస్వాదించాలని చెప్పిన కూపర్.. తన రోజువారీ జీవితంలో మొబైల్‌ను కేవలం 5 శాతం కంటే తక్కువగా ఉపయోగిస్తానని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. యాప్ మానిటరింగ్ సంస్థ 'యాప్ అన్నీ'(App Annie) ప్రకారం ప్రజలు రోజుకు సగటున 4.8 గంటలు ఫోన్లతోనే గడుపుతున్నారు. ఈ సంఖ్య వారానికి 33.6 గంటలు కాగా నెలకు 144 గంటలుగా ఉంటోంది.

ఫస్ట్ సెల్యులార్ డివైజ్ :

మార్టిన్ 1973లో Motorola DynaTAC 8000Xని కనిపెట్టాడు. ఇది మొట్టమొదటి వైర్‌లెస్ సెల్యులార్ పరికరం. మోటరోలాలో పనిచేస్తున్నప్పుడు మొదటి హ్యాండ్‌హెల్డ్ పోలీస్ రేడియో సిస్టమ్స్‌ సహా అనేక ఉత్పత్తులు ఆవిష్కరించేందుకు అతడు సాయం చేశాడు. చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ (1950) పూర్తి చేసిన తర్వాత యూఎస్ నేవీలో పనిచేసిన కూపర్.. కొరియాతో జరిగిన యుద్ధ సమయంలో టెలిటైప్ కార్పొరేషన్‌లో చేరాడు. ఆ తర్వాత 1954 నుంచి మోటరోలాలో పని చేయడం ప్రారంభించాడు.

Advertisement

Next Story

Most Viewed