‘సుప్రీం’ తీర్పు నేపథ్యంలో సస్పెన్స్.. ఆ భూముల విలువ రూ.10 వేల కోట్ల పైమాటే

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-27 03:15:03.0  )
‘సుప్రీం’ తీర్పు నేపథ్యంలో సస్పెన్స్.. ఆ భూముల విలువ రూ.10 వేల కోట్ల పైమాటే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, న్యాయమూర్తులు, జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా భావించి ఇండ్ల స్థలాల కోసం భూమి కేటాయించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఈ వర్గీకరణకు వీలు కల్పించిన 2005 నాటి జీవోలను రద్దు చేసింది. డబ్బులు కట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర సర్కారును ఆదేశించింది. ఈ నేపథ్యంలో గతంలో భూ కేటాయింపులు జరిగిన సొసైటీలకు చెందిన ల్యాండ్స్ నూ వెనక్కి తీసుకుంటారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ముఖ్యంగా టీఎన్జీవోస్ సొసైటీకి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లిలో కేటాయించిన భూములపై ఆసక్తి నెలకొన్నది. జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా చూడకూడదన్నప్పుడు ఉద్యోగులకూ అదే వర్తిస్తుందన్న వాదన వినిపిస్తున్నది.

కేసు ఇలా..

న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులకు ఇంటి స్థలాలను కేటాయిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి సీఎం వైఎస్ఆర్ నిర్ణయం తీసుకొని జీవో జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త చెలికాని రావు 2008లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 400 గజాలు, జర్నలిస్టులకు 300 గజాలు, ఆలిండియా సర్వీస్ అధికారులకు 500 గజాలు కేటాయించడాన్ని తప్పు పట్టారు. సుదీర్ఘ కాలం పాటు ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరిగింది. కొన్ని వర్గాలకు పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల స్థలాల కేటాయింపు అధికార దుర్వినియోగమేనని పిటిషన్ వాదించారు. జ్యుడీషియల్, బ్యూరోక్రాట్స్‌, పొలిటిషియన్స్‌ కు ఇండ్ల స్థలాలను కేటాయించడం సరికాదని చెప్పారు. దీంతో సొసైటీలకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కొద్ది నెలల క్రితం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు జర్నలిస్టులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు రద్దయినట్లయింది. దీంతో త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిసింది. అలాంటప్పుడు మిగతా సొసైటీలకు కేటాయించిన భూముల అంశం తెర మీదికి వచ్చింది.

టీఎన్జీవో సొసైటీలో అక్రమాలు

గోపన్ పల్లిలో టీఎన్జీవో ఉద్యోగులకు కేటాయించిన ఇంటి స్థలాల్లో అవకతవకలపై ఏసీబీతో విచారణ జరిపించాలంటూ గతంలోనే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్ ను కోరింది. 160 ఎకరాల భూమిని టీఎన్జీవో ఉద్యోగులకు కేటాయించిందని, అందులో 2,102 ప్లాట్లు అభివృద్ధి చేశారని, అయితే 1,938 ప్లాట్లు మాత్రమే ఉద్యోగులకు కేటాయించారని ఫిర్యాదు చేశారు. 164 ప్లాట్లు ఎవరికీ కేటాయించకుండా పెండింగులో పెట్టారని, 760 ప్లాట్లు సొసైటీలో సభ్యులు కాని వారికి కేటాయించారని ఆరోపించారు. టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ స్థలాల కేటాయింపుల్లో అప్పటి అధ్యక్షుడు స్వామిగౌడ్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఆ అక్రమాలు నిజమేనని అప్పటి సహకార శాఖ అధికారి ధ్రువీకరించారు. ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించారు. ఉద్యోగులకు కేటాయించిన ప్లాట్లల్లో అనేక అవకతవకలు జరిగాయని రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో అంతు చిక్కలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుననుసరించి ఈ భూములపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

ఏపీఎన్జీవోస్ ల్యాండ్స్ పై నేటికీ కేసు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లిలో సర్వే నం.36, 37 లో 189.11 ఎకరాలను 2008 ఆగస్టులో మెమో నం.46112/అసైన్మెంట్ 6/2005 ద్వారా కేటాయించారు. 2010 నవంబరు 10న జీవో నం.1357 ద్వారా కంచె గచ్చిబౌలిలో సర్వే నం.25లో 39 ఎకరాలను ఏపీ హైకోర్టు ఎంప్లాయీస్ మ్యుచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కు అలాట్ చేశారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీ ఉద్యోగులకు ఇక్కడ కేటాయింపులు ఎందుకన్న ఉద్దేశ్యంతో భూమిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే వారంతా న్యాయస్థానాలను ఆశ్రయించడంతో.. ప్రస్తుతం కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఆ స్థలమంతా ఖాళీగా ఉన్నది.

‘సెక్రెటేరియట్ సొసైటీ’లోనూ అవకతవకలు

ఉమ్మడి ఏపీలో సచివాలయంలో 11 గుర్తింపు పొందిన సంఘాల సభ్యులు హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంటి స్థలాలకు ప్రభుత్వ భూమి కేటాయించాలంటూ 2002లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాంతో వివిధ ప్రాంతాల్లో భూమిని కేటాయించారు. గోపన్‌పల్లిలో 477 ఎకరాలు, గచ్చిబౌలిలో 38 ఎకరాలు, నెక్నాంపూర్ లో 59 ఎకరాలు, జవహర్‌నగర్‌లో 100 ఎకరాల భూమిని అలాట్ చేశారు. ఈ వ్యవహారంలో సొసైటీ అధ్యక్షుడు, ఇతర డైరెక్టర్లు మొదటి నుంచి అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. పలువురి ఫిర్యాదుల మేరకు విజిలెన్స్‌ విచారణ జరిగింది. అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి విజిలెన్స్‌ విభాగం 2010 జూలై 29న నివేదిక అందజేసింది. ప్లాట్ల కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు విజిలెన్స్‌ నిగ్గు తేల్చింది. దీనిపై విజిలెన్స్‌ విభాగం పలు సిఫార్సులతో కూడిన నివేదిక ప్రభుత్వానికి అందజేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుడ్ గవర్నెన్స్ చాలా రోజుల క్రితమే పేర్కొన్నది.

ఇప్పుడేం చేస్తారు?

రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ ఉద్యోగులకు కేటాయించిన ల్యాండ్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. దాంతో ఆ ల్యాండ్ పైనా మరికొందరి దృష్టి పడింది. ఆ స్థలాన్ని కూడా ఉద్యోగులకే కేటాయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలను ఒప్పించారు. అయితే అలాట్ చేయకుండా కాలయాపన చేశారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన నేపధ్యంలో కొత్త భూ కేటాయింపులు చేసే అవకాశాలు సన్నగిల్లాయి. అయితే ఉద్యోగులకు ప్లాట్లు ఇప్పిస్తామంటూ కొందరు నాయకులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సొసైటీలకు స్థలాలు కేటాయించే వీల్లేనప్పుడు వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇస్తారా? లేదా? అన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో మొదలైంది. అత్యంత ఖరీదైన ఈ ల్యాండ్ ను ఉద్యోగులకే కేటాయిస్తారా? లేదంటే ప్రభుత్వం ప్రజాప్రయోజనాల కోసం వినియోగిస్తుందా? అంటూ చర్చ నడుస్తున్నది.




Advertisement

Next Story

Most Viewed