గెల్లు శ్రీనుకు ఊహించని షాక్.. హుజురాబాద్ గులాబీ పగ్గాలు అతనికే?

by GSrikanth |
గెల్లు శ్రీనుకు ఊహించని షాక్.. హుజురాబాద్ గులాబీ పగ్గాలు అతనికే?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకం విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. గత మూడు రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న సమీకరణాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ముఖ్య నాయకులు నియోజకవర్గానికి ఓ బాధ్యున్ని అప్పచెప్పాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఐదు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి ఇన్‌‌చార్జి ఎవరో ప్రకటిస్తామని మంత్రి హరీష్ రావు కూడా వెల్లడించారు. దీంతో నియోజకవర్గ ఇన్‌‌చార్జి నియామకం విషయంలో అన్ని కోణాలను పరిశీలించినట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు దూకుడుగా వ్యవహరించే నాయకుడు అయితేనే బెటర్ అని భావిస్తున్నట్టు తెలిసింది. ఉప ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే ధీటైన లీడర్ అవసరమని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్సీ అయిన పాడి కౌశిక్ రెడ్డికే సెగ్మెంట్ ఇన్‌‌చార్జి బాధ్యతలు ఇస్తే బావుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయ ఢంకా మోగించే విధంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన బాధ్యతను కూడా కౌశిక్ పైసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

వీణవంక ఎక్స్‌ప్రెస్

దేశవాళీ క్రికెట్‌లో ప్రాతినిథ్యం వహించిన ఫాస్ట్ బౌలర్ పాడి కౌశిక్ రెడ్డిని వీణవంక ఎక్స్ ప్రెస్‌గా పిలుస్తుంటారు. అదే స్పీడ్‌ను హుజురాబాద్ రాజకీయాల్లోనూ చూపిస్తాడని అధిష్టానం భావిస్తోంది. సూపర్ ఫాస్ట్‌గా ఉంటూ ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతాడని అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని ముఖ్య నాయకులంతా కూడా కౌశిక్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అధినేత కేసీఆర్ ఓకే చెప్పేస్తే కౌశిక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed