సెలెక్టర్లు అశుతోష్‌కు బ్యాటింగ్ రాదన్నారు.. సంచలన విషయాలు వెల్లడించిన రైల్వేస్ హెడ్ కోచ్

by Harish |
సెలెక్టర్లు అశుతోష్‌కు బ్యాటింగ్ రాదన్నారు.. సంచలన విషయాలు వెల్లడించిన రైల్వేస్ హెడ్ కోచ్
X

దిశ, స్పోర్ట్స్ : అశుతోష్ శర్మ.. క్రికెట్ వర్గాల్లో ఈ ఢిల్లీ క్యాపిటల్స్ హిట్టర్ గురించే చర్చ. లక్నోతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఢిల్లీకి విజయం కట్టబెట్టిన అతని పోరాట పటిమపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశవాళీలో అశుతోష్ రైల్వేస్‌కు ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీకి అశుతోష్‌‌ను ఎంపిక చేయడానికి సెలెక్టర్లు నిరాకరించట. అతనికి ఎలా బ్యాటింగ్ చేయాలో తెలియదంటూ పక్కనపెట్టారట.

తాజాగా ఓ జాతీయ మీడియాతో అశుతోష్‌ గురించి రైల్వేస్ హెడ్ కోచ్ నిఖిల్ డోరు ‌ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘రంజీ ట్రోఫీకి రైల్వేస్ జట్టుకు అతన్ని ఎంపిక చేయడానికి సెలెక్టర్లు పూర్తిగా ఇష్టపడలేదు. అశుతోష్‌ కేవలం బిగ్ షాట్స్ మాత్రమే ఆతాడని, అతనికి ఎలా బ్యాటింగ్ చేయాలో తెలియదన్నారు. అతను గేమ్ చేంజర్‌గా ఎదగలడని భావించా. జట్టులోకి తీసుకోవాలని ఒత్తిడి చేశా. మొదటి మూడు, నాలుగు మ్యాచ్‌లకు అతన్ని జట్టులోకి తీసుకోలేదు. చివరకు గుజరాత్‌తో మ్యాచ్‌కు ఎంపిక చేశారు. ఆ మ్యాచ్‌లో ఆడకపోతే కచ్చితంగా తెలిగిస్తారని తెలుసు. అయితే, ఆ మ్యాచ్‌లో రైల్వేస్ తడబడింది. 145 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. అప్పుడు అశుతోష్‌ను పంపించా. మా బ్యాటింగ్ ఇప్పుడే ప్రారంభమైందని గుజరాత్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు చెప్పా. అప్పుడు అతను ఏం చెబుతున్నావు? అని నవ్వాడు. బౌలర్లకు సహకరించే ఆ పిచ్‌పై అశుతోష్ చెలరేగాడు. 84 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 123 పరుగులు చేశాడు. 200 లోపు ఆలౌటవుందనుకున్న జట్టును 313 పరుగులు చేసేలా సహాయపడ్డాడు. అతని ఇన్నింగ్స్‌తో మా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ మ్యాచ్‌లో మేము 184 పరుగుల తేడాతో విజయం సాధించాం. ఏ బ్యాటరైనా వికెట్లు పడుతుంటే ఆచితూచి ఆడతారు. కానీ, అశుతోష్ సరదాగా సిక్స్‌లు కొడతాడు. అతను విజువలైజేషన్‌ను బాగా నమ్ముతాడు. దానిని సాధించడానికి చూస్తాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ ఐపీఎల్ టైటిల్ గెలవడాన్ని తాను ఊహించుకున్నాని అశుతోష్ నాతో చెప్పాడు. ’ అని నిఖిల్ చెప్పుకొచ్చాడు.

Next Story