Shopping : షాపింగ్ చేయకుండా ఉండలేకపోతున్నారా? అదో వ్యసనం కావచ్చు!

by Javid Pasha |
Shopping : షాపింగ్ చేయకుండా ఉండలేకపోతున్నారా? అదో వ్యసనం కావచ్చు!
X

దిశ, ఫీచర్స్ : షాపింగ్ చేయడం కొన్నిసార్లు అవసరం. మరికొన్నిసార్లు సరదా.. ఇంకొన్నిసార్లు హాబీ.. ఇంతవరకైతే పర్లేదు. కానీ.. అసలు కనీసం రెండు మూడు రోజులు కూడా షాపింగ్ చేయకుండా ప్రశాంతంగా ఉండలేకపోతే.. అవసరం ఉన్నా.. లేకున్నా ఏదో ఒకటి కొనేదాక మనసు కుదుట పడకపోతే.. అనుమానించాల్సిందే. ఎందుకంటే అదో వ్యసనం కావచ్చు అంటున్నారు నిపుణులు. దీనినే కంపల్సివ్ షాపింగ్ డిజార్డర్ (compulsive shopping disorder) అంటారు. వస్తువులు కొనాలనే అతి వ్యామోహం వల్ల, ఆర్థికలోటు లేని కుటుంబ పరిస్థితులవల్ల, పలు ఇతర కారణాలవల్ల కూడా ఇది డెవలప్ అవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ రుగ్మత లక్షణాలేమిటి? ఎలా బయటపడవచ్చో ఇప్పుడు చూద్దాం!

లక్షణాలు

*షాపింగ్ చేయకుండా ఉండలేకపోవడం, ముఖ్యంగా ఏదో ఒకటి కొనడంవల్ల తాత్కాలిక ఆనందం పొందడం, ఉత్సాహంగా ఉండటం వంటివి కంపల్సివ్ షాపింగ్ డిజార్డర్ లక్షణాల్లో ఒకటి. ఈ పరిస్థితి మెదడులో డోపమైన విడుదలకు దారితీస్తుంది. కాబట్టి మళ్లీ మళ్లీ షాపింగ్ చేయాలనే ఉత్సుకత ప్రదర్శిస్తారు.

*షాపింగ్ చేయాలనే కోరికతో నియంత్రణ కోల్పోవడం, డబ్బు అధికంగా ఖర్చు పెట్టడం. అవసరం లేకున్నా, ఆర్థికంగా భరించలేనప్పటికీ చివరికి అప్పు చేసి అయినా సరే కొనుగోలు చేయాలని భావించడం వ్యసనం లేదా రుగ్మతగా భావించవచ్చు. ఇది ఎక్కువైతే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఒత్తిడికి గురవుతారు. అయితే షాపింగ్ చేయాలనే సాధారణంగా కోరిక మాత్రం వ్యసనం కాదు. తీవ్రమైన లేదా నియంత్రణ లేకపోవడం అనేదే వ్యసనంగా భావించాలంటున్నారు నిపుణులు. కొందరు షాపింగ్ చేయరు కానీ.. షాపింగ్ మాల్‌కు వెళ్తారు. ఏం కొనరు. ఎప్పుడైనా అవసరం అయితే కొనడానికి ఈజీ అవుతుందని అలా టైమ్ పాస్‌కి వెళ్లొస్తుంటారు. ఏమేం ఆఫర్స్ ఉన్నాయో, ఎలాంటి వస్తువులు ఉన్నాయో చూసి తిరిగి వస్తారు. దీనిని విండో షాపింగ్ అంటారు. ఇది కూడా వ్యసనం కాదు.

*ప్రతిరోజూ ఏదో ఒక ప్రత్యేకమైన వస్తువు కొనకపోతే ఒత్తిడి, ఆందోళన పెరగడం, లోన్లీగా ఫీలవడం చేస్తుంటారు. భావోద్వేగానికి లోనవుతుంటారు. ఇతరులు షాపింగ్ చేసినట్లు తెలిసినా, చూసినా తామెందుకు చేయలేకపోయామనే ఆలోచనతో మరింత ఒత్తిడికి గురవుతారు. అలాగే కొన్నిసార్లు వస్తువులు లేదా దుస్తులు కొన్న తర్వాత కూడా అపరాధ భావానికి లోనవడం, అవి బాగోలేవని మళ్లీ షాపింగ్ చేయడం చేస్తుంటారు.

ఎలా బయటపడాలి ?

*స్వీయ నియంత్రణ ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఎవరికి వారు మనీ మేనేజ్‌మెంట్‌ను ప్రాక్టీస్ చేయాలంటున్నారు. నెలవారీ ఖర్చులకు ఒక బడ్జెట్ సెట్ చేసుకొని కచ్చితంగా పాటించాలి. క్రెడిట్, డెబిట్ కార్డులు ఎప్పుడు వెంట తీసుకెళ్లవద్దు. యూపీఐ చెల్లింపులకు లిమిట్ పెట్టుకోండి. షాపింగ్ చేయాలనిపించినప్పుడు యూపీఐ చెల్లింపులు, ఆన్‌లైన్ పేమెంట్లు చేస్తూ షాపింగ్‌లో ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. కాబట్టి ఎంత బడ్జెట్‌లో చేయాలో ముందుగానే నిర్ణయించుకొని అంత మాత్రమే చేయండి. షాపింగ్‌కి వెళ్లేటప్పుడు ఆ మేరకు నగదు తీసుకెళ్తే ఇంకా బెటర్. అలాగే షాపింగ్ చేయాలనే కోరికను ప్రేరేపించే భావోద్వేగాలు, ఒత్తిడి వంటి వాటిని గుర్తించి దూరంగా ఉండాలి.

*మీరు ఏం కొనాలనుకుంటున్నారు? అది అవసరమా? కొనకపోతే నష్టమేంటి? ఇలా మీకు మీరు ప్రశ్నించుకొని అవసరం అనుకుంటేనే షాపింగ్ చేయండి. ఇలాంటి నియంత్రణ చర్యలు, అలవాట్లు అలవర్చుకోవడం షాపింగ్ వ్యసనాన్ని పోగొడుతుంది. అట్లనే షాపింగ్ చేయాలన్న కోరికను డైవర్ట్ చేయడం ద్వారా రుగ్మత నుంచి బయటపడవచ్చు. షాపింగ్‌కు బదులు ఇతర హాబీలను అలవర్చుకోండి. ఉదాహరణకు పుస్తకాలు చదవడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేస్తూ ఉంటే మీలోని కంపల్సివ్ షాపింగ్ డిజార్డర్ కొంతకాలానికి సహజంగానే పారిపోతుంది. ఒకవేళ ఈ సమస్య నుంచి బయటపడలేకపోతే మానసిక నిపుణులను సంప్రదించి, తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story