Eatala Rajender: తెలంగాణ గడ్డ మీద ఎవరు సంతోషంగా లేరు

by Vinod kumar |   ( Updated:2022-07-18 13:53:06.0  )
Eatala Rajender Says No One is happy with TRS Government
X

దిశ, తలకొండపల్లి : Eatala Rajender Says No One is happy with TRS Government| తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గడ్డపై ఏ ఒక్క పేదవాడు సంతోషంగా లేరని హుజూర్నగర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు మహా ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుజూర్నగర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారిలు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం పింఛన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, బర్రెలను, గొర్రెలను, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నానని చెప్పి కేసీఆర్ మనని మభ్యపెడుతున్నారని ఈటెల ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏమైనా తన భూములమ్ముకుని, ఇండ్లమ్ముకొని, తన ఆస్తులు అమ్ముకొని మనకు ఇవ్వడం లేదని, కేవలం మన డబ్బులనే మన దగ్గర నుండే లాగి మనకే పెడుతున్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వైన్ షాపుల పేరుపైన 40 వేల కోట్ల రూపాయలు టెండర్ల ద్వారా మన నుంచి లాగి, మనం తినే పప్పు, ఉప్పు, సిలిండర్లు, ఆర్టీసీ చార్జీల పేరుతో మన పైనే పన్నులు వేసి, పిప్పి చేసి మన నుండే లాక్కొని మనకే పెడుతున్నాడని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళ్యాణ లక్ష్మి, పింఛన్లు, రైతుబంధు లాంటి పథకాలు ప్రవేశపెట్టి, ఆ పథకాలకు ఇచ్చే నిధులు గోరంతే అనే విషయాన్ని గుర్తించాలని ప్రజలకు ఆయన సూచించారు. హైదరాబాద్ నగరంలో బీజేపీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఆ సమావేశానికి బీజేపీ వాళ్లను కించపరిచే విధంగా 39 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఫెక్సీలు పెట్టడం ఏంటని ఎద్దేవా చేశారు. అదే డబ్బులను వృధా చేయకుండా గ్రామీణ ప్రాంతాలలోని సర్పంచులకు ఇస్తే గ్రామాలు ఎంతగానో బాగుపడతాయని గుర్తు చేశారు.


తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని పదేపదే చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు చతికిల పడిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు దాటిపోయిన, ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ.. దాటవేయడం ఇది కేసీఆర్‌కి వెన్నతో పెట్టిన విద్యని ఈటెల పేర్కొన్నారు. 57 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లు, సకాలంలో కళ్యాణ లక్ష్మి, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని, నిరుద్యోగులకు వెంటనే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్రంలో దుర్మార్గుల పాలన కొనసాగుతుందని, ఈ రాష్ట్రంలో సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు ఏ ఒక్కరికి కూడా గౌరవం లేదని, అటెండర్ నుండి కలెక్టర్ వరకు అధికారం లేదని, కేవలం ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే సకల సౌకర్యాలు ఉన్నాయని ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉందంటే కేవలం కల్వకుంట్ల కుటుంబమేనని, కేసీఆర్‌కు ఇక రోజుల దగ్గర పడ్డాయని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆచారి ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలతో, బురిడీ కొట్టించే గొప్ప నేర్పరని, అతనికి ఇంకొకరు సాటిరారని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, నాగర్ కర్నూలు పార్లమెంట్ కన్వీనర్ శ్రీనివాస్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అనిల్, మీడియా కన్వీనర్ రవి రాథోడ్, ఆమనగల్లు మాజీ జెడ్పిటిసి కండే హరి ప్రసాద్, వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వీరయ్య, తలకొండపల్లి బీజేపీ అధ్యక్షులు రవి గౌడ్, పాండు ప్రసాద్, ఎంపిటిసి హేమ రాజు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో దారుణమైన పరిస్థితి.. సరికొత్త ప్రయోగంలో కేసీఆర్ సర్కార్?

Advertisement

Next Story