'అమ్మవారి సాక్షిగా పచ్చి అబద్ధాలు.. పాదయాత్రలతో ప్రజలను మోసం చేయొద్దు'

by GSrikanth |   ( Updated:2022-04-15 14:09:37.0  )
అమ్మవారి సాక్షిగా పచ్చి అబద్ధాలు.. పాదయాత్రలతో ప్రజలను మోసం చేయొద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జోగుళాంబ అమ్మవారి సాక్షిగా అబద్ధాలు చెప్పడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మానుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు. పాదయాత్రల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దని సూచించారు. 2014 పాలమూరు ఎన్నికల ప్రచార సభలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టాలని మోడీ స్వయంగా చెప్పడం నిజం కాదా? అన్నారు. ఆ ఎత్తిపోతలను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చేపట్టిందని తెలిపారు. 'పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల'కు కేంద్ర ప్రభుత్వం పావలా కూడా ఇవ్వలేదని, కనీసం ఈ లిఫ్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని ఎప్పుడైనా తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రాన్ని అడిగారా..? అని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా మీద మీకు ఉన్న ప్రేమ ఇదేనా అని ధ్వజమెత్తారు. నడిగడ్డ, పాలమూరుకు నష్టం కలిగించే కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకివ్వలేదో సమాధానం చెప్పాలన్నారు.

ఏడేళ్లుగా కృష్ణానదిలో నీటి వాటాలు తేల్చకపోవడమే వారి గొప్పతనమనుకుంటున్నారని, కృష్ణానది వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు పేరుతో కేంద్రం కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. యాసంగిలో పండే ప్రతి గింజా కొనిపించే బాధ్యత తనదేనని కిషన్​రెడ్డి చెప్పింది నిజం కాదా ? అన్నారు. అప్పుడ అలా చెప్పి.. ఇప్పుడు రా రైస్, బాయిల్డ్ రైస్ అంటూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే.. అది కూడా తమ ఘనతేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జోగులాంబ ఆలయం పురావస్తుశాఖ పరిధిలో ఉన్నందున.. ప్రభుత్వం ఏ పని చేపట్టలేకపోతుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ యాదాద్రిని పునర్‌నిర్మించినట్లుగా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జోగులాంబ ఆలయాభివృద్ధి చేస్తారా..? అని సవాల్‌ విసిరారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పాదయాత్ర చేయాలని, ప్రజలను మభ్యపెట్టి, అబద్ధాలతో కాలం వెళ్లదీసే తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.

Advertisement

Next Story