ఆ తెగలో మరణానంతరం తీసుకెళ్లే ఏకైక ఆభరణం పచ్చబొట్టు!

by Manoj |
ఆ తెగలో మరణానంతరం తీసుకెళ్లే ఏకైక ఆభరణం పచ్చబొట్టు!
X

దిశ, ఫీచర్స్ : కొన్నేళ్ల నుంచి 'టాటూ' కల్చర్ యువతలో బాగా పాపులర్ అయింది. ఇన్నేళ్లు గడుస్తున్నా ఆ ట్రెండ్ తగ్గకపోగా మరింత విస్తృతంగా వ్యాపిస్తూ సంపన్నుల నుంచి లోమిడిల్ క్లాస్ వరకు చేరుకుంది. పేర్లు, దేవుని బొమ్మలు, ఆయుధాలు, విభిన్న ఆకృతులతో యువత దేహాన్ని ఆక్రమిస్తున్నాయి. నిజానికి ఒకప్పటి పచ్చబొట్టుకు మరో రూపాంతరమే 'టాటూ' కాగా చాలావరకు ఆ గురుతులు ఒక తరం వరకే ఆగిపోయాయి. కానీ ఇప్పటికీ ఓ గిరిజన తెగలో పచ్చబొట్టు ఆచారంగా కొనసాగుతుండగా..

ఛత్తీస్‌గఢ్‌లో‌ని ఒక చిన్న గ్రామంలో గోడ్నా కళను అభ్యసిస్తున్న ఆ తెగ మహిళల గురించి తెలుసుకుందాం..

పచ్చబొట్టు వేయడం అనేది సాధారణంగా భారతదేశ పురాతన సంప్రదాయం. ముఖ్యంగా గిరిజన సమాజాల్లో ఇప్పటికీ ఈ ఆచారం ఇంకా కొనసాగుతోంది. ఈ మేరకు మధ్య భారతదేశంలోని ఆదిమ జాతికి చెందిన బైగా తెగ విషయానికి వస్తే.. ఆ తెగలో 'గోడ్నా' అనేది తరతరాలుగా వస్తున్న ఒక శతాబ్దపు ఆచారం. ఉత్తర, మధ్య భారతదేశంలోని గిరిజన సమూహాలు ఈ కళ అంతరించిపోకుండా ముందుకు తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగా శరీరమంతటా విస్తృతమైన నమూనాలను పచ్చబొట్టు వేసేందుకు గోడ్నా కళాకారులు హ్యాండ్ పోక్ టెక్నిక్‌ని ఉపయోగిస్తారు. సాధారణంగా బైగా తెగలో గోడ్నాను ప్రధానంగా స్త్రీలు అభ్యసిస్తారు. ఆయా గుర్తులు స్త్రీ జీవితంలోని వివిధ దశలను సూచిస్తాయి. పచ్చబొట్లు వారి గుర్తింపులో అంతర్భాగం కాగా బైగా తెగలో జన్మించిన ఆడపిల్ల తొమ్మిదేళ్ల వయసులో నుదిటిపై తన మొదటి పచ్చబొట్టును పొందుతుంది. ఒక అమ్మాయి యుక్తవయస్సు, వివాహం, ప్రసవం ఇలా ఒక్కో స్టేజ్‌లో వేసుకునే పచ్చబొట్లతో ఆమె శరీరం పచ్చబొట్లమయంగా మారిపోతుంది. ఈ పచ్చబొట్టు తమ జాతి సమూహం, సాంస్కృతిక ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపుగా పరిగణించబడుతుండగా.. నుదురు గోడ్నా అనేది బైగా తెగ సంప్రదాయాలకు సంకేతం. గోడ్నా లేదంటే ఆ తెగలో భాగంగా పరిగణించబడరు.

గోడ్నాను సంరక్షించడం

గోడ్నా కళాకారిణిగా చాలా కాలంగా ఎంతోమందికి పచ్చబొట్లు వేస్తున్నాను. కానీ త్వరలో అందరూ దీన్ని మరచిపోతారానేమోనని ఆందోళన ఉంది. ఆధునికీకరణ ద్వారా పురాతన ఆచారం ఎక్కువగా ప్రభావితమైంది. అందుకే ఈ కళ అంతరించి పోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నాను. కనీసం నుదిటి గోడ్నానైనా కాపాడుకోవాలని విన్నవిస్తున్నాను. ఈ పచ్చబొట్లు మా మూలానికి సంబంధించిన పురాణాలు, జానపద కథలను బహిరంగపరుస్తాయి. మహిళలే కాదు గిరిజన పురుషులు కూడా గోడ్నాను కలిగి ఉంటారు. మరణానంతరం కూడా మాతో పాటు తీసుకెళ్లగల ఏకైక ఆభరణం ఇదేనని మేం నమ్ముతాం. అమ్మాయిలకు ఇది వారి అలంకార రూపంగా పరిగణించబడుతుంది. బంగారం, వెండి కూడా గోడ్నాకు ఉన్నంత విలువను కలిగి ఉండవు.

- మంగ్లా బాయి , బైగా గిరిజన గోడ్నా కళాకారిణి

Advertisement

Next Story