మంటపెడుతున్న వంట నూనె ధర.. లీటర్ ప్యాకెట్ ఎంతో తెలుసా ?

by samatah |   ( Updated:2022-03-20 08:51:29.0  )
మంటపెడుతున్న వంట నూనె ధర.. లీటర్ ప్యాకెట్ ఎంతో తెలుసా ?
X

దిశ కాటారం : మార్కెట్లో రోజురోజుకు వంట నూనెల ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి ప్రజానీకం విలవిలలాడుతోంది. వంట నూనెల ధరలు మంటతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రష్యా- ఉక్రెయిన్ దేశాల యుద్ధం‌కు ముందు లీటరు సన్ ఫ్లవర్ ఆయిల్ ధర మార్కెట్‌లో రూ. 145 ఉండగా, ఈరోజు ధర 215ఎమ్మార్పీ ధరకు చేరుకుంది. ఏ రోజుకారోజు వంటనూనెల ధరల‌లో మార్పు వస్తుండడంతో ప్రజలు ఏం చేయాలో తోచక తికమక పడుతున్నారు. వంట నూనెలు నిత్యవసర కావడంతో చేసేదేం లేక చెప్పిన ధరకే నూనెను కొనాల్సి వస్తోందని మధ్యతరగతి ప్రజానీకం వాపోతోంది. ఉక్రెయిన్లో పొద్దుతిరుగుడు పంటను ఎక్కువగా సాగు చేస్తారు. అక్కడినుండి మంచి నూనె, పామాయిల్ ఎక్కువగా మన దేశానికి దిగుమతి అవుతోంది. యుద్ధం కారణంగా నూనెల దిగుమతి తగ్గిపోవడంతో రోజురోజుకూ ధర పెరుగుతూ వస్తోంది. సరిగ్గా నెల రోజుల కిందట లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్ రూ. 138 ఉండగా, ప్రస్తుతం రూ. 215 కు చేరింది. రూ 130 ఉన్న పామ్ ఆయిల్ ధర రూ. 160 కి చేరింది. నెల క్రితం ఐదు లీటర్ల సన్ ఫ్లవర్ క్యాన్ ధర రూ. 750 ఉండగా నేడు రూ.1050 కి చేరింది. ధరలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో ప్రజలపై మరింత భారం పడనుంది. ప్రజానీకం‌తోపాటు హోటల్స్, టిఫిన్ సెంటర్లకు, మిర్చిసెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పై పెను ప్రభావం చూపుతోంది. వీళ్లు ఎక్కువగా పామాయిల్ వాడటంతో ఇప్పుడు ఆ ఆయిల్‌కు డిమాండ్ పెరిగింది.

ఆచి తూచి దిగుమతులు..

కొందరు వ్యాపారులు నూనెలను ఆచితూచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈరోజు ఎమ్మార్పీ ధరలు మరుసటిరోజు జంప్ అవుతున్నాయి. వినియోగదారులు ఎమ్మార్పీ‌ని చూసి జరుగుతుండటంతో మునుపటిలా బ్లాక్ మార్కెట్లో విక్రయించుకునే అవకాశం వ్యాపారస్తులకు లేకుండా పోయింది. అయితే యుద్ధం సమసిపోయి మళ్లీ ఆయిల్ ధరలు తగ్గితే పెరిగిన ధరల ప్రకారం నూనెలు జనం కొనే పరిస్థితి ఉండదని అందుకే ఎక్కువ ఒకేసారి దిగుమతి చేసుకోవడం లేదని వ్యాపారస్థులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed