100వ టెస్ట్.. కోహ్లీ శ్రమకు, అంకిత భావానికి నిదర్శనం: బుమ్రా

by Disha Desk |
100వ టెస్ట్.. కోహ్లీ శ్రమకు, అంకిత భావానికి నిదర్శనం: బుమ్రా
X

న్యూఢిల్లీ : మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే టెస్టు మ్యాచ్‌తో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించనున్నాడు. తన టెస్టు కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమ్ ఇండియా పేసర్, ప్రస్తుత వైస్ కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా 100వ టెస్ట్ ఆడబోతున్న కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపాడు. 'దేశం తరఫున 100వ టెస్టు మ్యాచ్‌ ఆడటం గొప్ప సందర్భం. టీమ్ ఇండియాకు కోహ్లీ ఎంతో చేశాడు. భవిష్యత్తులోనూ దాన్ని కొనసాగిస్తాడు. 100వ టెస్టు అనేది కోహ్లీ శ్రమ, అంకిత భావానికి నిదర్శనం' అని బుమ్రా చెప్పుకొచ్చాడు. ఈ ప్రత్యేక సందర్భంలో కోహ్లీకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు బుమ్రా సమాధానమిస్తూ' టీమ్ ఇండియా గెలవడం కంటే గొప్ప బహుమతి ఏం ఉంటుంది. కానీ, కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నాడు'అని తెలిపాడు. అలాగే, తొలి టెస్టుకు ప్రేక్షకులను అనుమతించకపోవడం పై బుమ్రా స్పందించాడు. 'ప్రేక్షకులు రావడం మాకూ శక్తిని ఇస్తుంది. కానీ, అది మా చేతుల్లో లేదు. మేము నిబంధనలను నిర్ణయించలేము, కానీ, ప్రేక్షకులు లేకున్నా ఉత్తమ ప్రదర్శన చేయడంపైనే మేము దృష్టి పెట్టాం' అని బుమ్రా పేర్కొన్నాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఈ నెల 4న మొహాలీ వేదికగా శ్రీలంకతో భారత్ తలపడనున్నది.



Advertisement

Next Story

Most Viewed