ధరణి సమస్యలపై మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. కదం తొక్కిన జగ్గారెడ్డి

by Manoj |
ధరణి సమస్యలపై మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. కదం తొక్కిన జగ్గారెడ్డి
X

దిశ, ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'ధరణి' వ్యవస్థ లోపభూయిష్టంగా ఉన్నది. ధరణితో చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరణికి సంబంధించిన సమస్యలే పాదయాత్రలో తమ దృష్టికి వస్తున్నాయి. ధరణి సమస్యల పరిష్కారం కోసం రైతుల పక్షాన ఉద్యమిస్తామని రాజీవ్​గాంధీ పంచాయతీ రాజ్​సంఘటన్​ చైర్​పర్సన్​ మీనాక్షి నటరాజన్​ అన్నారు. సర్వోదయ సంకల్ప యాత్ర సోమవారం మెదక్​జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చేరుకున్నది.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తమ పాదయాత్ర ముగిసిన తరువాత తెలంగాణకు వస్తానని చెప్పారు. ఇక్కడ అమలు చేస్తున్న ధరణిపై ఉద్యమిస్తామని వెల్లడించారు. పాదయాత్ర ద్వారా ఎంతో మంది ప్రజలు, రైతులను కలుస్తున్నాం. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు. భూదానోద్యమం తెలంగాణలో ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించిందని మీనాక్షి నటరాజన్​గుర్తు చేశారు.

ఈ భూదానోద్యమంతో లక్షలాది మంది నిరుపేదలకు మేలు జరిగింది. వామపక్ష భావజాలం ఉన్న ఎంతో మందితో పాటు నక్సలైట్లు బలవంతంగా భూములను పేదలకు పంచిన సందర్భాలున్నాయి. అహింసా పద్దతుల్లో లక్షలాది ఎకరాలు పేదలకు పంచిన ఘనత మాత్రం వినోభాభావేదే అన్నారు. ఇక్కడ తెలంగాణలో ధరణితో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాదయాత్ర ముగిసిన తరువాత ఇక్కడకు వచ్చి ధరణి సమస్యలపై రైతుల పక్షాన ఉద్యమిస్తామని మీనాక్షి నటరాజన్ ​వెల్లడించారు. కాగా చేగుంటకు చేరుకున్న పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి పాల్గొన్నారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూదానోద్యమం జరిగి 75 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందన్నారు. గాంధీజీ, నెహ్రూల కాలంలో జరిగిన ఉద్యమాలు నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువత తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీజీ పిలుపు మేరకు వేల ఎకరాలు భూములను స్వచ్ఛందంగా దానం చేసి పేదలకు పంచిపెట్టడం గొప్ప విషయం అన్నారు.

వేలాది మంది మంది నిరుపేదలకు ఉపయోగపడ్డ భూదానోద్యమాన్ని గుర్తు చేస్తూ మీనాక్షి పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, మెదక్​జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్​నాయకులు శ్రావణ్​ కుమార్​ రెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed