వర్షాకాలంలో బెస్ట్ చాయ్ వెరైటీస్.. ఇవే!

by S Gopi |
వర్షాకాలంలో బెస్ట్ చాయ్ వెరైటీస్.. ఇవే!
X

దిశ, ఫీచర్స్: వర్షాకాలపు వాతావరణాన్ని చాలామంది అమితంగా ఇష్టపడతారు. ఓవైపు వర్షం కురుస్తుంటే.. పొగలు కక్కే చాయ్‌ను ఆస్వాదిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కూల్ వెదర్‌తో పాటు సీజనల్ వ్యాధులకు కూడా వర్షాకాలమే కేరాఫ్ అడ్రస్. ప్రత్యేకించి ఇన్ఫెక్షన్లకు, ప్రమాదకర వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కొన్ని రకాల ఔషధాల ద్వారా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. రుచిపరంగా ఇవి చేదుగా ఉన్నప్పటికీ ఇమ్యూనిటీని పెంచడంలో సమర్థవంతంగా పనిచేయగలవు. ఇంతకీ ఆ డ్రింక్స్‌ ఏంటో తెలుసుకుందాం.

* శొంఠి, ధనియాల టీ :

శొంఠిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మెడిసిన్‌లా పనిచేసే శొంఠి 'టీ' వర్షాకాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. పైగా వర్షాకాలంలో జీర్ణక్రియ శక్తి తక్కువగా ఉంటుంది కనుక జీర్ణ సంబంధ సమస్యలకు కూడా చెక్‌ పెడుతుంది. అంతేకాదు ఈ టీ తాగితే జలుబు, కఫం వంటి సమస్యలు దరిచేరవు. ఇందులోని యాంటీఫంగల్‌ లక్షణాలు ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడతాయి. ఎముకలు, కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

* లెమన్, తులసి టీ :

తులసి, నిమ్మరసంలోని ఔషధ గుణాల గురించి ఆయుర్వేదంలోనూ ప్రస్తావించారు. కేవలం తులసి ఆకులు నమిలినా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాగా వర్షాకాలంలో తులసి ఆకులు, నిమ్మరసంతో చేసిన టీ తాగితే.. జలుబు, ముక్కు కారటం, ఫ్లూ వంటి ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. పేరుకుపోయిన కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి. మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చినపుడు ఈ టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.

* పటిక బెల్లం టీ :

వర్షాకాలంలో వేధించే గొంతు నొప్పికి పటిక బెల్లంతో తయారు చేసిన 'టీ' దివ్య ఔషధం వంటిది. గొంతు సంబంధిత సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

* పసుపు పాలు :

ఒంట్లో నలతగా ఉంటే వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే బెటర్‌గా ఉంటుంది. పడుకునే ముందు తాగితే నిద్ర లేమి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* మిరియాల రసం :

ఘాటైన గుణాన్ని కలిగిఉండే మిరియాలను నీటిలో మరిగించి తాగితే గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

Advertisement

Next Story