ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.4 శాతం పెరిగిన ఇంధన గిరాకీ!

by Harish |
ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.4 శాతం పెరిగిన ఇంధన గిరాకీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో దేశీయంగా ఇంధన డిమాండ్ 5.4 శాతం పెరిగిందని చమురు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్(పీపీఏసీ) గణాంకాలు వెల్లడించాయి. ఇది 2021, ఆగష్టు తర్వాత అత్యధికం కావడం గమనార్హం. అయితే, ఇటీవల పెరుగుతున్న చమురు ధరల కారణంగా ప్రస్తుత నెలలో వినియోగం క్షీణించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత నెల ఇంధన వినియోగం మొత్తం 1.75 కోట్ల టన్నులుగా నమోదైందని గణాంకాలు తెలిపాయి. కరోనా మహమ్మారికి ముందు 2019 నాటితో పోలిస్తే ఈసారి గిరాకీ స్వల్పంగా 0.8 శాతం పెరిగిందని, 2020, ఫిబ్రవరి తో పోలిస్తే 3 శాతం తక్కువగానే ఉందని గణాంకాలు తెలిపాయి. సమీక్షించిన నెలలో పెట్రోల్ అమ్మకాలు గతేడాది కంటే 3.2 శాతం పెరిగి 25.5 లక్షల టన్నులుగా, వంట గ్యాస్ వినియోగం 6.1 శాతం పెరిగి 24 లక్షల టన్నులకు చేరుకున్నాయి. అయితే, సమీక్షించిన నెలలో డీజిల్ అమ్మకాలు గతేడాది కంటే 0.9 శాతం క్షీణించినప్పటికీ, నెలవారీ ప్రాతిపదికన అంటే జనవరి నెలతో పోలిస్తే 2.2 శాతం పెరిగాయని పీపీఏసీ గణాంకాలు వెల్లడించాయి.

Advertisement

Next Story