భూ సర్వే ను అడ్డుకున్న రైతులు.. తానూ మందు తాగుతానన్న ఆర్డీఓ

by Javid Pasha |   ( Updated:2023-10-10 12:03:54.0  )
భూ సర్వే ను అడ్డుకున్న రైతులు.. తానూ మందు తాగుతానన్న ఆర్డీఓ
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం మూడో టీఎంసీను నిర్మించాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన పనుల కోసం భూ సర్వే జరుగుతోంది. కానీ ఈ సర్వేకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. సర్కారు భూ సేకరణ జరిపి తీరాలని ఆదేశించగా రైతులు భూములిచ్చేందుకు ససేమిరా అంటున్నారు. సర్వే బృందాలను అడ్డుకుంటూ అధికార యంత్రాంగానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మంగళవారం బోయినపల్లి మండలం విలాసాగర్‌లో సర్వేను అడ్డుకున్న రైతులతో మాట్లాడిన ఆర్డీఓ శ్రీనివాసరావు తానూ పురుగుల మందు తాగుతానని అన్నారు.

ఏం జరిగిందంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్‌లో మూడో టీఎంసీ కాలువ నిర్మాణం కోసం అధికారులు భూసర్వే జరుపుతున్నారు. వారిని రైతులు అడ్డుకున్నారు. తమ భూముల్లో సర్వే చేస్తే పురుగుల మందు తాగుతామని రైతులు స్పష్టం చేశారు. ఈ సమాచారం అందుకున్న ఆర్డీఓ శ్రీనివాసరావు రైతులతో మంతనాలు జరిపేందుకు వచ్చారు. దీంతో ఓ రైతు తన భూమిలో సర్వే జరిపితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానన్నాడు.

దీంతో ఆర్డీవో శ్రీనివాస్ రావు తానూ పురుగుల మందు తాగుతానని తనకు మందు డబ్బా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం భూ సేకరణ జరపాలని చెప్పిందని, చెప్పిన పని చేయడం తమ బాధ్యత అని ఆర్డీఓ రైతులతో అన్నారు. రైతులు కూడా తమను చంపి భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తారా..? నీ జీతం కోసం మా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రైతులు మాత్రం తమ భూముల్లో సర్వే జరిపించేందుకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story