LIC ఐపీఓ కోసం ఇన్వెస్టర్ల జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం!

by Harish |   ( Updated:2022-04-14 10:19:52.0  )
LIC ఐపీఓ కోసం ఇన్వెస్టర్ల జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఐపీఓ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. దీనికోసం సుమారు 50-60 మంది యాంకర్ ఇన్వెస్టర్ల జాబితాను షార్ట్‌లిస్ట్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ జాబితాలో జేపీ మోర్గాన్, స్టాండర్డ్ లైఫ్, బ్లాక్ రాక్, ఫెడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్, శాండ్స్ కేపిటల్ సహా పలు సంస్థలు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో తుది జాబితాను సిద్ధం చేయనున్నట్లు సమాచారం. యాంకర్ ఇన్వెస్టర్లు అందించే ఫీడ్‌బ్యాక్‌ను బట్టే ఎల్ఐసీ ఐపీఓలో షేర్ ధరను నిర్ణయించనున్నారు. ఇప్పటికే సంస్థ విలువను రూ. 7 లక్షల కోట్లుగా నిర్ణయించినట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ విలువను బట్టి ఎల్ఐసీ ఐపీఓలో ఎక్కువమంది పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

అంతేకాకుండా ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల పరిస్థితి, అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూలత నేపథ్యంలో ప్రభుత్వ అంచనాల కంటే తక్కువగానే ఎల్ఐసీ విలువను లెక్కించినట్లు వారు చెబుతున్నారు. విలువకు సంబంధించిన అంశం కూడా త్వరలో ఖరారవుతుందని మరో అధికారి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే పెట్టుబడిదారుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. దీని ద్వారా సంస్థాగత, ఇతర ఇన్వెస్టర్లకు ఎల్ఐసీ ఐపీఓ మరింత ఆకర్షణీయంగా ఉండేలా అభిప్రాయాలను పరిశీలిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి విలువ కట్టే అంశంపై ఇన్వెస్ట్‌మెంట్ కమిట్‌మెంట్ లెటర్‌ను తీసుకున్న తర్వాత ఉన్నత స్థాయి కమిటీ నిర్ధారణకు రానుంది. ఆ తర్వాతే ఎల్ఐసీ విలువను నిర్ణయించనున్నారు.

Advertisement

Next Story