బీబీఎన్ఎల్‌ను బీఎస్ఎన్ఎల్‌లో విలీనం చేయనున్న ప్రభుత్వం!

by Vinod kumar |
బీబీఎన్ఎల్‌ను బీఎస్ఎన్ఎల్‌లో విలీనం చేయనున్న ప్రభుత్వం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్(బీబీఎన్ఎల్)ను ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)లో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆల్ ఇండియా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అండ్ టెలికాం ఆఫీసర్స్ అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ చైర్మన్, ఎండీ పీకె పుర్వార్ మాట్లాడుతూ ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ సంస్థకు అనూహ్యమైన అవకాశాన్ని ఇస్తోందన్నారు. బీబీఎన్ఎల్ విలీనం ద్వారా టెలికాం రంగంలో మరింత సమర్థవంతంగా సామర్థ్యాన్ని కలిగి ఉండేందుకు వీలవుతుంది.


ఈ నెలలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీని తర్వాత బీబీఎన్ఎల్ పూర్తిగా బీఎస్ఎన్ఎల్ బాధ్యతల పరిధిలోకి వెళ్తుందన్నారు. ఇప్పటికే దేశంలోని దిగ్గజ ప్రైవేట్ కంపెనీలు మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా అందిస్తున్నాయి. బీబీఎన్ఎల్ విలీనంతో ఈ విభాగంలో బీఎస్ఎన్ఎల్‌కు అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ 6.8 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.


ఈ విలీనంతో బీఎస్ఎన్ఎల్ దేశంలోని 1.85 లక్షల గ్రామ పంచాయితీల్లో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఉపయోగించి 5.67 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్‌ను పొందనుంది. కేంద్రం గతేడాది బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు భారత్‌నెట్ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా దేశంలోని 6 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. దీని బాధ్యతలు ఇప్పటివరకు బీబీఎన్ఎల్ సంస్థనే కొనసాగిస్తోంది. దీనికోసం దాదాపు రూ. 24 వేల కోట్లను ఖర్చు చేశారు. మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయితీల్లో ఈ ప్రాజెక్ట్ కిందకు అనుసంధానం చేశారు.

Advertisement

Next Story