స్థలం ఓ చోట.. నిర్మాణం మరోచోట.. అంతా మా ఇష్టం!

by Satheesh |
స్థలం ఓ చోట.. నిర్మాణం మరోచోట.. అంతా మా ఇష్టం!
X

దిశ, శేరిలింగంపల్లి: కిందికుంట చెరువు వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. స్థలం ఉన్నది ఓ చోట.. కట్టేది మరోచోట అని తెలిసిన దానికి ఘనతా వహించిన జీహెచ్ఎంసీ అధికారులు కళ్లు మూసుకుని అనుమతులు జారీ చేశారా అంటే అవుననే అనుకోవాల్సి వస్తోంది. మా హెడ్ ఆఫీసులో స్థల యజమానులు అప్లై చేశారు. మా పై అధికారులు అనుమతులు ఇచ్చారు మాకేమాత్రం సంబంధం లేదంటూ దాట వేస్తున్నారు కూకట్ పల్లి జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు. పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది కదా అంటే ఉన్నా మాకు తెలియదు సార్.. అక్రమంగా అంతస్థులు వేస్తున్నది నిజమే కానీ మేమేం చేయలేమంటారు టీపీఎస్ సిబ్బంది. ఇక ఇరిగేషన్ అధికారులు అయితే వాళ్ల బాధ్యతలు వాళ్లు మరిచారనే చెప్పాలి. చెరువులు, కుంటలు ఉన్నాయి అనేదే వారికే తెలియకుండా పోయింది. ఎన్ని చెరువులున్నాయి.. ఎన్ని అన్యాక్రాంతం అవుతున్నాయో కూడా అధికారుల వద్ద కనీస సమాచారం కరువయింది. ఇలా అన్ని శాఖలు చేతులెత్తేయడంతో అక్రమార్కులు చెరువు, కుంటల్లో అక్రమ అంతస్థులు కడుతున్నారు.

డాక్యుమెంట్ చూపిస్తే చాలు.. ఎక్కడైనా కట్టుకో..

జీహెచ్ఎంసీ అధికారులు నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. నిర్మాణాలు జరుపుకునేందుకు పర్మిషన్ల కోసం వస్తే కనీసం ఆస్థలం ఎక్కడుంది. దాని వివరాలేంటి.? అది చెరువులో ఉందా.. కుంటలో ఉందా అని కూడా చూడకుండా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. అందుకు కిందికుంట చెరువులో కడుతున్న నిర్మాణమే నిదర్శనం. ఈ బిల్డింగ్‌కు సంబంధించి హైదర్‌నగర్ డివిజన్ బాగ్ అమీర్ గ్రామం సర్వే నెంబర్ 100లో 432.8 గజాల స్థలం ఉన్నట్లు చెబుతూ పర్మిషన్ కోసం సికింద్రాబాద్ మారేడుపల్లి నివాసి పి. సువర్ణ మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. వారికి సదరు స్థలంలో స్టిల్ట్ ప్లస్ 4 అంతస్థుల నిర్మాణానికి అనుమతులు జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. కానీ బిల్డర్ మురళీ మాత్రం 6వ అంతస్తు కూడా వేసేశారు. ఇదంతా ఒక వైపు అయితే అసలు వారు డాక్యుమెంట్లలో చూపుతున్న స్థలం వారు చెబుతున్న ప్రకారం అంబీరు చెరువు సమీపంలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మరి అలాంటప్పుడు కిందికుంట చెరువు శిఖంలో ఎలా కడుతున్నారు అనేది ప్రధాన ప్రశ్న. అలా చూసుకున్నా స్థలం ఓ చోట ఉంటే నిర్మాణం మరోచోట కడుతున్నట్టే. ఇదంతా ఎలా జరిగింది..? జరుగుతుంది అంటే తెరవెనుక ఉండి నడిపిస్తోంది అధికార పార్టీ నాయకులే అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఇరిగేషన్ అధికారులు ఎక్కడ..?

చెరువులు అన్యాక్రాంతం అవుతున్నా ఇరిగేషన్ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అధికారుల లెక్కల ప్రకారం 66 చెరువులు ఉండగా ప్రస్తుతం అవి ఏ స్థితిలో ఉన్నాయో కూడా వారికి పట్టడం లేదు. కిందికుంట పరిస్థితి చూస్తే అదే తేటతెల్లం అవుతోంది. రికార్డుల ప్రకారం 8.17 ఎకరాలుగా ఉన్న దీని విస్తీర్ణం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కి శల్యమైంది. ల్యాటిట్యూడ్ ప్రకారం చూస్తే చాలా స్థలం పరాధీనం అయ్యిందని తెలుతోంది. వెనకవైపున ఉన్న నిర్మాణాలు కొన్ని చెరువు బఫర్ జోన్‌లోనే ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. అయినా ఇరిగేషన్ సిబ్బంది మాత్రం తీసుకున్న చర్యలు శూన్యం. చెరువు స్థలాల విషయంలో అటు రెవెన్యూ ఇటు ఇరిగేషన్ శాఖలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి.

అంతా తారుమారు..

కిందికుంట స్థలం విషయంలో చాలాకాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. డాక్యుమెంట్లు తారుమారు చేసి స్థలం మరోచోట చూపించడం వెనక అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మరో కార్పొరేటర్, ఓ దేవస్థానానికి ఛైర్మెన్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇలా అనేకమంది పెద్ద తలకాయలే ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు కూడా అదే స్థలం మాకు సర్వే నెంబర్ 100లో ఉందని డాక్యుమెంట్లు చూపుతున్న వారు కట్టేది మాత్రం సర్వే నెంబర్ 119లో కావడం వారే తప్పుల మీద తప్పులు చేస్తున్నామని, అధికారులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నామని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు స్పందించి సర్వే చేయించి, చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story