ఎంత దారుణం.. పోడు రైతుపై అటవీ అధికారుల ప్రతాపం

by Manoj |
ఎంత దారుణం.. పోడు రైతుపై అటవీ అధికారుల ప్రతాపం
X

దిశ, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పుట్టల భూపతి ఏజెన్సీలో శనివారం దారుణం చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారులు ఓ గిరిజన పోడు రైతుపై కర్రలతో దాడిచేశారు. వివరాల్లోకి వెళితే.. గంగారం మండలం పుట్టల భూపతి గ్రామం వేంపల్లి పాడు ప్రాంతంలో అటవీశాఖ అధికారులు కందకం తవ్వకాల పనులు చేపట్టారు. అదే గ్రామానికి చెందిన సోలం బాబు తనకున్న కొద్దిపాటి సాగు భూమి(ట్రెంచ్) అటవీశాఖ అధికారుల కందకం తవ్వకాలలో కోల్పోతుండటంతో పనులు అడ్డుకునేందుకు ఆ గిరిజన దంపతులు ఇద్దరు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మాకున్న సాగు భూమిని వదిలి వేయాలని అటవీ శాఖ అధికారులను ఆ దంపతులు వేడుకోగా అక్కడున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది వారి ఇద్దరిని చుట్టుముట్టి సోలం బాబుని చితకబాది ఫారెస్ట్ జీపులో ఎక్కించుకుని మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. రేంజ్ కార్యాలయం గదిలో బాధితుని బంధించి కాళ్ళపై గట్టిగా కొట్టడంతో రైతు అక్కడికి అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. దాడికి పాల్పడిన డీఆర్వోని విధుల నుండి తొలగించాలని ఆదివాసీ సంఘాల నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది జులై నెలలో ఇదే అధికారి గంగారం మండల మడగూడలో ట్రెంచ్ పేరుతో దాడులు నిర్వహిస్తుండగా రైతులు వచ్చి మా భూములను లాక్కోవద్దని ఎంత వేడుకున్నా.. వినకుండా దాడులు చేశాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న రైతులు ఈ అధికారిపై తిరగబడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన వల్లే ఆ అధికారి రైతులపై పగబట్టి దాడులకు పాల్పడుతున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed