సిబ్బంది ప్రవర్తనపై మహిళా డాక్టర్ ఫిర్యాదు.. చివరికి తానే రాజీనామా చేసి..

by Manoj |
సిబ్బంది ప్రవర్తనపై మహిళా డాక్టర్ ఫిర్యాదు.. చివరికి తానే రాజీనామా చేసి..
X

దిశ, సూర్యాపేట : ఆస్పత్రిలో కిందిస్థాయి సిబ్బంది దురుసు ప్రవర్తనపై ఓ మహిళా డాక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోకపోవడంతో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలానికి గురువారం తన రాజీనామా పత్రాన్ని అందజేసింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో వైద్యాధికారిగా పని చేస్తున్న డాక్టర్ ఉషారాణి పట్ల అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న సీవో ఉపేందర్ దురుసుగా ప్రవర్తించాడు. విధులకు సక్రమంగా రానందుకు ప్రశ్నించిన డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించిన ఉపేందర్ తీరును ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది.

తాను ఫిర్యాదు చేసే సమయంలో డీఎంహెచ్వో , డిప్యూటీ డీఎంహెచ్‌వో అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. స్పందించిన కలెక్టర్ విచారణ చేయాల్సిందిగా ఉన్నత అధికారులను ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌వో సీసీ అర్బన్ హెల్త్ సెంటర్‌కు వచ్చి కలెక్టర్‌కు ఎందుకు ఫిర్యాదు చేశావు అంటూ ప్రశ్నిస్తూ.. తనకు సంబంధం లేని విషయాలపై డాక్టర్‌ను వేధింపులకు గురిచేశాడని సదరు డాక్టర్ ఆరోపించింది. ఈ విషయమై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేయగా విచారణ చేస్తామని చెబుతూ దాటవేస్తున్నారన్నారు. కిందిస్థాయి సిబ్బందికి ఇచ్చే విలువ మెడికల్ ఆఫీసర్‌కు ఇవ్వడం లేదని కలత చెందిన డాక్టర్ ఉషారాణి తన విధులకు రాజీనామా చేస్తూ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలానికి రాజీనామా పత్రాన్ని అందజేసింది. ఈ విషయమై వైద్యాధికారినిని వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed