ఇకపై మార్కెట్‌లో... చూస్తేనే నోరూరే గులాబీ టమోటా, ఎర్ర ఉసిరికాయ..!

by Manoj |
ఇకపై మార్కెట్‌లో... చూస్తేనే నోరూరే గులాబీ టమోటా, ఎర్ర ఉసిరికాయ..!
X

దిశ, ఫీచర్స్ : మార్కెట్‌లో ఇకపై కలర్‌ఫుల్ టమోటాలు సందడి చేయనున్నాయి. గులాబీ, పసుపు టమోటాలు త్వరలోనే మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయి. సాధారణ రకం కంటే విభిన్నంగా ఉండే వీటిని వనపర్తి జిల్లా మోజర్ల హార్టికల్చర్ కళాశాలకు చెందిన జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌ అసోసియేట్ ప్రొఫెసర్ పిడిగాం సైదయ్య (41) అభివృద్ధి చేశారు. పెడిగ్రి మెథడ్‌లో పింక్ అండ్ ఎల్లో టమోటా, ఎర్ర ఉసిరికాయ, యార్డ్‌లాంగ్ బీన్స్‌ ఉత్తమ విత్తన రకాలను డెవలప్ చేసిన ఆయన.. వీటిని పరీక్ష నిమిత్తం జీడిమెట్లలోని హార్టికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు పంపించారు. కాగా వీటిని త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలిపారు పరిశోధకులు.

పింక్ టమోటా

సాధారణంగా థాయిలాండ్, మలేషియా, ఐరోపా దేశాల్లో ఉపయోగించే పింక్ టమోటాను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేశాడు సైదయ్య. వీటిలో ఆంథోసైనిన్ పిగ్మెంట్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఈ టమోటాల్లో అధికంగా ఉండగా, రుచిలో ఎక్కువ ఆమ్లత్వం కలిగి ఉంటాయని తెలిపాడు. 150 నుంచి 180 రోజుల వ్యవధిలో ఈ పంట సాగు చేయబడుతుందని.. 55 రోజుల నుంచి పండ్లు కాస్తాయని వివరించాడు.

పసుపు టమోటా

పసుపు టమోటా రకంలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండగా, విటమిన్ A అధికంగా ఉంటుంది. ఇక ఎరుపు ఉసిరికాయ అధిక దిగుబడినిచ్చే రకం కాగా ఆంథోసైనిన్ పిగ్మెంట్‌ను కలిగి ఉంటుంది.

యార్డ్ లాంగ్ బీన్స్

30-35 సెం.మీ పొడవు వరకు యార్డ్ లాంగ్ బీన్స్ ఉత్పత్తి చేయగా, ఫ్రెంచ్ బీన్స్ శీతాకాలంలో మాత్రమే తక్కువ ఉష్ణోగ్రతలో పండిస్తారు. యార్డ్ లాంగ్ బీన్స్ మాత్రం ఏడాది పొడవునా పండించే వీలుండటంతో ఇది రైతులకు లాభదాయకంగా ఉంటుంది.

టమోటాల చర్మం చాలా సన్నగా ఉండటం వల్ల రవాణా చేసేటప్పుడు సులభంగా దెబ్బతింటుంది. దీని షెల్ఫ్-లైఫ్ కేవలం ఏడు రోజులు కాగా పూరీలు, సాంబార్, చట్నీలకు సరైనది. ఇది సాధారణ రకాల కంటే వేగంగా ఉడుకుతుంది.

- పి యాదగిరి, AD హార్టికల్చర్ (అర్బన్ ఫామ్స్)

Advertisement

Next Story

Most Viewed