సారూ.. మా భూమి అమ్మం.. భూములు లాక్కుంటే కుటుంబాలు రోడ్డున పడ్తాయి

by samatah |
సారూ.. మా భూమి అమ్మం.. భూములు లాక్కుంటే కుటుంబాలు రోడ్డున పడ్తాయి
X

దిశ, శంకర్ పల్లి : మోకిలా గ్రామంలోని లావుని పట్టా భూముల సర్వే కోసం వెళ్లిన అధికారులను రైతులు రెండో రోజు కూడా అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా గ్రామంలోని సర్వేనెంబర్ 96 ,197లలో 700 ఎకరాలు లావుని పట్టా భూములు ఉన్నాయి. 8 దశాబ్దాల క్రితం అటవీ ప్రాంతంగా ఉన్న భూములను అప్పటి ప్రభుత్వం దళిత గిరిజన మైనారిటీ బిసి కులాలకు చెందిన రైతులకు బతుకుదెరువు నిమిత్తం పంపిణీ చేసింది. నాటి నుంచి నేటి వరకు ఆ కుటుంబాలకు చెందిన వారసులు పంటలు సాగు చేసుకుని బతుకుదెరువు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం పేదవారి పొట్ట కొట్టి వారి భూమిని లాక్కొని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని, భూములు లాక్కోవడం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడతాయని బాధిత రైతులు బోరున విలపిస్తున్నారు.

సర్వే ను అడ్డుకున్న మోకిలా బాధిత రైతు‌లు

శంకర్పల్లి తహశీల్దార్ సైదులు ఆధ్వర్యంలో రెండవ రోజైన గురువారం భూములు సర్వే చేసేందుకు సిబ్బందితో సహా భూముల వద్దకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న బాధిత రైతులు వెంటనే పొలాల వద్దకు వెళ్లి సర్వే చేయవద్దని తమకు న్యాయం జరిగేంత వరకు తమ భూములు సర్వే చేయకూడదని వారు విజ్ఞప్తి చేశారు. తమ భూములను ప్లాట్లు చేసి అమ్మి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తే తమకు సగానికి సగం కేటాయిస్తే ఒప్పు కుంటామని బాధిత రైతులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబావట్ రాజు నాయక్, మోకిలా సర్పంచ్ పట్లోళ్ల సుమిత్ర మోహన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు సభావట్ సరిత రాజు నాయక్, మోకిల మాజీ సర్పంచులు అడివయ్య, ఆనందం, మాజీ ఎంపీటీసీ యాదయ్య, మాజీ కో ఆప్షన్ నెంబర్ ఖాదర్ భాష, మోకిలా సొసైటీ చైర్మన్ గోపాల్ తదితరులు బాధిత రైతులకు మద్దతు పలికారు. వారు మాట్లాడుతూ బాధిత రైతులు పొలాల పై ఆధారపడి కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, భూములు కోల్పోతే కుటుంబాలు రోడ్డున పడతాయని, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లో భూములను ఇవ్వబోమని బాధిత రైతులు కరాఖండిగా తేల్చి చెప్పారు.

తాతల కాలంలో ఇచ్చిన భూములను లాక్కోవడం ఏంటి.. బాధిత రైతు మాజీ సర్పంచ్ ఆనంద్




తాతలు, తండ్రులు తమ కుటుంబాలు ఈ భూముల పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. దళిత గిరిజన, మైనారిటీ బీసీ కులాలకు చెందిన రైతులకు అప్పటి ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీ దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాలు ఇవ్వకపోగా ఉన్న భూములను కూడా లాక్కునే ప్రయత్నం చేయడం ఏంటి? భూములను లాక్కుంటే మా కుటుంబాలు రోడ్డున పడ్తాయి? ఎట్టి పరిస్థితుల్లో భూములను ఇచ్చేది లేదు.

బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం..





శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలో ఎన్నో ఏళ్ళ క్రితం లావుని పట్టా భూములను నిరుపేద కుటుంబాలకు బతుకుదెరువు నిమిత్తం పంపిణీ చేసింది. ప్రస్తుతం అధికారులు సర్వే చేసేందుకు రావడంతో గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లాం. బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ పెద్దల తో మాట్లాడి పరిష్కరించే దిశగా కృషి చేస్తా.

సభా వత్ రాజు నాయక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శంకర్పల్లి

ప్రభుత్వం రైతులతో చర్చించకుండా అధికారులతో సర్వే చేయించడం ఏంటి ?





తనకు ఎకరా16 గుంటల భూమి ఉంది. భూమి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారి ఒప్పందం మేరకు నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అధికార బలంతో ఏకంగా అధికారులతో సర్వే చేసి భూములు లాక్కోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

ఖాదర్ పాషా మాజీ ఎంపీటీసీ మోకిల

పేదల భూములతో ప్రభుత్వం వ్యాపారం చేస్తామంటే ఊరుకునేది లేదు : గోపాల్ మోకి ల సొసైటీ చైర్మన్




తాతల కాలంలో నిరుపేదల మైన మా కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం బతుకుదెరువు కోసం భూములను ఇచ్చింది. ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా భూములు సర్వే చేయడం ఏంటి? రెండు రోజులుగా సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. రైతుల భూములతో వ్యాపారం చేయాలని అధికార టీఆర్ఎస్ పార్టీ పన్నాగం పన్నడం ఎంతవరకు సమంజసం. రైతుల భూములను ప్లాట్లుగా చేసి ప్రభుత్వం అమ్ముకోవాలని చూస్తున్నప్పుడు ప్రభుత్వమే దిగివచ్చి రైతుల అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకుంటే మంచిది.

రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయం మేరకు ముందుకు సాగాలి..





ప్రభుత్వం కాంగ్రెస్ ఇందిరాగాంధీ హయాంలో పేదలకు బతుకుతెరువు కోసం ఇచ్చిన భూములతో వ్యాపారం చేయాలని చూడటం మంచిది కాదు. అది బలవంతంగా లాక్కోవాలని అధికారులతో సర్వే చేయించడం పెద్ద తప్పు. ప్రభుత్వం ముందు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రభుత్వం ఒక వైపు దళిత బంధు అమలు చేస్తూ ఇక్కడ దళితుల భూములను లాక్కోవడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల ముందు దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇస్తామని చెప్పి అధికారం చేపట్టాక దాని ఊసే ఎత్తకుండా ఇప్పుడు ఏకంగా దళితుల భూములను లాక్కోవాలని చూడడం సబబు కాదు.

పట్లోళ్ళ సుమిత్ర మోహన్ రెడ్డి సర్పంచ్ మోకిల

Advertisement

Next Story