'గాలి'ని శుద్ధిచేసే హెడ్‌ఫోన్స్!

by Manoj |
గాలిని శుద్ధిచేసే హెడ్‌ఫోన్స్!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య 'ఎయిర్ పొల్యుషన్'. పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన 'గాలి' పొందాలన్నా డబ్బులు చెల్లించక తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టెక్ కంపెనీ డైసన్.. రోజురోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యానికి పరిష్కారంగా గాలిని శుద్ధి చేసే ఇయర్ హెడ్‌ఫోన్స్‌ను రూపొందించింది.

డైసన్ జోన్ హెడ్‌ఫోన్స్.. ఫేస్ మాస్క్‌ల మాదిరిగా కాక ముఖాన్ని తాకకుండానే స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ప్రతీ ఇయర్ కప్‌లో ఒక మోటార్, కంప్రెసర్ ఫ్యాన్, ఎయిర్ ప్యూరిఫయింగ్ డ్యూయల్ లేయర్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇవి పుప్పొడి, బ్యాక్టీరియా, ధూళి, సల్ఫర్ లేదా నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయు కాలుష్య కారకాలతో పాటు 0.1 మైక్రాన్ల కంటే చిన్నవైనా 99% కణాలను శుభ్రపరుస్తాయి. ఈ శుద్ధి చేసిన గాలి హెడ్‌ఫోన్స్ దిగువ భాగంలో అయస్కాంతంగా జతచేసిన విజర్ ద్వారా ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి చేరుతుంది. కాగా ఊపిరితిత్తులకు స్వచ్ఛమైన గాలిని అందించడంలో ఇది 97% ప్రభావవంతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.


ఈ హెడ్‌ఫోన్స్ సెకనుకు 5 లీటర్ల స్వచ్ఛమైన గాలిని అందజేస్తాయని కంపెనీ పేర్కొంది. ఇక లెఫ్ట్ ఇయర్ కప్‌లోని ఎయిర్ క్వాలిటీ సెన్సార్.. రియల్ టైమ్ కాలుష్య స్థాయిలను పర్యవేక్షించి మన ఫోన్‌లోని యాప్‌కు డేటాను సెండ్ చేస్తుంది. ఫిల్టర్స్‌ను ఎప్పుడు మార్చాలో కూడా ఇదే తెలియజేస్తుంది. తక్కువ-ఫిల్ట్రేషన్ మోడ్‌లో నాలుగు గంటల బ్యాటరీ లైఫ్‌ ఇస్తుండగా.. అధిక వడపోత సమయంలో 1.5 గంటలు మాత్రమే సర్వీస్ అందిస్తుంది. 'బోస్, సోని' తదితర హెడ్‌ఫోన్స్‌లో కనిపించే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.

Advertisement

Next Story

Most Viewed