మంత్రుల సభకు హాజరు కాకుంటే.. డ్వాక్రా సంఘాలకు లోన్లు రావా..!

by Mahesh |
మంత్రుల సభకు హాజరు కాకుంటే.. డ్వాక్రా సంఘాలకు లోన్లు రావా..!
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: వైరా మున్సిపాలిటీ పరిధిలోని రింగ్ రోడ్డు సెంటర్ నందు సుమారు 89 లక్షల రూపాయల విలువైన ఖర్చుతో నూతనంగా నిర్మించిన మినీ ఇండోర్ స్టేడియం ప్రారంభించేందుకు అలాగే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వైరా రిజర్వాయర్ లో స్పీడ్ బోటు లను ప్రారంభించేందుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరు కావడంతో మంత్రుల పర్యటనను విజయవంతం చేసేందుకు కొందరు అధికారుల తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవానికి క్రీడాకారులు కొంతమంది మాత్రమే కనిపించగా అధిక శాతంలో మహిళా సంఘాల సభ్యులు దర్శనమివ్వడం విమర్శలకు దారి తీసింది. కొందరు మహిళా సంఘాల సభ్యులకు గ్రామ దీపిక లు హుకుం జారీ చేశారని.. మీటింగ్ కు తప్పనిసరిగా రావాలని.. లేకపోతే రుణాలు రావు అని తెలిపారని కొందరు మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది ఇలా ఉండగా సందట్లో సడేమియా లా కొందరు దొంగలు తమ చేతివాటానికి పని చెప్పారు. మంత్రుల సభ జరుగుతున్న ఇండోర్ స్టేడియం నందు మంత్రులతో కలిసి ఫోటోలు దిగేందుకు ఒకరి పై ఒకరు నెట్టుకుంటూ వారి ముచ్చట తీర్చుకునేందుకు ప్రయత్నించగా దొంగలు మాత్రం తమ చేతివాటానికి పని చెప్పి ఎంచక్కా వారి జేబులు ఖాళీ చేసి అందినకాడికి దండుకుంటున్నారు. అలాగే మంత్రుల పర్యటనను కవరేజి చేసేందుకు వెళ్లిన కొందరు విలేకర్ల జేబులు ఖాళీ చేశారని తీరా కార్యక్రమం అయిపోయిన తర్వాత జేబులు చూసుకోగా ఖాళీ జేబులు దర్శనమివ్వడం తో బాధితులు లబోదిబో అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed